దిల్లీ వాయుకాలుష్యం రోజురోజుకూ మరింత తీవ్రతరమవుతోంది. గాలి నాణ్యత సూచీలు పడిపోతున్నాయి. ఈ నేపథ్యంలో దిల్లీ కాలుష్యంపై దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టింది సుప్రీం కోర్టు. దిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో కాలుష్య నివారణకు ఎలాంటి చర్యలు చేపడుతున్నారో వివరణ ఇవ్వాలని పంజాబ్, హరియాణా, దిల్లీ, యూపీ రాష్ట్ర ముఖ్య కార్యదర్శులకు సమన్లు జారీ చేసింది.
కాలుష్య నివారణకు సమర్థవంతమైన చర్యలు చేపట్టాలని, వాయుకాలుష్యం తీవ్రంగా ఉన్న 13 ప్రాంతాల్లో కాలుష్య కారకాలను తొలిగించేందుకు కృషి చేయాలని జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ దీపక్ గుప్తాతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.
మినహాయింపు ఎందుకు...?
దిల్లీ ప్రభుత్వం... సరి-బేసి విధానంలో భాగంగా ద్వి, త్రిచక్ర వాహనాలకు మినహాయింపు ఇవ్వడాన్ని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. సరి-బేసి విధానం అమల్లో ఉన్నప్పటికీ కాలుష్యం పెరుగుతూనే ఉందని ఆగ్రహించింది. వ్యవసాయ వ్యర్థాల కాల్చివేత తగ్గినప్పటికీ... కాలుష్య స్థాయిలు దారుణంగా ఉండటంపై అత్యున్నత న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది.