కొద్ది రోజుల్లో తండ్రిని కాబోతున్న ఆనందంలో ఉన్నా.. విధి నిర్వహణకే ప్రాధాన్యమిచ్చి నిండు గర్భిణి అయిన భార్యను ఇంటి వద్దే ఉంచి విధులకు బయలుదేరాడు. కరోనా కారణంగా విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను తీసుకువచ్చి, వారిని కుటుంబ సభ్యులతో కలపడమే ముఖ్యమనుకున్నాడు. కానీ, విధి మాత్రం ఆయన మీద అంత జాలి చూపించలేదు. దాంతో తాను ఇష్టంగా చేస్తోన్న ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూనే ప్రాణాలు కోల్పోయాడు. అతడే ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ కోపైలట్ అఖిలేశ్ శర్మ.
స్నేహితులు, బంధువులతో అఖిల్ అని ప్రేమగా పిలిపించుకొనే అఖిలేశ్ శర్మకు తల్లిదండ్రులు, భార్య, ఇద్దరు తమ్ముళ్లు, సోదరి ఉన్న అందమైన కుటుంబం ఉంది. కరోనా కారణంగా లాక్‌డౌన్‌కు ముందు ఒకసారి మాత్రమే కుటుంబాన్ని కలుసుకున్నాడు. ఆయనకు 2017లో వివాహం జరగ్గా..ఇప్పుడు ఆయన భార్య మేఘ నిండు గర్భిణి. మరికొన్ని రోజుల్లో వాళ్లింటికి పండంటి బిడ్డ రాబోతుంది. కానీ, ఇప్పుడు కుటుంబానికి పెద్ద దిక్కు అయిన అఖిలేశ్ మాత్రం విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయాడు. అత్యంత బాధాకర విషయం ఏంటంటే ఇప్పటికీ ఆయన భార్యకు ఈ దుర్వార్తను కుటుంబసభ్యులు తెలియనివ్వలేదట.