సైనిక బలగాల కోసం తొలి ఎయిర్ అంబులెన్స్ మంజూరైంది. సరిహద్దు భద్రత దళాల(బీఎస్ఎఫ్)కు చెందిన ఎమ్ఐ-17 హెలికాప్టర్లో ఈ అంబులెన్స్ సిద్ధమైంది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు తయారైన ఈ ఎయిర్ అంబులెన్స్ ఝార్ఖండ్ రాజధాని రాంచీ కేంద్రంగా పనిచేస్తుంది.
నక్సల్స్‌తో, ఉగ్రవాదులతో పోరాడే సైనికుల కోసం మొట్టమొదటిసారి ఈ 24గంటల అంబులెన్స్ సేవలను సమకూర్చింది ప్రభుత్వం.
ప్రత్యేకించి నక్సల్స్‌తో పోరాడుతూ, ఎత్తైన సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్న సైనికులకు ఈ అంబులెన్స్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ హెలికాప్టర్లో వైద్యుల బృందంతో పాటు, నర్సులు, సహాయకులు 24 గంటలు అందుబాటులో ఉంటారు. ఈ చాపర్‌లో స్టెబిలైజర్స్, ఆక్సిజన్ సిలిండర్ వంటి అత్యవసర వైద్య పరికరాలు ఉన్నాయి.
ఉద్రిక్త పరిస్థితుల్లో గాయపడ్డ సైనికుల దగ్గరకు వైద్యులే ఈ హెలికాప్టర్లో వెళ్లి ప్రథమ చికిత్స అందిస్తారు. ఆపై క్షతగాత్రులను దగ్గర్లోని ఆసుపత్రులకు తరలిస్తారు.
ఈ సేవలను మొదటగా నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో పనిచేస్తున్న లక్షకుపైగా సైనికులకు అందించాలని యోచిస్తున్నారు. అవసరాన్ని బట్టి రాష్ట్ర పోలీసులకు సేవలందించేందుకు సిద్ధంగా ఉంటుంది ఈ చాపర్.