క్షయ రోగం పరీక్షలకు ఎయిమ్స్ కొత్త పరికరం 2025 లోగా భారత్‌లో క్షయ వ్యాధిని నిర్మూలించడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని 'ప్రపంచ క్షయ దినం' సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. కానీ ఈ వ్యాధి ఏ దశలో ఉందో సత్వరమే గుర్తించడానికి సరైన పరికరం ఇప్పటికీ అందుబాటులో లేదు. ఇప్పుడున్న పరికరాలతో రోగులు రిపోర్టు పొందడానికి వారాల పాటు ఎదురుచూస్తున్నారు. వ్యాధి చివరి దశకు చేరుకున్నా రిపోర్టు అందటానికి 7-8 రోజులు పడుతుంది. ఈ పరిస్థితి నుంచి బయటపడటానికి దిల్లీ ఎయిమ్స్ వైద్యులు పరిశోధనలు చేశారు. క్షయ బాధితులకు ఉపశమనం కలిగించడానికి సరికొత్త పరికరాన్ని కనుగొన్నారు. పరీక్ష నిర్వహించి కేవలం 30 నిమిషాల్లోనే రిపోర్టు అందిస్తుందీ పరికరం.
క్షయ వ్యాధిని నిర్మూలించడం సాధ్యమే. కానీ ఈ వ్యాధితో సతమతమవుతున్న వారికి సరైన చికిత్స అందట్లేదు.
షుగర్‌ను పరీక్షించే పరికరంలాగనే ఇదీ ఉంటుందని ఎయిమ్స్ అధ్యాపకురాలు జయ త్యాగి వెల్లడించారు. కానీ వ్యాధికి సంబంధించిన రిపోర్టు మాత్రం లాబ్‌లోనే లభిస్తుందని స్పష్టం చేశారు.
"100 ఏళ్ల నుంచి పరీక్ష చేస్తున్న పద్ధతిని మైక్రోస్కోపిక్ టెస్ట్ అంటారు. ఇది చాలా స్లో పద్ధతి. రిపోర్టు వచ్చేసరికి 6-7 రోజులు పడుతుంది. రోగికి రిపోర్టు కోసం ఎదురుచూసే సమయం ఉండదు. అందుకే రిపోర్టు తొందరగా రావాలి. అప్పుడే చికిత్స తొందరగా ప్రారంభించొచ్చు. ఈ పరికరాన్ని రూపొందించి మేము పేటెంట్‌కి దరఖాస్తు చేసుకున్నాము. ఇతర ఆసుపత్రుల్లో ఈ పరికరాన్ని పరీక్షిస్తున్నాము. ఇది అందుబాటులోకి వచ్చేసరికి మరో రెండేళ్లు పడుతుందని నా అభిప్రాయం."
- జయ త్యాగి, ఎయిమ్స్ అధ్యాపకురాలు.
రానున్న రోజుల్లో ఈ పరికరం క్షయ రోగులకు ఎంతో ఉపయోగపడుతుందని వైద్యులు ధీమా వ్యక్తం చేశారు.