తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కేరళలో ఘోర విమాన ప్రమాదం.. 19 మంది మృతి - air india

kerala
కేరళలోని కోజికోడ్​

By

Published : Aug 7, 2020, 8:43 PM IST

Updated : Aug 8, 2020, 6:21 AM IST

05:27 August 08

కేరళలోని కోజికోడ్​లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 19 మంది మృతి చెందారు. ఈ దుర్ఘటనలో విమాన పైలట్లు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరో 120 మందికి గాయాలయ్యాయి. కొందరు క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.  

ముక్కలైన విమానం

వందేభారత్‌ మిషన్‌లో భాగంగా దుబాయ్‌ నుంచి కోజికోడ్‌కు వస్తున్న ఎయిరిండియాకు చెందిన డీఎక్స్‌బీ-సీసీజే బోయింగ్ 737 ఐఎక్స్‌ 1344 విమానం రన్​వేపై దిగుతుండగా ఒక్కసారిగా అదుపుతప్పింది. అనంతరం పక్కనే ఉన్న 30 అడుగుల లోతైన లోయలోకి పడిపోయింది. దీంతో విమానం రెండు ముక్కలైంది.  

ప్రమాదం జరిగిన విమానంలో 184 మంది(10 మంది చిన్నారులు) ప్రయాణికులు, ఇద్దరు పైలట్లు, నలుగురు సిబ్బంది ఉన్నట్లు పౌర విమానయాన శాఖ వెల్లడించింది. శుక్రవారం రాత్రి 7.41 గంటలకు ప్రమాదం జరిగిందని, ల్యాండింగ్ సమయంలో మంటలు చెలరేగలేదని స్పష్టం చేసింది.  

రన్​వేపై ల్యాండ్​ అయిన తర్వాత విమానం ముందుకు దూసుకెళ్లి లోయలో పడిపోయిందని డీజీసీఏ వెల్లడించింది.  

రెండున్నర గంటల్లో సహాయక చర్యలు పూర్తి

ప్రమాద ఘటనపై వెంటనే స్పందించిన అధికారులు హుటాహుటిన సహాయక చర్యలు ప్రారంభించారు. కేవలం రెండున్నర గంటల వ్యవధిలోనే విమానంలో చిక్కుకున్నవారందరినీ బయటకు తీశారు.  

క్షతగాత్రుల్లో 110 మందిని కోజికోడ్​లోని ఏడు ఆస్పత్రులకు తరలించినట్లు ఆ జిల్లా కలెక్టర్ తెలిపారు. ఇందులో 11 మంది మరణించినట్లు చెప్పారు. మిగిలిన 80 మందిని మలప్పురంలోని ఆస్పత్రులకు తరలించగా.. అందులో ఆరుగురు మృతి చెందినట్లు ధ్రువీకరించారు. మరికొందరి పరిస్థితి విషమంగా ఉందని అన్నారు.  

కారణమేంటి?

భారీ వర్షాల కారణంగానే విమానం అదుపుతప్పినట్లు తెలుస్తోంది. రన్‌వేపైకి నీరు చేరడంతో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం. విమాన ప్రమాదంపై డీజీసీఏ సమగ్ర దర్యాప్తునకు ఆదేశించింది.  

మరోవైపు ఘటనపై విమాన ప్రమాద దర్యాప్తు సంస్థ(ఏఏఐబీ)చే విచారణకు ఆదేశించినట్లు పౌర విమానయాన శాఖ మంత్రి హర్​దీప్​సింగ్ పూరీ స్పష్టం చేశారు. ఈ మేరకు రెండు దర్యాప్తు బృందాలను కోజికోడ్​కు పంపించినట్లు తెలిపారు.  

సురక్షిత ల్యాండింగ్​ కోసం ప్రయత్నించినా...

