గోమతి మరిముత్తు...రాత్రికి రాత్రే స్టార్ అయిపోయిన అథ్లెట్. ఇటీవల దోహాలో ముగిసిన ఏషియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో 800మీటర్ల పరుగుపందెంలో పసిడి సాధించింది. ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది. కానీ.. ఆమె ప్రయాణం మాత్రం ఎందరికో ఆదర్శం. ఇటీవలి స్ఫూర్తిగాథల్లో ఇదొకటి.
గోమతిది తమిళనాడులోని తిరుచిరాపల్లి. రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం. తల్లిదండ్రుల రోజు వారి కష్టమే వారికి జీవనాధారం. గోమతికి ఓ అన్న, అక్క. ముగ్గురిలో చదువుకునేది ఆమె ఒక్కటే.
చిన్నప్పటి నుంచి పరుగుపై ఆసక్తి ఉన్నా ఆర్థిక ప్రోత్సాహం కరవైంది. అదే.. ఆమె కలల్ని ఛిద్రం చేసింది. అయినా.. అడపాదడపా చిన్న చిన్న టోర్నీల్లో పాల్గొని సత్తా చాటింది. ఎన్నో మెడల్స్. కానీ.. జాతీయ స్థాయిలో మాత్రం పేరు సంపాదించలేకపోయింది.
2016 కఠిన సంవత్సరం...
2016లో ఎన్నో కఠిన పరిస్థితుల్ని ఎదుర్కొంది గోమతి. కారణం.. ఆమె తండ్రి, కోచ్ మరణం. స్నేహితురాలు ఫ్రాన్సిస్ ప్రోత్సాహంతో ఈ క్రీడలో కొనసాగింది. కానీ.. గాయంతో మళ్లీ 2 సంవత్సరాలు ట్రాక్‌కు దూరమైన పరిస్థితుల్లో ఎంతో క్షోభకు గురైంది. పట్టుదల.. ఆమెను వెనుకడుగు వేయనీయలేదు. తనలో తానే స్ఫూర్తి నింపుకుంటూ కష్టాలన్నింటినీ అధిగమించి ఆత్మస్థైర్యంతో ముందుకెళ్లింది.
తిరిగి ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో అడుగుపెడుతుందని ఎవరూ ఊహించని స్థితిలో ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన ఫెడరేషన్ కప్‌లో అదరగొట్టింది గోమతి. 2.3.21 టైమింగ్‌తో అగ్రస్థానంలో నిలిచి సెలక్టర్ల దృష్టిలో పడింది. అదే.. అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో ప్రాతినిధ్యం వహించే అవకాశం కల్పించింది. 30 సంవత్సరాల వయసులో అనూహ్యంగా పసిడి సాధించి రికార్డు సృష్టించింది.
గోమతి విజయం పట్ల ఆమె కుటుంబసభ్యులతో పాటు.. ఊరంతా సంతోషిస్తోంది. సన్మాన కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రోత్సహిస్తున్నారు.
గోమతి ఇప్పుడు బెంగళూరు ఆదాయపు పన్ను శాఖ ఉద్యోగి. తక్షణ ధ్యేయం అంతర్రాష్ట్ర అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ అంటోంది. తదుపరి లక్ష్యం ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో మంచి ప్రదర్శన చేయడమేనని చెబుతోంది. అనంతరం టోక్యోలో ఒలింపిక్స్‌కు అర్హత సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
''నేను భారత్‌లోనే ఉంటే ఒలింపిక్స్‌కు అర్హత సాధించలేను. విదేశాలకు వెళ్లి అక్కడి కోచ్‌ల శిక్షణలో రాటుదేలాలని భావిస్తున్నా. ఇక్కడ అథ్లెటిక్స్‌లో నాలా వచ్చినవారు లేరు. కానీ.. ఇతర దేశాల్లో ఒలింపిక్స్ కోసం కష్టపడ్డ వారెందరో ఉన్నారు. అందుకే.. అక్కడే శిక్షణ తీసుకుంటే నా సామర్థ్యాలను మెరుగుపరచుకొనే అవకాశం ఉంటుంది. నా పేదరికాన్ని చూసి ఎందరో సాయం చేశారు. కొంతమంది పరిగెత్తేందుకు బూట్లు ఇచ్చారు. మరికొందరు స్పాన్సర్ చేయడానికీ ముందుకొచ్చారు. స్పాన్సర్లు నాపై నమ్మకం ఉంచినప్పుడు.. నా శక్తి సామర్థ్యాలపై మరింత ఆత్మవిశ్వాసం పెరిగింది.''