ఏప్రిల్ 14.. ప్రధాని చెప్పిన 21 రోజుల లాక్‌డౌన్ గడువు ముగియబోయే రోజు. కరోనా వైరస్ కట్టడికి కేంద్రం తీసుకున్న కఠినమైన ఈ నిర్ణయానికి ఈ పాటికే ఫలితం వచ్చి ఉండాలి. అయితే కేసులు తీవ్రత తగ్గాల్సింది పోయి కొత్త కేసులు వెలుగు చూడడం ప్రారంభమైంది. దీంతో ఇప్పుడు మరోసారి లాక్‌డౌన్ అంశం తెరపైకి వచ్చింది. ఓ వైపు పెరుగుతున్న కరోనా కేసులు.. మరోవైపు దిగజారుతున్న ఆర్థిక వ్యవస్థ.. రెండింటికీ సమన్యాయం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్ ఉంటుందా? ఉంటే ఎలా ఉండబోతోంది? ఏమైనా మినహాయింపులుంటాయా?
రాష్ట్రాలు ఏమంటున్నాయ్?
కరోనా వైరస్ కట్టడికి లాక్‌డౌన్ ఒక్కటే ఏకైక మార్గమని రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నాయి. ఇతర దేశాలతో పోల్చి చూసినప్పుడు లాక్‌డౌనే సంజీవని అనే విషయం తేటతెల్లమవుతుంది. కరోనా తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల్లో సైతం ఇదే అభిప్రాయం వ్యక్తమవుతోంది. శనివారం సీఎంలతో ప్రధాని మోదీ నిర్వహించిన సమావేశంలో సైతం మెజారిటీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇదే అభిప్రాయం వ్యక్తంచేశారు. ఇప్పటికే పంజాబ్, ఒడిశా, తెలంగాణ రాష్ట్రాలు ఏప్రిల్ 30 వరకు లాక్‌డౌన్ పొడిగిస్తున్నట్లు ప్రకటించాయి. అయితే, దేశవ్యాప్త లాక్‌డౌన్‌పై మాత్రం కేంద్రం ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
ప్రకటన ఎప్పుడు?
దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న వేళ గత ఆదివారం ప్రధాని నరేంద్రమోదీ ప్రతిపక్ష పార్టీల ముఖ్య నేతలతో మాట్లాడారు. బుధవారం విపక్ష పార్టీలకు చెందిన ఎంపీల అభిప్రాయం తీసుకున్నారు. శనివారం సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. లాక్‌డౌన్ పొడిగించే విషయంలో ఏకాభిప్రాయ సాధనే లక్ష్యంగా ఈ భేటీలు నిర్వహించారన్నది దీనిబట్టి అర్థమవుతోంది. అయితే, మరో విడత లాక్‌డౌన్ విధించాలంటే ఆర్థిక వ్యవస్థనూ దృష్టిలో ఉంచుకుని చేపట్టాలన్నది ప్రధాని ఉద్దేశంగా కనిపిస్తోంది. అందుకే సీఎంలతో భేటీ సందర్భంగా 'ఇటు ప్రాణాలతో పాటు అటు ఆర్థిక వ్యవస్థ కూడా ముఖ్యమే' అని ప్రధాని వ్యాఖ్యానించారు. దీనిబట్టి ఈ సారి లాక్‌డౌన్‌లో కొన్ని మార్పులుంటాయనేది సుస్పష్టం. అయితే, ఆయా వర్గాల నుంచి వచ్చిన అభిప్రాయాలపై మంగళవారం మరోసారి ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి ప్రధాని లాక్‌డౌన్ నిర్ణయం ప్రకటిస్తారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. కరోనా వైరస్‌పై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్న ప్రధాని ఏ సమయంలోనైనా లాక్‌డౌన్ నిర్ణయంతో ముందుకు రావొచ్చనీ తెలుస్తోంది.