విమానం ల్యాండింగ్ చేసేందుకు ఎయిరిండియా పైలట్లు రెండు సార్లు ప్రయత్నించారని డీజీసీఏ అధికారులు తెలిపారు. భీకరమైన ఎదురుగాలుల వల్ల రెండుసార్లు ల్యాండింగ్ ప్రయత్నాన్ని మానుకున్నట్లు వెల్లడించారు. చివరి ప్రయత్నంలో ప్రమాదం జరిగినట్లు స్పష్టం చేశారు.  

విమానం రన్​వే పై దిగడానికి ముందు రెండు సార్లు ఎయిర్​పోర్టు చుట్టూ తిరిగి వచ్చిందని ప్రయాణికుల్లో ఒకరైన రియాస్ వెల్లడించారు.  

"నేను వెనక సీట్లో కూర్చున్నాను. ల్యాండింగ్ సమయంలో ఒక్కసారిగా పెద్ద శబ్దం వచ్చింది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలీదు."

-రియాస్, ప్రయాణికుడు

విమానం బలంగా రన్​వేపై దిగిందని మరో ప్రయాణికురాలు ఫాతిమా తెలిపారు. ఆ తర్వాత ముందుకు దూసుకెళ్లినట్లు చెప్పారు.  

మోదీ దిగ్భ్రాంతి

ఈ ఘటనపై రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ సహా ఇతర నేతలు, ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  

ప్రమాదంపై విచారం వ్యక్తం చేసిన రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్.. బాధితుల క్షేమం కోసం ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.  మరోవైపు..ఈ విషాదకరమైన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం వ్యక్తం చేశారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. ఘటనపై ఆవేదన వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.  

విమాన ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. సీఎం పినరయి విజయన్‌తో ప్రధాని ఫోన్లో మాట్లాడారు.  

ప్రమాద ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కేరళ సీఎం పినరయి విజయన్‌ సైతం విమాన ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.  

రాహుల్

విమాన ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ, మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆయనతో పాటు కాంగ్రెస్​ అధికార ప్రతినిధి రణ్​దీప్​ సుర్జేవాలా, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ప్రియాంకా గాంధీ సహా ఇతర నేతలు మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.

03:17 August 08

కేరళ విమాన ప్రమాదంలో మృతుల సంఖ్య 18కి పెరిగింది. 123 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

00:16 August 08

17కి చేరిన మరణాల సంఖ్య

కేరళ కోజికోడ్​లో జరిగిన విమాన ప్రమాదంలో మృతుల సంఖ్య 17కి చేరింది. 123 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. మరో 14 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రమాదంలో మరణించిన వారిలో ఇద్దరు విమాన పైలట్లు కూడా ఉన్నారు. మొత్తం 191 మందితో ప్రయాణిస్తున్న ఎయిరిండియా విమానం కోజికోడ్ కారిపూర్ ఎయిర్​పోర్టులో ల్యాండ్ అయ్యే సమయంలో అదుపుతప్పి 30 అడుగుల లోతైన లోయలో పడిపోయింది. దీంతో విమానం రెండు ముక్కలైంది.

ఘటనపై రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి సహా వివిధ రంగాల ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు.

23:27 August 07

ముసిగిన సహాయక చర్యలు

కేరళ విమాన ప్రమాదంలో సహాయక చర్యలు ముగిశాయి. క్షతగాత్రులందరినీ ఆస్పత్రులకు తరలించినట్లు అధికారులు వెల్లడించారని దుబాయ్​లోని భారత రాయబార కార్యాలయం స్పష్టం చేసింది.

23:19 August 07

ఒక్కరు తప్ప..

విమానంలోని ప్రయాణికులందరినీ బయటకు తీసుకొచ్చినట్లు పొన్నై పార్లమెంట్ ఎంపీ మహమ్మద్ బషీర్ వెల్లడించారు. మరొకరు ఇంకా విమానంలోనే చిక్కుకున్నట్లు తెలిపారు. అయితే చిక్కుకున్న వ్యక్తి సురక్షితంగానే ఉన్నట్లు స్పష్టం చేశారు. 

