దేశంలోని ప్రతీ పౌరుడికి కరోనా వ్యాక్సిన్ ఉచితంగా అందిస్తామని కేంద్ర మంత్రి ప్రతాప్ సారంగి పేర్కొన్నారు. బిహార్ ఎన్నికల్లో వ్యాక్సిన్ విషయమై విపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఈ మేరకు వివరణ ఇచ్చారు.
నవంబర్ 3న జరగనున్న బాలాసోర్ ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొన్న సారంగి... పాత్రికేయులతో మాట్లాడారు. పౌరులందరికీ వ్యాక్సిన్ ఉచితంగా ఇస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారని చెప్పారు. ఒక్కో వ్యక్తికి వ్యాక్సిన్ అందించేందుకు రూ.500 చొప్పున ఖర్చు చేయనున్నట్లు తెలిపారు.
ఎన్నికల్లో హామీ..
బిహార్ ప్రజలకు ఉచితంగా వ్యాక్సిన్అందిస్తామని ఎన్నికల ప్రచారంలో భాగంగా భాజపా హామీ ఇచ్చింది. దీంతో వ్యాక్సిన్ను రాజకీయ అవసరాల కోసం వాడుకుంటున్నారని విపక్షాల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. సరైన పద్ధతిలోనే వ్యాక్సిన్ హామీ ఇచ్చామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వివరణ ఇచ్చారు. అయినప్పటికీ విమర్శలు ఆగలేదు.
ఇప్పటికే తమిళనాడు, మధ్యప్రదేశ్, అసోం, పుదుచ్చేరి ప్రభుత్వాలు ఉచిత వ్యాక్సిన్ అందిస్తామని ప్రకటించాయి. అయితే దేశంలోని ప్రజలందరికీ ఉచితంగా టీకా సరఫరా చేయాలని దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.