అక్కడ శతాధిక ఓటర్లే 6 వేల మంది యువ భారతం...! యువతను ఆకట్టుకుంటే ఎన్నికల్లో గెలుపు ఖాయం...! ఇది అన్ని పార్టీల వ్యూహం...!కానీ కొన్ని జిల్లాలు, రాష్ట్రాల్లో ఇది బెడిసికొట్టొచ్చు. ఎందుకంటే అక్కడ వృద్ధ ఓటర్లు ఎక్కువ. అందులోనూ వందేళ్లు దాటిన వారు అధికంగా ఉండడం విశేషం.
హరియాణా రాష్ట్రం కర్నాల్ జిల్లాలో 553 మంది వందేళ్లు నిండిన ఓటర్లున్నారు. ఆ రాష్ట్రంలో ఇలాంటి వారి సంఖ్య 5 వేల 910. వందేళ్ల వయసున్న ఓటర్లు తక్కువ ఉన్నది పంచకుల జిల్లా. ఇక్కడ 111 మంది ఉన్నారు.
హరియాణాలో మొత్తం 89వేల 711 మంది 90 నుంచి 99 ఏళ్ల వారున్నారు. ఇలాంటి వారు భివానీలో అత్యధికంగా 7వేల 946 మంది ఉండగా... అత్యల్పంగా పంచకులలో 1వేల 436 మంది ఉన్నారు. పోలింగ్ తేదీ నాటికి సంఖ్యలు స్వల్పంగా పెరిగే అవకాశం ఉంది.
అందరిని చూశాం కానీ...
స్వాతంత్ర్యం వచ్చిన అనంతరం నెహ్రూ నుంచి మోదీ వరకు ప్రధానులు అందరినీ చూశారు కర్నాల్ జిల్లా ఉచానీ గ్రామంలోని పెద్దవారు. పాకిస్థాన్-భారత్ విభజనకు ప్రత్యక్ష సాక్షులు. ఈ గ్రామంలో కొందరు పాక్ నుంచి ఇక్కడికి వచ్చినవారే. అప్పటి నుంచి ఇప్పటి వరకు రాజకీయాల్లో మార్పు లేదని వారు చెబుతున్నారు.
మా తండ్రి 90 సంవత్సరాల నుంచి రాజకీయాలు చూస్తున్నారు. ఆ కాలంలో పాకిస్థాన్ నుంచి వచ్చారు. నేను ఇక్కడే జన్మించాను. ఏ ఓటరైనా తమ గ్రామం అభివృద్ధి చెందాలని, చదువుకున్న పిల్లలకు ఉద్యోగం రావాలని కోరుకుంటారు. ఎన్నికలకు కొన్ని నెలల సమయం ఉన్నప్పటి నుంచి రాజకీయ నాయకులు రావటం ప్రారంభిస్తారు. ఒక్కసారి ఓటు పడిన వెంటనే ఇక కనిపించరు. మా గ్రామం, దేశం అభివృద్ధి పథంలో దూసుకెళ్లాలన్నదే మా కోరిక. - చరణ్ సింగ్, స్థానికుడు