తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆరోగ్యభారతం.. ఎంతెంత దూరం?

దేశానికిప్పుడు ఆధునిక వైద్యరంగంలో వచ్చిన మార్పులకు అనుగుణంగా, విస్తరిస్తున్న ప్రజావసరాలకు తగినట్లుగా, స్వయం ప్రతిపత్తి కలిగిన మరిన్ని వైద్యసంస్థలు అవసరమని కేంద్రం గుర్తించింది.  ఈ క్రమంలో దేశవ్యాప్తంగా అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ(ఎయిమ్స్‌)ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. మరి వాటి పరిస్థితి ప్రస్తుతం ఏవిధంగా ఉందో తెలుసుకుందాం?

By

Published : Feb 5, 2020, 10:05 AM IST

Updated : Feb 29, 2020, 6:08 AM IST

hospital
ఆరోగ్యభారతం.. ఎంతెంత దూరం?

ఆధునిక వైద్యరంగంలో వచ్చిన మార్పులకు అనుగుణంగా, విస్తరిస్తున్న ప్రజావసరాలకు తగినట్లుగా, స్వయంప్రతిపత్తి కలిగిన మరిన్ని వైద్యసంస్థలు అవసరమని భారత ప్రభుత్వం గుర్తించింది. ఈ క్రమంలో ఆరోగ్య రంగంలో నిపుణులైన మానవ వనరుల కొరతనూ పరిష్కరించాలనే లక్ష్యంతో దేశవ్యాప్తంగా అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ(ఎయిమ్స్‌)లను ఏర్పాటు చేయాలని సంకల్పించింది. ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష యోజన కింద వీటిని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది.

2012లో నాటి ప్రభుత్వం భోపాల్‌ (మధ్యప్రదేశ్‌), భువనేశ్వర్‌ (ఒడిశా), జోధ్‌పూర్‌ (రాజస్థాన్‌), పట్నా (బిహార్‌), రాయ్‌పుర్‌ (ఛత్తీస్‌గఢ్‌), రిషీకేశ్‌ (ఉత్తరాఖండ్‌)లలో, 2013లో రాయబరేలీ(ఉత్తర్‌ప్రదేశ్‌)లో ఎయిమ్స్‌లను ప్రారంభించింది. ఆ తరవాత 2018లో మంగళగిరి (ఆంధ్రప్రదేశ్‌), నాగ్‌పుర్‌(మహారాష్ట్ర), గోరఖ్‌పూర్‌(ఉత్తర్‌ప్రదేశ్‌), భటిండా (పంజాబ్‌), బీబీనగర్‌(తెలంగాణ), కల్యాణి (పశ్చిమ్‌బంగ), దేవగఢ్‌ (ఝార్ఖండ్‌)లకు ఎయిమ్స్‌లు కేటాయించారు. వీటిలో కొత్తగా వైద్య విదార్థుల ప్రవేశాలకు ఈ ఏడాది నుంచే అనుమతినిచ్చారు.

ఆరోగ్య సంరక్షణే ప్రధానం

భవిష్యత్తులో మరిన్ని ఎయిమ్స్‌లను స్థాపించే దిశగా ప్రణాళికల్నీ సిద్ధం చేశారు. గువాహటి (అసోం), సాంబ, అవంతిపుర (జమ్మూకశ్మీర్‌), బిలాస్‌పూర్‌ (హిమాచల్‌ ప్రదేశ్‌), మదురై (తమిళనాడు), దర్భంగ(బిహార్‌), రాజ్‌కోట్‌ (గుజరాత్‌), రేవారి (హరియాణా)లలోనూ వివిధ దశల్లో ఎయిమ్స్‌లు స్థాపించే దిశగా కేంద్రం ముందుకు సాగుతోంది. ప్రజల ఆరోగ్య సంరక్షణే ప్రధాన ధ్యేయంగా, ప్రాంతీయ అసమానతల్ని తగ్గించే లక్ష్యంతో వీటి ఏర్పాటును వేగంగా పూర్తి చేయాలని భావించింది.

