ప్రయాణికులపై రైల్వేలు అదనపు భారాన్ని మోపనున్నాయి. కొత్తగా అభివృద్ధి చేస్తున్న స్టేషన్లలో విమానాశ్రయాల తరహాలో వినియోగ ఛార్జీలు వడ్డించనుంది. ఫలితంగా భవిష్యత్తులో రైల్వే ఛార్జీలు పెరగనున్నాయని సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు.
విమానాశ్రయాల్లో వినియోగదారుల అభివృద్ధి రుసుము(యూడీఎఫ్) పేరిట పన్నులో భాగంగా వినియోగ ఛార్జీలు విధిస్తారు. విమానాశ్రయాల స్థాయి, వివిధ అంశాలను బట్టి యూడీఎఫ్ రేటును నిర్ధరిస్తారు.
ఇదే విధంగా కొత్తగా పునరుద్ధరించిన స్టేషన్లలో రద్దీని అనుసరించి రుసుమును నిర్ణయిస్తామని రైల్వే బోర్డు ఛైర్మన్ వీకే యాదవ్ తెలిపారు. ఇందుకు సంబంధించి త్వరలో రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంటుందని ఆయన తెలిపారు.
రూ.50వేల కోట్లతో ఆధునికీకరణ
2020-21లో రైల్వే స్టేషన్ రీడెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో 50 స్టేషన్లను ఆధునికీకరించనున్నారు. ఇందుకు రూ.50వేల కోట్లు ఖర్చు చేయనున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి తొలి దశలో 400 స్టేషన్లను పునరుద్ధరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.