డీజీసీఏ గతంలో గుర్తించిన అన్ని సమస్యలను కోజికోడ్ విమానాశ్రయ అధికారులు ఇప్పటికే పరిష్కరించారని పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి వెల్లడించారు. రన్‌వే సహా పలు భద్రతా లోపాలపై గతేడాదే కోజికోడ్ ఎయిర్పోర్ట్ డైరెక్టర్‌కు డీజీసీఏ షోకాజ్ నోటీసులు జారీ చేసిందని వార్తలు ప్రసారమైన నేపథ్యంలో మంత్రి స్పందించారు. ఇలాంటి సమస్యల గురించి నోటీసులు జారీ చేయడం సాధారణమేనని స్పష్టం చేశారు.
"సమస్యలను గుర్తించి ఎయిర్పోర్ట్ అధికారులకు తెలిజేయడం సాధారణమే. రబ్బర్ నిక్షేపాలు, నీరు నిలిచిపోవడం, పగుళ్లు వంటి సాధారణ సమస్యల గురించి కోజికోడ్ ఎయిర్పోర్ట్ నిర్వహాకులకు డీజీసీఏ సమాచారం అందించింది. వాటిని అధికారులు పరిష్కరించారు."
-హర్దీప్ సింగ్ పూరి, పౌర విమానయాన శాఖ మంత్రి
ప్రమాద ఘటనపై ఎయిర్‌క్రాఫ్ట్ యాక్ట్ ప్రకారం దర్యాప్తుకు ఆదేశించినట్లు తెలిపారు పూరి. విచారణలో వెలుగుచూసిన విషయాలను ప్రజల ముందు ఉంచుతామని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎలాంటి వదంతులు సృష్టించకుండా అందరూ సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు.
"ప్రమాదానికి గురైన విమాన డిజిటల్ ఫ్లైట్ డేటా రికార్డర్(డీఎఫ్‌డీఆర్), కాక్‌పిట్ వాయిస్ రికార్డర్(సీవీఆర్)ను స్వాధీనం చేసుకున్నాం. ఎయిర్‌క్రాఫ్ట్ ప్రమాద దర్యాప్తు బృందం దీనిపై విచారణ చేపడుతోంది."
-హర్దీప్ సింగ్ పూరి, పౌర విమానయాన శాఖ మంత్రి