కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరం, ఆయన కుమారుడు కార్తీ చిదంబరానికి సంబంధించిన ఎయిర్సెల్ మ్యాక్సిస్ కేసుపై కీలక నిర్ణయం తీసుకుంది దిల్లీ కోర్టు. ఈ కేసు దర్యాప్తును పూర్తి చేసేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)లకు మే 4వ తేదీ వరకు గడువు ఇచ్చింది.
నాలుగు దేశాలకు పంపిన (లెటర్స్ రొగెటరీ) లేఖలకు సమాధానం అందలేదని, వాటి కోసమే ఎదిరుచూస్తున్నట్లు ప్రత్యేక న్యాయమూర్తి జస్టిస్ అజయ్ కుమార్ కుహార్కు విన్నవించింది ఈడీ. దర్యాప్తు సంస్థ వినతి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు జడ్జి.
సెప్టెంబర్ 5న నిరవధిక వాయిదా..
విదేశాల నుంచి సమాచారం (లెటర్స్ రొగటరి) రావాల్సి ఉన్నందున ఈ కేసులో విచారణను వాయిదా వేయాలని ఈడీ, సీబీఐలు పలుమార్లు కోరిన సందర్భంగా గత ఏడాది సెప్టెంబర్ 5న నిరవధిక వాయిదా వేసింది కోర్టు. దర్యాప్తు ముగిసిన తర్వాత ఎప్పుడైనా తిరిగి కోర్టును ఆశ్రయించొచ్చని తెలిపింది. విచారణకు సంబంధించి ఎలాంటి తేదీలు ప్రకటించలేదు.
ఇదీ కేసు..
చిదంబరం కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉండగా ఎయిర్సెల్, మ్యాక్సిస్ సంస్థల మధ్య రూ.3,500 కోట్లు విలువైన ఒప్పందం జరిగింది. ఇందుకు విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు అనుమతులు మంజూరు చేయడంలో భారీ అక్రమాలు జరిగాయన్నది ప్రధాన ఆరోపణ.
ఇదీ చూడండి: చిన్మయానంద్ కేసుపై వచ్చేవారం విచారణ : సుప్రీం