కేంద్ర మాజీ మంత్రి హర్సిమ్రత్ కౌర్ బాదల్‌ను చండీగఢ్ పోలీసులు అరెస్టు చేశారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా చేపట్టిన ర్యాలీలో భాగంగా చండీగఢ్- జీరక్పుర్ సరిహద్దుకు మద్దతుదారులతో చేరుకున్న నేపథ్యంలో పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారు.
ముల్లాపుర్ వద్ద శిరోమణి అకాలీదళ్ అధినేత సుఖ్బీర్ సింగ్ బాదల్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు.
అణచివేయలేరు: బాదల్
అరెస్టుపై హర్సిమ్రత్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. రైతుల కోసం గళం విప్పినందుకు అరెస్టు చేశారని, కానీ తమను అణచివేయలేరని స్పష్టం చేశారు. తామంతా సత్యమార్గాన్ని అనుసరిస్తున్నామని తెలిపారు.