22:47 August 07

కేరళ కోజికోడ్​ విమాన ప్రమాదానికి సంబంధించి ప్రకటన విడుదల చేసింది ఎయిర్​ ఇండియా ఎక్స్​ప్రెస్​. 

22:41 August 07

16కు చేరిన మృతులు..

కేరళ విమాన ప్రమాదంలో ఇప్పటివరకు ఇద్దరు పైలట్లు సహా.. మొత్తం 16 మంది ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. 

22:31 August 07

రాష్ట్రపతి స్పందన..

కేరళ విమాన ప్రమాదంపై రాష్ట్రపతి స్పందించారు. కేరళ గవర్నర్​కు ఫోన్​ చేసి ఘటనపై ఆరా తీశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.  

22:21 August 07

14కి చేరిన మృతులు...

కేరళ ప్రమాదంలో ఇప్పటివరకు 14 మంది మృతి చెందారు. ఇందులో ఇద్దరు పైలట్లు ఉన్నారు. 123 మంది గాయపడగా.. 15 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు మలప్పురం ఎస్పీ తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయి. 

22:12 August 07

మోదీ తీవ్ర దిగ్భ్రాంతి...

కోజికోడ్​ విమాన ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. గాయపడిన వారు త్వరగా కోలుకుంటారని ఆకాంక్షించారు. కేరళ సీఎంతో ఫోన్​లో మాట్లాడినట్లు ట్వీట్​ చేశారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.  

22:04 August 07

రాహుల్​ గాంధీ దిగ్భ్రాంతి...

కేరళ ఘటనపై కాంగ్రెస్​ సీనియర్​ నేత రాహుల్​ గాంధీ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. 

21:59 August 07

ఐదుకు చేరిన మృతులు...

విమాన ప్రమాదంలో మృతుల సంఖ్య ఐదుకు చేరింది. ఇందులో ఓ పైలట్​ కూడా ఉన్నాడు. ప్రతికూల వాతావరణం కారణంగానే ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. ప్రమాద సమయంలో భారీ వర్షం కురుస్తున్నట్లు అధికారులు తెలిపారు. 

21:58 August 07

హెల్ప్​లైన్లు ఏర్పాటు...

  • ప్రయాణికుల బంధువులు సంప్రదించేందుకు హెల్ప్‌లైన్‌ నంబర్‌ ఏర్పాటు
  • ప్రయాణికుల వివరాల కోసం హెల్ప్‌లైన్‌ నంబర్‌ 0495-2376901: కోజికోడ్‌ కలెక్టర్‌

21:52 August 07

ఈ విషాదం బాధ కలిగించింది..

కేరళ విమాన ప్రమాద ఘటన.. తనకు బాధ కలిగించిందని అన్నారు యూఏఈలోని భారత రాయబారి. బాధిత ప్రయాణికులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు పవన్​ కపూర్​. 

21:49 August 07

జైశంకర్​ విచారం...

విమాన ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు విదేశాంగ మంత్రి జైశంకర్​. బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. 

21:42 August 07

సీఎంకు మోదీ ఫోన్​..

కేరళ విమాన ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్​తో ఫోన్​లో సంభాషించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఘటనపై ఆరా తీశారు. విమాన ప్రమాదం గురించి మోదీకి వివరించారు విజయన్​. కోజికోడ్​, మలప్పురం జిల్లా కలెక్టర్లు, ఐజీ అశోక్​ యాదవ్​ విమానశ్రయానికి వెళ్లి.. సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారని వివరించారు.  

21:28 August 07

ల్యాండింగ్​ సమయంలో.. ఎలాంటి మంటలు సంభవించలేదని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అదనపు డీజీ రాజీవ్​ జైన్​ తెలిపారు. మొత్తం 190 మందిలో.. 10 మంది చిన్నారులు, ఇద్దరు పైలట్లు, నలుగురు సిబ్బంది ఉన్నట్లు వెల్లడించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. 

