భారత సైనికసత్తా, సాంస్కృతిక వైవిధ్యం, సామాజిక, ఆర్థిక ప్రగతి ప్రదర్శనకు 71వ గణతంత్ర వేడుకలు వేదిక కానున్నాయి. రాజ్‌పథ్‌లో జరిగే ఈ ఉత్సవాల కోసం కేంద్ర ప్రభుత్వం పెద్దఎత్తున ఏర్పాట్లు చేసింది. 71వ గణతంత్ర వేడుకలకు బ్రెజిల్ అధ్యక్షుడు బోల్సొనారో ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఇండియా గేట్ వద్ద ఉన్న జాతీయ యుద్ధ స్మారకాన్ని సందర్శించటంతో గణతంత్ర దినోత్సవ పరేడ్ మొదలు కానుంది. యుద్ధ స్మారకం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి సైనిక అమరవీరులకు ప్రధాని మోదీ నివాళి అర్పిస్తారు. ఇదివరకు మాదిరిగా కాకుండా అమర్ జవాన్ జ్యోతికి బదులుగా జాతీయ యుద్ధ స్మారకం వద్ద ప్రధాని నివాళి అర్పించనున్నారు. ఆ తర్వాత ప్రధాని సహా ఇతర ప్రముఖులు గణతంత్ర వేడుకలు జరిగే రాజ్‌పథ్‌కు చేరుకుంటారు. జాతీయ గీతాలాపన తర్వాత గౌరవ సూచకంగా 21 మంది సైనికులు గాల్లోకి కాల్పులు జరుపుతారు. అనంతరం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ జాతీయపతాకాన్ని ఎగురవేస్తారు.
అవార్డుల ప్రదానం
సైనిక దళాల గౌరవ వందనంతో గణతంత్ర దినోత్సవ పరేడ్ ప్రారంభమవుతుంది. ఈ పరేడ్‌కు దిల్లీ ప్రాంత జనరల్ ఆఫీసర్ కమాండింగ్, లెఫ్టినెంట్ జనరల్ అసిత్ మిస్త్రీ నేతృత్వం వహించనున్నారు. దిల్లీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ మేజర్ అలోక్ కక్కర్.. సెకండ్ ఇన్ కమాండ్‌గా వ్యవహరించనున్నారు. గణతంత్ర పరేడ్ ముగిసిన అనంతరం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సైనిక దళాలకు గ్యాలంటరీ అవార్డులను ప్రదానం చేస్తారు. విశ్రాంత సుబేదార్ మేజర్, గౌరవ కెప్టెన్ బానాసింగ్, 18 గ్రెనెడియర్‌కు చెందిన సుబేదార్ యోగేంద్రసింగ్ యాదవ్, 13 జేఏకే రైఫిల్స్‌కు చెందిన సుబేదార్ సంజయ్‌కుమార్‌కు సైనిక అత్యున్నత పురస్కారం 'పరమవీరచక్ర' అవార్డు అందజేయనున్నారు. విశ్రాంత మేజర్ జనరల్ సైరస్ పితవాలా, విశ్రాంత లెఫ్టినెంట్ కల్నల్ జస్‌రామ్ సింగ్, లెఫ్టినెంట్ కల్నల్ శ్రీరామ్‌కుమార్.. 'అశోకచక్ర' పురస్కారం అందుకోనున్నారు.
