గాలి ద్వారా కరోనా వ్యాప్తికి అవకాశముందని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్) స్పష్టం చేసింది. అందువల్ల బహిరంగ ప్రదేశాల్లో మాత్రమే కాకుండా.. కార్యాలయాలు వంటి మూసి ఉన్న ప్రాంతాల్లోనూ మాస్కులు ధరించాలని సూచించింది.
"పలు అధ్యయనాలు, ఆధారాలు, వాదనలు ప్రకారం.... కరోనా వైరస్గా లి ద్వారా వ్యాపించేందుకు అవకాశం ఉందని తెలుస్తోంది."
- శేఖర్ సి.మండే, సీఎస్ఐఆర్ చీఫ్
డబ్లూహెచ్ఓ హెచ్చరిక
గాలి ద్వారా కొవిడ్-19 వైరస్ వ్యాపించే అవకాశముందని... ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) హెచ్చరించింది. దీనిపై తాజాగా సీఎస్ఐఆర్ స్పందించి.. కీలక వివరాలు వెల్లడించింది.
కరోనా నిబంధనలు పాటించండి
కరోనా వైరస్ గాలి ద్వారా వ్యాపించే అవకాశం ఉన్నందున... ప్రజలు ఒక్క చోట గుమిగూడవద్దని శేఖర్ మండే సూచించారు. అలాగే పని ప్రదేశాల్లో గాలి, వెలుతురు బాగా వచ్చేలా చూసుకోవాలని, చేతులు శుభ్రంగా కడుక్కోవాలని, కచ్చితంగా మాస్కులు ధరించాలని స్పష్టం చేశారు.
కరోనా మహమ్మారి నుంచి తప్పించుకోవాలంటే మాస్కులు ధరించడం తప్పనిసరి "కరోనా రోగులు దగ్గినా, తుమ్మినా... పెద్ద తుంపర్లు ఉపరితలం మీద పడితే.. చిన్న తుంపర్లు మాత్రం ఎక్కువ సేపు గాల్లోనే ఉండిపోతాయి. సూర్యరశ్మి వల్ల వైరస్ క్రియా రహితం అవుతుందని కొన్ని ఆధారాలు నిరూపిస్తున్నాయి. అయితే మూసి ఉన్న ప్రదేశాల్లో ఈ తుంపర్ల వల్ల వైరస్ వ్యాపించే అవకాశం ఎక్కువగా ఉంది."
- శేఖర్ సి.మండే, సీఎస్ఐఆర్ చీఫ్
ఇదీ చూడండి:కరోనా వ్యాప్తి, మరణాల రేటు భారత్లోనే తక్కువ!