ఇదేకాకుండా, ఇటీవలి కాలంలో దేశంలో వైద్య విద్యను మెరుగుపరచేందుకు కేంద్రం పలు చర్యల్ని తీసుకుంది. వైద్యుల పదవీ విరమణ వయసును 65 సంవత్సరాలకు పెంచడం, మరిన్ని వైద్య, నర్సింగ్‌ కళాశాలలను ఏర్పాటు చేయడం, నిపుణుల కొరతను అధిగమించేందుకు, వైద్యులకు అనేక అంశాల్లో నైపుణ్యాల్ని పెంచడం, డిగ్రీ, పీజీ స్థాయిలో వైద్యవిద్యలో సవరణలు ప్రతిపాదించడం, కోర్సుల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్‌ తప్పనిసరి చేయడం, 70 వైద్య కళాశాలలను ఉన్నతీకరించడం, సూపర్‌ స్పెషాలిటీ బ్లాక్‌ల ఏర్పాటు తదితర చర్యలకు పూనుకొంది.

అవరోధాలెన్నో...

ఎన్నో స్థానిక సమస్యల కారణంగా కొన్ని ఎయిమ్స్‌లకు సంబంధించి పనులు వేగంగా సాగడం లేదు. 2019-20లో రూ.5,100 కోట్లదాకా ఖర్చు చేసినా, కొత్తగా మంజూరు చేసిన 15 ఎయిమ్స్‌లపై ఆరోగ్యశాఖ సంతృప్తికరమైన పురోగతి సాధించలేకపోయింది. రాయబరేలీ, కల్యాణి, భటిండా, దేవగఢ్‌, బీబీనగర్‌, గోరఖ్‌పూర్‌లలో 50 సీట్ల చొప్పున ఎంబీబీఎస్‌ (2019-20) మొదటి బ్యాచ్‌ ప్రారంభించారు. నాగ్‌పూర్‌, భటిండాలలో ఓపీ సేవలు ప్రారంభమయ్యాయి, భూమి, నీరు, విద్యుత్‌ సమస్యల్ని పరిష్కరించుకోవాల్సి ఉన్నందువల్ల చాలా సంస్థల్లో నిర్మాణ పనులు మందగించినట్లు ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. రాయబరేలీ ఎయిమ్స్‌లో నిర్మాణం నిలిచిపోయింది. యాభై ఎకరాల అదనపు భూమికి సంబంధించిన అంశం అపరిష్కృతంగా ఉంది. నీటి వనరుల సేకరణ పూర్తికాలేదు. పాత భవనాల్ని కూల్చివేయాల్సి ఉంది. ఇలాంటి అనేక అవరోధాలు వేధిస్తున్నాయి.

గోరఖ్‌పూర్‌లో తరగతులు ప్రారంభమైనా, ఆసుపత్రి నిర్మాణ పనులు కేవలం యాభై శాతమే పూర్తయ్యాయి. ప్రాంగణంద్వారా ప్రవహించే కాలువ మళ్లింపు పనుల్ని వేగంగా పూర్తిచేయాల్సి ఉంది. వరద నీటిని బాహ్య కాలువకు మళ్లించే పనులు మందకొడిగా సాగుతున్నాయి. మంగళగిరిలో నీటి సరఫరా, వరద నీటి కాలువ, ప్రాంగణానికి ప్రధాన రహదారి ఏర్పాటు, విద్యుత్తు ఉపకేంద్రం నిర్మాణం, క్షయవ్యాధి ఆరోగ్య కేంద్రం పాత భవనం కూల్చివేయడం వంటి పనులు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి.

కశ్మీర్‌లో ఎయిమ్స్‌ కోసం ప్రతిపాదించిన 15 ఎకరాల స్థలం వ్యాజ్యంలో చిక్కుకుంది. బిహార్లో కేంద్రం ఆమోదం కోసం పంపాల్సిన స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఖరారు చేయలేదు. రాజ్‌కోట్‌, దేవగఢ్‌, బీబీనగర్‌లలో ఆస్పత్రులు మంజూరైనా స్థానిక సమస్యలున్నాయి. హరియాణాలో ఎయిమ్స్‌ నిర్మాణం, అటవీ భూముల మార్పిడి కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను కేంద్ర పర్యావరణ శాఖ అటవీ సలహా కమిటీ తిరస్కరించడంతో దీని నిర్మాణం ఇబ్బందుల్లో పడింది.

