తెలంగాణ

telangana

By

Published : Aug 24, 2020, 3:39 PM IST

ETV Bharat / bharat

డిగ్రీ మార్కుల ఆధారంగా ఎంబీఏ సీటు

డిగ్రీ మార్కుల ఆధారంగా ఎంబీఏ, పీజీడీఎం కోర్సుల్లో ప్రవేశాలు కల్పించేందుకు ఏఐసీటీఈ అనుమతించింది. కరోనా కారణంగా ప్రవేశ పరీక్షలు నిర్వహించలేని పరిస్థితి నెలకొన్నందున ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఒక్క సంవత్సరానికి ఈ నిబంధన వర్తిస్తుందని స్పష్టం చేసింది.

AICTE allows admission to MBA
డిగ్రీ మార్కుల ఆధారంగా ఎంబీఏ సీటు

కొవిడ్ కారణంగా ప్రవేశ పరీక్షల నిర్వహణ వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ఎంబీఏ, పీజీడీఎం కోర్సుల్లో విద్యార్థులను డిగ్రీ మార్కుల ఆధారంగా చేర్చుకునేందుకు విద్యాసంస్థలకు అనుమతిస్తున్నట్లు భారత సాంకేతిక విద్యా మండలి(ఏఐసీటీఈ) పేర్కొంది. 2020-21 విద్యా సంవత్సరానికే ఈ నిబంధన వర్తిస్తుందని స్పష్టం చేసింది.

"కరోనా వ్యాప్తి భయాలతో రాష్ట్రాల్లో ఎంబీఏ, పీజీడీఎం కోర్సులకు ప్రవేశ పరీక్షలు జరగడం లేదు. ఈ పరీక్షలు జరుగుతాయా లేదా అన్న అంశంపై స్పష్టత లేదు. కాబట్టి విద్యార్థులకు ప్రయోజనం కలిగే విధంగా ఓ ప్రత్యామ్నాయాన్ని ఏఐసీటీఈ అందుబాటులోకి తీసుకొచ్చింది. పీజీడీఎం, ఎంబీఏ కోర్సులు అందించే సంస్థలు విద్యార్థులను మార్కుల ఆధారంగా చేర్చుకునేందుకు అనుమతిస్తున్నాం."

-రాజీవ్ కుమార్, ఏఐసీటీఈ మెంబర్ సెక్రెటరీ

అయితే సీట్ల కేటాయింపులో ప్రవేశపరీక్షలు రాసిన విద్యార్థులకే(ఏదైనా రాష్ట్రంలో ఈ పరీక్షలు జరిగి ఉంటే) తొలి ప్రాధాన్యం ఇస్తామని రాజీవ్ స్పష్టం చేశారు. ఖాళీ సీట్లు ఉంటే డిగ్రీ మార్కుల ఆధారంగా విద్యార్థులను చేర్చుకోవచ్చని తెలిపారు. మార్కుల ద్వారా విద్యార్థులకు ప్రవేశాలు కల్పించడంలో పారదర్శకత పాటించాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details