లాక్‌డౌన్ కాలంలో దేశీయ-విదేశీ ప్రయాణాల కోసం బుక్ చేసుకున్న టికెట్లకు సంబంధించిన నగదును.. వినియోగదారులకు విమాన సంస్థలే పూర్తిగా రీఫండ్ చేయాలని సుప్రీంకోర్టుకు ప్రతిపాదించింది డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ). ఇతర పరిస్థితుల్లో.. 15రోజుల్లో రీఫండ్ చేసేందుకు విమాన సంస్థలు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని అత్యున్నత న్యాయస్థానంలో దాఖలు చేసిన అఫిడవిట్లో పేర్కొంది.
లాక్‌డౌన్‌లో ఎయిర్ టికెట్స్ బుక్ చేసుకున్న వారికి ఫుల్ రీఫండ్ ఇవ్వాలంటూ ప్రవాసీ లీగల్ సెల్ అనే ఎన్జీవో ఇటీవల సుప్రీంలో పిల్ వేయగా.. దీనిపై సమాధానం చెప్పాలంటూ సుప్రీం కేంద్రానికి గతంలో సూచించింది. ఈ పిల్‌పై కేంద్రం స్పందిస్తూ.. మొదటి, రెండొవ లాక్‌డౌన్ సమయంలో టికెట్లు బుక్ చేసుకున్న వారికి పూర్తిగా రీఫండ్ ఇవ్వాలని స్పష్టం చేసింది.
ఒకవేళ విమాన సంస్థలు ఆర్థిక లావాదేవీల కారణంగా నగదును తిరిగి చెల్లించలేని పరిస్థితిలో.. నగదుకు సమానంగా క్రెడిట్ షెల్ ఇవ్వాలని సూచించింది.
- దీని ప్రకారం 2021 మార్చి 31 వరకు సదరు ప్రయాణికుడు డబ్బు చెల్లించకుండా మరోసారి ప్రయాణించవచ్చు.
- ఒకవేళ ప్రయాణికుడు క్రెడిట్ షెల్ కంటే ఎక్కువ విలువైన టికెట్ కొనాలనుకుంటే, అతను అదనపు సొమ్మును నగదు రూపంలో చెల్లించాల్సి ఉంటుంది.
- క్రెడిట్ షెల్ కంటే తక్కువ విలువ గల టికెట్ తీసుకుంటే.. మిగిలిన సొమ్మును సంస్థ తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.
- ఒకవేళ తిరిగి ఇచ్చే సొమ్ము ఆలస్యమైతే... అందుకు తగిన పరిహారం సంస్థ చెల్లించాల్సి వస్తుంది.
- టిక్కెట్ రద్దు చేసుకున్నప్పటి నుంచి జూన్ 30 వరకు అసలు నగదుకు 0.5శాతం అదనంగా.. జులై 1 నుంచి 2021 మార్చి వరకు 0.75 శాతం ప్రతి నెల అదనంగా చెల్లించాలని కేంద్రం వెల్లడించింది.
మార్చి 25 నుంచి మే 3 వరకు విమాన టికెట్లను బుక్ చేసుకున్న వారికే ఇది వర్తిస్తుందని డీజీసీఏ పేర్కొంది.