సమన్వయ కృషితోనే

కేంద్ర ప్రభుత్వం 21 ఎయిమ్స్‌, 75 ప్రభుత్వ వైద్య కళాశాలలతో సహా, పలు సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులను బలోపేతం చేసేందుకు 2019-20లో నాలుగు వేల కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసింది. అదనంగా మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ నుంచి వచ్చే పదేళ్లలో ప్రభుత్వం తిరిగి చెల్లించేలా రూ.3,500 కోట్లు రుణంగా మంజూరయ్యాయి. వీటిలో ఇప్పటిదాకా రూ.1,100 కోట్లు వినియోగించారు. 2009-2019 వరకు, 15 కొత్త ఎయిమ్స్‌ల నిర్మాణానికి రూ.20,756 కోట్లదాకా అనుమతి లభించగా, వాటిని 2020-2023 మధ్య పూర్తి చేయాలనేది లక్ష్యం.

అయితే, కొత్తగా రూపొందుతున్న ఎయిమ్స్‌లు బాలారిష్టాల్ని అధిగమించి ప్రజల ఆదరణ పొందేలా రూపుదిద్దుకొనే అవకాశాలు తక్కువే. వైద్య విశ్వవిద్యాలయాల్ని ఆసుపత్రులకు అనుసంధానంగా నిర్మించాలి. అవి జనానికి ఉచిత సేవలు అందించి నమ్మకం పెంచుకోవాలి. నిర్మాణ దశలోనే అనేక అడ్డంకులతో కునారిల్లుతున్న సంస్థలు ఎన్నేళ్లకు ఉన్నత స్థాయికి చేరతాయనేది నిర్దిష్టంగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. సంఖ్యాపరంగా ఎన్ని ఎయిమ్స్‌లు ఏర్పాటు చేసినా, అవి ప్రజల ఆరోగ్య భవిష్యత్తుకు భద్రమైన బాటలు వేయాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయ కృషితోనే ఇది సాకారమవుతుందనేది సుస్పష్టం.

కొరవడిన నైపుణ్యం

దేశంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న ఎయిమ్స్‌లు సమస్యలతో సతమతమవుతున్న నేపథ్యంలో- వీటికి మూలసంస్థగా భావించే దిల్లీ ఎయిమ్స్‌ అంతర్గత పనితీరు, వైఫల్యాల్ని లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. భారతదేశ అత్యున్నత ఆరోగ్య సంస్థ వైద్య విద్య, పరిశోధనల్లో నైపుణ్యాన్ని పెంపొందించే బోధన ఆసుపత్రిగా ఎదగాలని భావించినా- బోధన, పరిశోధనలకు తగిన ప్రాధాన్యం కల్పించలేని ఓ పెద్ద ఆసుపత్రిగా మాత్రమే అభివృద్ధి చెందిందని 2018లో కాగ్‌ ఎయిమ్స్‌పై విడుదల చేసిన అధ్యయన నివేదికలో స్పష్టం చేసింది.

ఎయిమ్స్‌కు కేటాయించిన నిధుల్లో కేవలం రెండు శాతం మాత్రమే పరిశోధనల కోసం ఖర్చు చేస్తున్నట్లు తెలిపింది. అనేక పరిశోధనలు బహుళ జాతి సంస్థలతో కుదుర్చుకున్న ఒప్పదంలో భాగంగా జరుగుతున్నవే తప్ప, ఎయిమ్స్‌ అధ్యాపకులైన పరిశోధకుల ద్వారా జరగడం లేదు. ఒకవైపు మనదేశం వైద్యుల కొరతతో సతమతమవుతూ ప్రత్యామ్నాయాల్ని వెతుక్కునే ప్రయత్నాల్లో ఉండగా, ఎయిమ్స్‌లో శిక్షణ పొందిన వైద్యుల్లో 49శాతం విదేశాలకు వెళ్లిపోయారనేది కఠిన వాస్తవం. ఎయిమ్స్‌లో సిబ్బంది కొరత కారణంగా కొన్ని శస్త్రచికిత్సల కోసం రోగులు ఏళ్ల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఉందంటే అతిశయోక్తి కాదు.

