భారత వైమానిక దళం పాక్‌కు ముచ్చెమటలు పట్టించి వారం దాటింది. అనంతరం ఇరుదేశాల మధ్య పరిస్థితి యుద్ధవాతావరణాన్ని తలపించి ఒక్కసారిగా శాంతించింది.
జాతీయస్థాయిలో మాత్రం ఈ అంశంపై రాజకీయం తీవ్రమవుతోంది. వైమానిక దాడిలో మరణించిన ఉగ్రవాదుల సంఖ్యపై ఎలాంటి స్పష్టత లేదు. 350 అని ఒకరు, 300కు పైగా అని మరొకరు ఇలా ప్రకటనలూ చేసుకుంటూ వస్తున్నారు. జాతీయ సాంకేతిక పరిశోధన సంస్థ వైమానిక దాడి సమయంలో అక్కడ 300 ఫోన్లు క్రియాశీలకంగా ఉన్నాయని తెలిపింది. ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఒక సభలో ఈ సంఖ్య 400గా పేర్కొన్నారు.
''48 గంటలవ్యవధిలోనే ఉగ్రవాదుల్ని మన భద్రతాసిబ్బంది అంతమొందించారు. ఫిబ్రవరి 14 పుల్వామా దాడికి ప్రతిగా 40 మందికి 400 మందితో బదులు తీర్చుకున్నారు. ''
- యోగి ఆదిత్యనాథ్, ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి
ఇటీవలే కేంద్రమంత్రి అహ్లువాలియా వైమానిక దాడి మృతుల సంఖ్యను ప్రధాని మోదీ ఎప్పుడూ ధ్రువీకరించలేదన్నారు. ఈ వ్యాఖ్యలు విపక్షాల విమర్శలకు తావిచ్చాయి. అసలెంత మంది చనిపోయారో నిగ్గు తేల్చాల్సిందేనని పట్టుబడుతున్నాయి ప్రతిపక్షాలు.
విపక్షాల దాడి...
మెరుపుదాడులపై వరుసగా కాంగ్రెస్ సీనియర్ నేతలు మోదీపై ప్రశ్నల వర్షం కురిపించారు. సాక్ష్యాధారాలతో సహా నిరూపించాల్సిందేనని కపిల్‌సిబల్ ట్వీట్ చేశారు. అంతర్జాతీయ మీడియా ఆధారాలు లేవంటుంది... దీనికి బదులివ్వండి అని మోదీని కోరారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా... కేంద్రమంత్రి అహ్లువాలియా వ్యాఖ్యలపై స్పష్టతనివ్వాలని మోదీని డిమాండ్ చేశారు.
ప్రతిపక్షాల ఆరోపణలకు అదే స్థాయిలో దీటుగా బదులిస్తోంది అధికార భాజపా. కాంగ్రెస్ దేశాన్ని తప్పుదోవ పట్టిస్తోందని ఎదురుదాడి చేస్తోంది. ఇది జవాన్లను అవమానించడమే అని ఎప్పటికప్పుడు ధ్వజమెత్తుతోంది.