కరోనా వైరస్ వ్యాక్సిన్ తయారీ కోసం ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యూకేషన్ (ఏఐసీటీఈ), కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రీయల్ రీసెర్చ్(సీఎస్ఐఆర్) ఆధ్వర్యంలో హ్యాకథాన్ ప్రారంభించినట్లు కేంద్ర ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారుడు (పీఎస్ఏ) ప్రొఫెసర్ కే విజయ్ రాఘవన్ వెల్లడించారు.
హ్యాకథాన్‌లో భాగంగా.. తక్కువ సమయంలో, తక్కువ వ్యయంతో ఔషధాన్ని అభివృద్ధి చేయడంపై విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. భారత్ వ్యాక్సిన్ తయారీ ప్రపంచస్థాయిలో ఉందని పేర్కొన్నారు.
వ్యాక్సిన్ ప్రయత్నాలు
భారత్‌లోని దాదాపు 30 బృందాలు కరోనా వైరస్‌కు టీకా కనుగొనే ప్రయత్నాల్లో ఉన్నాయని రాఘవన్ వెల్లడించారు. భారీ పరిశ్రమల నుంచి వ్యక్తిగత పరిశోధకుల వరకు ఈ వ్యాక్సిన్ తయారీలో నిమగ్నమైనట్లు తెలిపారు. ఇందులో దాదాపు 20 బృందాలు వేగంగా ఫలితాలు రాబడుతున్నట్లు పేర్కొన్నారు.
వ్యాక్సిన్ తయారీకి 10 సంవత్సరాల సమయం పడుతుందని రాఘవన్ అంచనా వేశారు. కానీ, సంవత్సర కాలంలోనే టీకా కనుగొనడమే లక్ష్యంగా ప్రపంచ దేశాలు పనిచేస్తున్నాయన్నారు. కొత్త డ్రగ్స్ తయారు చేయడం చాలా సవాల్‌తో కూడుకున్న పనిగా వ్యాఖ్యానించారు.
"జనరిక్ మందులను అత్యధికంగా తయారు చేస్తున్న దేశాల్లో భారత్ ఒకటి. వ్యాక్సిన్ సంస్థలు ఔషధాల తయారీతో పాటు పరిశోధనాభివృద్ధిపైనా దృష్టి సారిస్తున్నాయి. పెద్ద పరిశ్రమలు, స్టార్టప్‌లు, పరిశోధకులు సహా మొత్తం 30 బృందాలు కొవిడ్-19 వ్యాక్సిన్ అభివృద్ధిలో నిమగ్నమై ఉన్నాయి. ఇందులో 20 వరకు వేగంగా పనిచేస్తున్నాయి."
-ప్రొఫెసర్ కే విజయ్ రాఘవన్, కేంద్ర ప్రభుత్వానికి ప్రధాన శాస్త్రీయ సలహాదారుడు