మౌలిక సదుపాయాల ఆధునికీకరణకు విఫలం

ఔట్‌పేషంట్‌ విభాగంలో కేవలం ఒక వైద్యుడు ఒక రోగికి నాలుగు నుంచి తొమ్మిది నిమిషాలు మాత్రమే కేటాయిస్తున్నట్లు ఒక అధ్యయనంలో తేలింది. కాగ్‌ నివేదిక పలు అంశాల్లో ఎయిమ్స్‌ను తప్పుపట్టింది. అనేక లోపాలు ఎత్తి చూపింది. దేశ ప్రజారోగ్య మౌలిక సదుపాయాల ఆధునికీకరణకు నాయకత్వం వహించడంలో ఎయిమ్స్‌ విఫలమైందన్నది కాగ్‌ నివేదిక సారాంశం. వైద్య కేంద్రాల ఏర్పాటులో జాప్యం, పరికరాల కొనుగోలులో అవకతవకలు వంటి అంశాల్నీ గుర్తించింది. సంస్థాపరమైన అవినీతి, ఆర్థిక దుర్వినియోగం సహా పలు కేసులపై దర్యాప్తు జరుగుతోంది.

ఎయిమ్స్‌లు అనేక సమస్యలతో సతమతమవుతున్నాయనేది నిష్ఠుర సత్యం. 2012-13లో ఎయిమ్స్‌కు పరిశోధనల కోసం విడుదలైన సంస్థాగత నిధులు కేవలం రూ.1.31 కోట్లు. సంస్థ విద్యార్థులు చాలామంది విదేశాల్లో స్థిరపడటమో, వైద్యవృత్తిని చేపట్టడమో జరిగింది. కాలక్రమేణా ఎయిమ్స్‌ ప్రతిష్ఠ మసకబారుతోందనేది పలువురు సీనియర్‌ వైద్యులు, నిపుణుల అభిప్రాయం. శాస్త్రీయ అంశాలు, రోగనిర్ధారణలో మెరుగైన పనితీరు కనబరుస్తున్నా, రోగి సంరక్షణలో అలసత్వం సంస్థ ప్రతిష్ఠను దెబ్బ తీస్తున్నాయి. పెద్ద సంఖ్యలో వచ్చే రోగులకు సరైన వసతులు కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారు.

ఓపీ నిర్వహణపై తీవ్రవిమర్శలున్నాయి. రాష్ట్రస్థాయిలోని ఆసుపత్రులు ఎప్పుడైనా సంక్లిష్ట కేసుల్ని ఎయిమ్స్‌కు పంపించాలనుకుంటే, అందుకు అవసరమైన వ్యవస్థ లేదు. చిన్నపాటి జబ్బులున్న రోగుల్ని చేర్చుకుంటుండటంతో ఎయిమ్స్‌ సాధారణ స్థాయి ఆసుపత్రిగా మారిపోతోంది. సంస్థలో అనేక అవినీతి ఉదంతాలూ బయటపడుతున్నాయి. దేశంలో ఎయిమ్స్‌లాంటి మరిన్ని సంస్థల అవసరం కచ్చితంగా ఉంది. కాకపోతే, అత్యుత్తమ సంస్థలు అద్భుత వ్యక్తుల సమీకరణతో సాధ్యమవుతాయే తప్ప- కేవలం మానవ వనరుల సమాహారంతోనే కాదు.

ప్రతిష్ఠ మసకబారుతోంది

ఎయిమ్స్‌లు అనేక సమస్యలతో సతమతమవుతున్నాయనేది నిష్ఠుర సత్యం. 2012-13లో ఎయిమ్స్‌కు పరిశోధనల కోసం విడుదలైన సంస్థాగత నిధులు కేవలం రూ.1.31 కోట్లు. సంస్థ విద్యార్థులు చాలామంది విదేశాల్లో స్థిరపడటమో, వైద్యవృత్తిని చేపట్టడమో జరిగింది. కాలక్రమేణా ఎయిమ్స్‌ ప్రతిష్ఠ మసకబారుతోందనేది పలువురు సీనియర్‌ వైద్యులు, నిపుణుల అభిప్రాయం. శాస్త్రీయ అంశాలు, రోగనిర్ధారణలో మెరుగైన పనితీరు కనబరుస్తున్నా, రోగి సంరక్షణలో అలసత్వం సంస్థ ప్రతిష్ఠను దెబ్బ తీస్తున్నాయి.