సైనిక సత్తా ప్రదర్శన
గణతంత్ర వేడుకల కవాతులో గ్వాలియర్ లాన్సర్‌కు చెందిన అశ్వ దళం.. ముందువరుసలో సాగనుంది. ప్రపంచంలో ఇప్పటికీ సేవలందిస్తున్న ఏకైక అశ్వదళంగా గుర్తింపు పొందిన ఈ రెజిమెంట్.. 1953 ఆగస్టు ఒకటిన ఏర్పాటైంది. భారత సైన్యానికి చెందిన 8 యాంత్రిక స్తంభాలు, 6 కవాతు కంటిజెంట్లు, రుద్ర, ధ్రువ్ అత్యాధునిక తేలిక హెలికాప్టర్ల ఫ్లై-పాస్ట్ ద్వారా ఆర్మీ ఏవియేషన్ ప్రాతినిధ్యం వహిస్తుంది. దేశీయంగా అభివృద్ధి చేసిన యుద్ధ ట్యాంక్, టి-90 భీష్మ, పదాతిదళ పోరాట వాహనం-బాల్‌వే మెషిన్ పికేట్, కె-9 వజ్రా-టి, ధనుష్ ఆయుధ వ్యవస్థ, సైన్యంలో కొత్తగా ప్రవేశపెట్టిన 5 మీటర్ల షార్ట్ స్పాన్ యాంత్రిక బ్రిడ్జింగ్ సిస్టం, సర్వత్రా బ్రిడ్జ్ సిస్టం, ట్రాన్స్‌పోర్టబుల్ శాటిలైట్ టెర్మినల్, ఆకాష్ ఆయుధ వ్యవస్థ.. ఈ పరేడ్‌లో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. మొదటిసారి మార్చింగ్ కార్ప్స్ ఆఫ్ ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ బృందం, ది కంబైన్డ్ బ్యాండ్ ఆఫ్ బెంగాల్ ఇంజనీర్స్ గ్రూప్ అండ్ సెంటర్, బ్రిగేడ్ ఆఫ్ గార్డ్స్ ట్రైనింగ్ సెంటర్, 3 ఎలక్ట్రానిక్స్, మెకానికల్ ఇంజనీర్స్ సెంటర్, మద్రాస్ రెజిమెంటల్
సెంటర్ ఉన్నాయి.
లెఫ్టినెంట్ జితిన్ మల్కాట్ నేతృత్వంలోని 144 మందితో కూడిన నౌకాదళ బృందం కవాతులో పాల్గొంటుంది. 144 మందితో కూడిన వైమానిక దళానికి ఫ్లైట్ లెఫ్టినెంట్ శ్రీకాంత్ శర్మ నాయకత్వం వహిస్తారు. రఫేల్ విమానం, తేజస్ విమానం, లైట్ కంబాట్ హెలికాప్టర్, ఆకాష్ క్షిపణుల వ్యవస్థ, ఆస్ట్రా క్షిపణుల నమూనాలను ఈ పరేడ్‌లో ప్రదర్శిస్తారు. మొట్టమొదటి ఉపగ్రహ నిరోధక మిషన్.. మిషన్ శక్తిని డీఆర్డీఓ ప్రదర్శించనుంది. సీఆర్పీఎఫ్, ఐటీబీపీ, సీఐఎస్ఎఫ్, దిల్లీ పోలీసులు, బీఎస్ఎఫ్ బృందాలు రాష్ట్రపతికి గౌరవ వందనం సమర్పిస్తూ మార్చ్‌ఫోస్ట్‌లో పాల్గొంటాయి.
తొలిసారిగా సీఆర్పీఎఫ్ మహిళా జవాన్లు
ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, సైనిక బ్యాండ్ బృందాలు కూడా పరేడ్ నిర్వహిస్తాయి. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 16 శకటాలు.. దేశ భౌగోళిక, సాంస్కృతిక వైవిధ్యాన్ని చాటనున్నాయి. స్టార్టప్ ఇండియా, ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన, జల్ జీవన్ మిషన్, కేంద్ర షిప్పింగ్ మంత్రిత్వ శాఖల శకటాలు కూడా ఈ పరేడ్‌లో పాల్గొంటాయి. మొట్టమొదటిసారిగా సీఆర్పీఎఫ్కు చెందిన మహిళా జవాన్లు ద్విచక్రవాహనాలపై విన్యాసాలు చేయనున్నారు. ఈ బృందానికి సీమా నాగ్ నేతృత్వం వహించనున్నారు. చివరగా వైమానిక దళ విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. జాతీయ గీతాలాపన తర్వాత బెలూన్లను గాల్లోకి వదిలి గణతంత్ర వేడుకలను వైభవంగా ముగించనున్నారు.