శుక్రవారం నుంచి జరగనున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఫలప్రదంగా ఉండనున్నాయని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. సభలు సజావుగా సాగేందుకు సహకరించనున్నట్టు అన్ని పార్టీల నేతలు తనకు హామీనిచ్చినట్టు పేర్కొన్నారు బిర్లా. సమావేశాల నేపథ్యంలో జరిగిన అఖిలపక్ష భేటీ అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు.
వాళ్లు నాకు హామీ ఇచ్చారు: ఓం బిర్లా - ALL PARTY MEETING
దిల్లీలో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన అఖిలపక్ష భేటీ జరిగింది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలపై చర్చించారు. ఈ భేటీకి ప్రధాని మోదీ సహా వివిధ పార్టీల నేతలు హాజరయ్యారు. సభ సజావుగా సాగేందుకు సహకరిస్తామని నేతలు తనకు హామీ ఇచ్చినట్టు బిర్లా తెలిపారు.
"సభలు ఎలాంటి అడ్డంకులు లేకుండా జరుగుతాయని అన్ని పార్టీల నేతలు నాకు హామీనిచ్చారు. ప్రజల శ్రేయస్సు కోసం పనిచేయాలని అభిప్రాయపడ్డారు. ఈ సమావేశాలకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా ముందుకు సాగాలని నేను కూడా వారిని అభ్యర్థించా. ఈసారి జరిగే సమావేశాలు కూడా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే ఉంటాయని నేను విశ్వసిస్తున్నా."
--- ఓం బిర్లా, లోక్సభ స్పీకర్.
ఈ భేటీకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా వివిధ పార్టీల నేతలు హాజరయ్యారు.ఈ సారి బడ్జెట్ సమావేశాలు రెండు విడతలుగా నిర్వహించనున్నారు. శుక్రవారం నుంచి ఫిబ్రవరి 11 వరకు తొలి విడత... మార్చి 2 నుంచి ఏప్రిల్ 3 వరకు రెండో విడత సమావేశాలు జరగనున్నాయి.