పెద్ద సంఖ్యలో వచ్చే రోగులకు సరైన వసతులు కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారు. ఓపీ నిర్వహణపై తీవ్రవిమర్శలున్నాయి. రాష్ట్రస్థాయిలోని ఆసుపత్రులు ఎప్పుడైనా సంక్లిష్ట కేసుల్ని ఎయిమ్స్‌కు పంపించాలనుకుంటే, అందుకు అవసరమైన వ్యవస్థ లేదు. చిన్నపాటి జబ్బులున్న రోగుల్ని చేర్చుకుంటుండటంతో ఎయిమ్స్‌ సాధారణ స్థాయి ఆసుపత్రిగా మారిపోతోంది. సంస్థలో అనేక అవినీతి ఉదంతాలూ బయటపడుతున్నాయి. దేశంలో ఎయిమ్స్‌లాంటి మరిన్ని సంస్థల అవసరం కచ్చితంగా ఉంది. కాకపోతే, అత్యుత్తమ సంస్థలు అద్భుత వ్యక్తుల సమీకరణతో సాధ్యమవుతాయే తప్ప- కేవలం మానవ వనరుల సమాహారంతోనే కాదు.

అధ్యాపకుల కొరత-అరకొర వసతులు

సమున్నత లక్ష్యాలతో దేశంలోని వివిధ ప్రాంతాల్లో కొత్తగా ఎయిమ్స్‌లు ఏర్పాటు చేయడం బాగానే ఉన్నా- వాటి పనితీరు, పురోగతి అంతంత మాత్రంగానే ఉండటం బాధాకరం. బోధకుల కొరత, మౌలిక సదుపాయాల లేమి, నాణ్యతలేని ఆపరేషన్‌ థియేటర్లు వంటి లోపాలతో ఆరు నగరాల్లోని ఎయిమ్స్‌లు కునారిల్లుతున్నాయి. భోపాల్‌, భువనేశ్వర్‌, జోధ్‌పూర్‌, పట్నా, రాయపుర్‌, రిషీకేశ్‌లలోని ఎయిమ్స్‌ల వద్ద ఆరోగ్య సేవల్ని పరిశీలించిన పార్లమెంటరీ కమిటీ- మానవ వనరుల కొరత కారణంగా అక్కడ ఏర్పాటు చేసిన మౌలిక సదుపాయాలూ నిరుపయోగమవుతాయని హెచ్చరించింది.

ఎదుర్కొంటున్న సవాళ్లు

2018 ఆగస్టులో పార్లమెంటులో ప్రవేశపెట్టిన కమిటీ నివేదిక, ఆరు ఎయిమ్స్‌లకు మంజూరు చేసిన 1,830 బోధకుల పోస్టుల్లో 884 (48శాతం) ఖాళీగా ఉన్నాయని, పలు సూపర్‌ స్పెషాలిటీ విభాగాల్లో బోధకులు లేరని తెలిపింది. మంజూరు చేసిన 22,656 బోధనేతర పోస్టుల్లో 13,788 (60శాతం) సైతం భర్తీ చేయలేదని, సిబ్బంది కొరతా తోడై వైద్యులు తీవ్ర ఒత్తిడిలో పనిచేయాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నట్లు హెచ్చరించింది. రిషీకేశ్‌ ఎయిమ్స్‌లో ఆపరేషన్‌ థియేటర్లలో మౌలిక వసతులైన గ్యాస్‌ పైప్‌లైన్లు, మురుగునీటి మార్గాల కోసం ఎలాంటి ఏర్పాట్లూ లేవని కమిటీ ఎత్తిచూపింది. జోధ్‌పూర్‌ ఎయిమ్స్‌లో ఒక్క మాడ్యులర్‌ ఆపరేషన్‌ థియేటరూ పనిచేసే స్థితిలో లేదని తెలిపింది. ఆరు ఎయిమ్స్‌లు ఎదుర్కొంటున్న సవాళ్లు అనేక పాఠాలు నేర్పినట్లు ప్రజారోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ సంస్థల్ని అత్యుత్తమ కేంద్రాలుగా తీర్చిదిద్దాలని భావించినా- అధ్యాపకుల కొరత, అరకొర వసతులు, అంతంతమాత్రం సేవలు సమస్యగా మారాయి.

-డాక్టర్​ శ్రీభూషణ్​ రాజు

(రచయిత-హైదరాబాద్​ నిమ్స్​లో నెఫ్రాలజీ విభాగాధిపతి)

ఇదీ చదవండి: పవన్​తో సినిమాపై స్పందించిన హరీశ్​ శంకర్

Last Updated : Feb 29, 2020, 6:08 AM IST

ABOUT THE AUTHOR

...view details