తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కర్​'నాటకీయం': రాజకీయ సంక్షోభానికి నేడే క్లైమాక్స్​..!

రోజుకో మలుపు తిరుగుతోన్న కన్నడ రాజకీయంలో సంక్షోభం కొనసాగుతోంది. 14 మంది ఎమ్మెల్యేలకు తోడు మంత్రులుగా ఉన్న ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు పదవులకు రాజీనామా చేసి భాజపాకు మద్దతు ప్రకటించారు. రెబల్‌ ఎమ్మెల్యేలతో జత కట్టారు. శాసననసభ్యుల రాజీనామాలపై స్పీకర్​ నేడు నిర్ణయం తీసుకోనున్నారు. ఒక వేళ రాజీనామాలను ఆమోదిస్తే కుమారస్వామి సర్కారు పతనం తథ్యం.

By

Published : Jul 9, 2019, 5:22 AM IST

Updated : Jul 9, 2019, 7:29 AM IST

కర్ణాటకీయం: నేడే సంకీర్ణ సర్కారుకు క్లైమాక్స్​..!

కర్ణాటకీయం: నేడే సంకీర్ణ సర్కారుకు క్లైమాక్స్​..!

కర్ణాటక రాజకీయాలపై దేశ వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. కూటమి సర్కారుపై అసంతృప్తితో ఇప్పటికే మొత్తం 14 మంది శాసనసభ్యులు రాజీనామా చేశారు. తాజాగా మరో ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు పదవులకు రాజీనామా చేసి భాజపాకు మద్దతు ప్రకటించారు.

ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు మంత్రులతో రాజీనామా చేయించిన కాంగ్రెస్- జేడీఎస్‌ అధినాయకత్వం రెబల్‌ నేతలకు అమాత్య పదవులను ఇచ్చేందుకు సిద్ధమైంది. నేడు తిరుగుబాటు ఎమ్మెల్యేల రాజీనామాలను స్పీకర్‌ ఆమోదిస్తే కర్ణాటక శాసనసభలో భాజపాకే మెజార్టీ రానుంది.

తీరిక లేని భేటీలు...

రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై చర్చించేందుకు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రహస్య ప్రదేశంలో సమావేశమయ్యారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలపై న్యాయపరమైన చర్యలు చేపట్టాలని నేతలు యోచిస్తున్నట్టు సమాచారం .

సోమవారం ఉదయం కర్ణాటక ఉప ముఖ్యమంత్రి పరమేశ్వర నివాసంలో కర్ణాటక కాంగ్రెస్‌ వ్యవహారాల బాధ్యుడు కెేసీ వేణుగోపాల్‌, సీఎల్పీ నేత సిద్ధరామయ్యతో భేటీ అయ్యారు సీఎం కుమార స్వామి. మంత్రుల రాజీనామాలపై నిర్ణయం తీసుకున్నారు. మంత్రులందరూ రాజీనామా చేశారని త్వరలోనే మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ ఉంటుందని కర్ణాటక సీఎం కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.

బుజ్జగింపు చర్యలు...

తిరుగుబాటు ఎమ్మెల్యేలతో మంతనాలు జరిపేందుకు కాంగ్రెస్‌ నేత డీకే శివకుమార్‌ బెంగళూరు నుంచి ముంబయి బయలుదేరి వెళ్లారు. అయితే తిరుగుబాటు ఎమ్మెల్యేలు ముంబయి నుంచి గోవా పయనమయ్యారు. మరోవైపు సంక్షోభం త్వరలోనే సమసిపోనుందని సీఎం కుమారస్వామి వ్యాఖ్యానించారు. ఎలాంటి ఆందోళనా అవసరం లేదన్నారు. జేడీఎస్‌ ఎమ్మెల్యేలను తాజ్‌వెస్ట్‌ ఎండ్‌ హోటల్‌ నుంచి దేవనహళ్లిలోని గోల్ఫ్‌షైర్‌కు తరలించారు.

ఆఖరి ప్రయత్నాలు...

13 నెలల కాంగ్రెస్‌ జేడీఎస్‌ సంకీర్ణ సర్కారును కాపాడుకునేందుకు కర్ణాటకలో ఆఖరి యత్నాలు సాగుతున్నాయి. రాజీనామా చేసిన తిరుగుబాటు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కట్టబెట్టి వారిని బుజ్జగించాలని నిర్ణయించిన కాంగ్రెస్‌- జేడీఎస్‌ నేతలు ప్రస్తుతం మంత్రివర్గంలో ఉన్న అమాత్యులందరితోనూ రాజీనామా చేయించారు. వారిలో 21 మంది కాంగ్రెస్‌ మంత్రులు, 9 మంది జేడీఎస్‌ మంత్రులు ఉన్నారు.

మరో ఝలక్...

ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు కాంగ్రెస్‌- జేడీఎస్‌ ప్రయత్నాలు సాగిస్తుండగానే ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు మంత్రి పదవులకు రాజీనామా చేసి భాజపాకు మద్దతు ప్రకటించారు. ఇటీవలే కుమారస్వామి మంత్రివర్గంలో చేరిన స్వతంత్ర శాసనసభ్యుడు నగేష్‌ మంత్రి పదవికి రాజీనామా చేసి ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరిస్తున్నట్లు ప్రకటించారు.

రాజీనామా అనంతరం ప్రత్యేక విమానంలో ముంబయి వెళ్లి కాంగ్రెస్‌ జేడీఎస్‌ తిరుగుబాటు ఎమ్మెల్యేలతో కలిశారు నగేష్​. కాంగ్రెస్‌ కోటాలో మంత్రి పదవి పొందిన మరో స్వతంత్ర ఎమ్మెల్యే ఆర్​ శంకర్‌ మంత్రి పదవి నుంచి వైదొలిగి భాజపాకు మద్దతు ప్రకటించి ముంబయి వెళ్లారు.

లెక్కల చిక్కులు...

ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతుతో 224 మంది సభ్యులు గల కర్ణాటక అసెంబ్లీలో భాజపా బలం 107కి చేరింది. స్పీకర్‌ను మినహాయిస్తే కాంగ్రెస్‌ జేడీఎస్‌ బలం 116కి పడిపోయింది. మెజార్టీకి 113 మంది అవసరంకాగా ఆదివారం తిరుగుబాటు బావుటా ఎగురవేసిన 13 మంది ఎమ్మెల్యేల రాజీనామాలను స్పీకర్‌ ఆమోదిస్తే కాంగ్రెస్‌- జేడీఎస్‌ సంకీర్ణ సర్కారు బలం 103కి పడిపోతుంది. అప్పుడు ప్రభుత్వ ఏర్పాటుకు మెజార్టీ 106 అవుతుంది. అప్పుడు భాజపాకే ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది.

Last Updated : Jul 9, 2019, 7:29 AM IST

ABOUT THE AUTHOR

...view details