లాక్‌డౌన్ వేళ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించడానికి అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అత్యవసర కేంద్రాలు పనిచేస్తున్నట్లు కేంద్ర హోంశాఖ తెలిపింది. ప్రజల ఫిర్యాదులను పరిష్కరించేందుకు 24 గంటలు పనిచేసే సహాయక కేంద్రాన్ని హోంశాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసినట్లు ఆ శాఖ సంయుక్త కార్యదర్శి శ్రీవాత్సవ చెప్పారు.
'24 గంటలూ అందుబాటులో సహాయక కేంద్రాలు' - కేంద్ర ప్రభుత్వం
కరోనా కారణంగా దేశం డౌన్లో ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అత్యవసర సహాయక కేంద్రాలు పనిచేస్తున్నట్లు తెలిపింది కేంద్ర హోంశాఖ. 24 గంటలూ హెల్ప్లైన్లు అందుబాటులో ఉంటాయని స్పష్టం చేసింది.
1930, 1944 నెంబర్లకు ఫోన్‌చేసి తమ సాధకబాధకాలు చెప్పుకోవచ్చని తెలిపారు. దేశంలో నిత్యావసర సరుకుల కొరత లేదన్న ఆమె... అన్ని రాష్ట్రాల్లో అత్యవసరంగా స్పందించే 112 నెంబర్ కూడా అందుబాటులో ఉందని తెలిపారు. లాక్‌డౌన్ కాలంలో ఈ నెంబర్‌ను ఎక్కువగా గర్భిణీలు, దివ్యాంగులు ఉపయోగిస్తూ.. సత్వర సేవలు పొందుతున్నట్లు చెప్పారు.
అలాగే లాక్‌డౌన్ నేపథ్యంలో దేశంలో ఉన్న విదేశీయులు తమ వీసా గడువు పెంచుకునేందుకు మే 3 అర్ధరాత్రి వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. అలా దరఖాస్తు చేసుకున్న వారికి మే 3 తరువాత కూడా ఎలాంటి జరిమానా కట్టకుండా 14 రోజుల పాటు అనుమతిస్తామని పేర్కొన్నారు.