దశాబ్దాలుగా నలుగుతున్న అయోధ్య స్థల వివాదం ఎట్టకేలకు ముగిసింది. దీనిపై 2019 జనవరి 8న సుప్రీంకోర్టులో ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటైంది. ఆగస్టు నుంచి అక్టోబరు వరకు 40 రోజులపాటు ధర్మాసనం కేసుపై విచారణ చేపట్టింది.
ఈ కీలక తీర్పును వెలువరించిన రాజ్యాంగ ధర్మాసనంలోని సీజేఐ జస్టిస్ రంజన్ గొగొయితో పాటు మరో నలుగురు న్యాయమూర్తుల నేపథ్యమిదీ..
జస్టిస్ రంజన్ గొగొయి
సుప్రీంకోర్టు మనుగడలోకి రాకముందు నుంచే నానుతున్న అయోధ్య వివాదాన్ని పరిష్కరించిన ధర్మాసనానికి నేతృత్వం వహించిన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రంజన్ గొగొయి సరికొత్త రికార్డు నెలకొల్పారు.
- ముక్కుసూటి మనిషి
ముక్కుసూటి మనిషిగా పేరుతెచ్చుకున్న జస్టిస్ గొగొయి ఈశాన్యం నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన తొలి వ్యక్తి. అస్సాం హైకోర్టు జడ్జిగా, పంజాబ్, హరియాణా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు.
- ఆరోపణలకు క్లీన్ చీట్
సుప్రీంకోర్టులో ప్రవేశించాక ఎన్నో ఎత్తుపల్లాలు ఎదురైనా ఆయన తన సహజశైలితో ముందుకుపోయారు. సుప్రీంలోని మహిళా సిబ్బంది నుంచి ఎదురైన లైంగిక వేధింపుల ఆరోపణల విషయంలో అంతర్గత కమిటీ నుంచి క్లీన్‌చిట్ పొందారు. 2018 జనవరిలో జస్టిస్ గొగొయితోపాటు మరో ముగ్గురు న్యాయమూర్తులు అప్పటి సీజేఐ జస్టిస్ దీపక్‌మిశ్రాపై నిరసన గళమెత్తారు.
- పదవి విరమణలోపు..
తమకు కేటాయిస్తున్న కేసుల తీరు సరిగా లేదని జస్టిస్ గొగొయి అప్పట్లో ఆక్షేపించారు. ఈ నెల 17న పదవీ విరమణ చేయనున్న జస్టిస్ గొగొయి.. శబరిమల, రఫేల్‌పై రివ్యూ పిటిషన్ తదితర కీలక కేసులపై తీర్పులు వెలువరించనున్నారు. ఆయన తండ్రి కేసబ్ చంద్ర గొగొయి 1982లో 2 నెలలపాటు అస్సాం ముఖ్యమంత్రిగా పనిచేశారు.
జస్టిస్ అశోక్ భూషణ్
1979లో న్యాయవాదిగా వృత్తి జీవితాన్ని ప్రారంభించిన ఆయన 2001లో అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2014లో కేరళ హైకోర్టుకు బదిలీ అయిన ఆయన అనంతరం అక్కడే తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా, ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. 2016 మే 13న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. దిల్లీకి ప్రత్యేక హోదా, ఆధార్ చట్టం తదితర కీలక కేసుల విచారణలో భాగస్వామిగా ఉన్నారు.
జస్టిస్ ఎస్‌ఏ బోబ్డే
జస్టిస్ గొగొయి పదవీ విరమణ అనంతరం సీజేఐగా బాధ్యతలు చేపట్టనున్నారు జస్టిస్ ఎస్‌ఏ బోబ్డే. బాంబే హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా, మధ్యప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఆయన పనిచేశారు. మహారాష్ట్రకు చెందిన బోబ్డే ఏప్రిల్ 2013లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు.
ఆయన 18 నెలలపాటు సుప్రీంకోర్టు సీజేఐగా సేవలు అందించనున్నారు. అయోధ్య తీర్పుతోపాటు ఆధార్ ఆర్డినెన్స్, వ్యక్తిగత గోప్యత హక్కు, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు, అధికరణ 370 కేసుల విచారణలో ఈయన భాగస్వామి. అయోధ్య కేసులో హిందూ, ముస్లిం వర్గాల తరఫున హాజరైన న్యాయమూర్తులపై ప్రశ్నల వర్షం కురిపించడంలో కీలకంగా వ్యవహరించారు.
జస్టిస్ డీవై చంద్రచూడ్
జస్టిస్ డీవై చంద్రచూడ్. 2016 మే 13న డీవై చంద్రచూడ్ సుప్రీంకోర్టు జడ్జిగా నియమితులయ్యారు. అతిఎక్కువ కాలం సీజేఐగా పనిచేసిన జస్టిస్ వైవీ చంద్రచూడ్ తనయుడే డీవై చంద్రచూడ్.
సుప్రీంకోర్టుకు రాకముందు డీవై చంద్రచూడ్ బాంబే హైకోర్టు జడ్జిగా, అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. కాలంచెల్లిన పలు చట్టాలను తోసిపుచ్చిన సుప్రీం న్యాయమూర్తిగా పేరుతెచ్చుకున్నారు.
వ్యక్తిగత గోప్యత, సహజీవనంపై తన తండ్రి ఇచ్చిన తీర్పులపై విరుద్ధ అభిప్రాయం వ్యక్తంచేస్తూ తీర్పులిచ్చారు. తన మూడున్నరేళ్ల సర్వీసులో శబరిమల, ఆధార్, వ్యక్తిగత గోప్యత, సహజీవనం తదితర కీలక తీర్పుల్లో భాగస్వామి అయ్యారు. జాతీయ, అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల్లో అతిథి ఆచార్యుడిగానూ పనిచేశారు.