21:25 August 07

అమిత్​ షా విచారం..

కేరళ విమాన ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు కేంద్ర హోంమంత్రి అమిత్​షా. ముమ్మర సహాయక చర్యలు చేపట్టాలని ఎన్​డీఆర్​ఎఫ్​ సిబ్బందిని, అధికారులను ఆదేశించారు. 

21:12 August 07

రన్​వేపై అదుపుతప్పిన ఎయిర్​ ఇండియా విమానం

కేరళలో ఘోర ప్రమాదం జరిగింది. కోజికోడ్​లోని కారిపూర్​ ఎయిర్​పోర్ట్​ వద్ద రన్​వేపై ల్యాండింగ్​ సమయంలో విమానం అదుపుతప్పింది. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగానే విమానం స్కిడ్​ అయినట్లు తెలుస్తోంది. రన్​వేపై ల్యాండ్​ అయిన అనంతరం.. 30 అడుగుల లోయలో పడి విమానం రెండు ముక్కలైంది. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. తక్షణమే అక్కడికి చేరిన ఎన్​డీఆర్​ఎఫ్​ సిబ్బంది.. ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. క్షతగాత్రుల్ని ఆస్పత్రులకు తరలిస్తున్నారు. సహాయ చర్యలు చేయాలని సంబంధిత అధికారులను పోలీసులను ఆదేశించారు ముఖ్యమంత్రి పినరయి విజయన్​. 

ఎయిర్​ ఇండియా ఎక్స్​ప్రెస్​ (IX-1344) విమానం.. దుబాయ్​ నుంచి కోజికోడ్​కు 190 మంది ప్రయాణికులతో వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వీరిలో ఇద్దరు పైలట్లతో సహా మొత్తం ఆరుగురు సిబ్బంది ఉన్నారు. ఈ ఘటనలో ఇద్దరు చనిపోయినట్లు సమాచారం. 

ప్రమాదంపై సమగ్ర విచారణకు ఆదేశించింది డైరెక్టరేట్​ జనరల్​ ఆఫ్​ సివిల్​ ఏవియేషన్​(డీజీసీఏ). 

21:09 August 07

విచారణకు ఆదేశం...

కేరళ కోజికోడ్​ విమాన ప్రమాద ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించింది డైరెక్టరేట్​ జనరల్​ ఆఫ్​ సివిల్​ ఏవియేషన్​(డీజీసీఏ). 

20:56 August 07

దుబాయ్​-కోజికోడ్​ ఎయిర్​ ఇండియా (IX-1344) విమానం 7.45 గంటల ప్రాంతంలో రన్​వేపై ల్యాండింగ్​ సమయంలో అదుపుతప్పినట్లు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. విమానంలో 190 మంది ప్రయాణికులున్నారు. వీరిలో ఇద్దరు పైలట్లతో సహా మొత్తం ఆరుగురు సిబ్బంది ఉన్నారు.

20:47 August 07

వర్షం కారణంగా రన్​వేపై అదుపుతప్పిన విమానం

విమానం రన్​వేపై నుంచి పక్కకు స్కిడ్​ అయినట్లు తెలుస్తోంది. 

20:39 August 07

వర్షం కారణంగా రన్​వేపై అదుపుతప్పిన విమానం

వర్షం కారణంగా రన్​వేపై అదుపుతప్పిన విమానం

కేరళలో భారీ వర్షాల కారణంగా కోజికోడ్​లోని కారిపూర్​ ఎయిర్​పోర్ట్​ రన్​వేపై విమానం అదుపుతప్పింది. దుబాయ్​ నుంచి వస్తున్న ఎయిర్​ ఇండియా విమానం.. స్కిడ్​ అయిన కారణంగా ప్రయాణికులు గాయపడ్డారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Last Updated : Aug 8, 2020, 6:21 AM IST

ABOUT THE AUTHOR

...view details