తమిళనాడులో భాజపా ఏ మాత్రం ప్రభావం చూపలేదని దాని మిత్రపక్షం, అధికార అన్నాడీఎంకే నిర్మొహమాటంగా చెప్పింది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో తాము గెలిస్తే కమలం పార్టీకి ప్రభుత్వంలో అవకాశం ఇవ్వబోమని తెల్చిచెప్పింది. ఒకవేళ భాజపా తమ మిత్రపక్షంగా కొనసాగాలనుకుంటే సీఎం కే పళనిస్వామిని కూటమి తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని స్పష్టం చేసింది.
చెన్నైలో నిర్వహించిన తొలి ఎన్నికల ర్యాలీలో అన్నాడీఎంకే సీనియర్ నేత, డిప్యూటీ కోఆర్డినేటర్ కేపీ మునుస్వామి.. భాజపాకు తమ అభిప్రాయాన్ని ముక్కుసూటిగా తెలిపారు. రాష్ట్రంలో పెద్దన్న పాత్ర తమదేనని స్పష్టం చేశారు. పళనిస్వామిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడమే కాకుండా ప్రభుత్వంలో జోక్యం చేసుకోకుండా ఉండేందుకు భాజపా అంగీకరిస్తేనే ఆ పార్టీతో పొత్తు ఉంటుందన్నారు. ఈ షరతులపై భాజపా పునరాలోచించుకుని కూటమిలో ఉండాలో? వద్దో? తేల్చుకోవాలన్నారు. తాము ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఏ పార్టీ మద్దతు అవసరం లేదన్నారు.
అవకాశం కోసం చూస్తున్నారు..
తమిళనాడులో అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత, డీఎంకే అధినేత కరుణానిధి వంటి మహానేతల మృతి అనంతరం రాష్ట్రంలో రాజకీయ శూన్యత ఏర్పడిందని భావిస్తున్న కొన్ని పార్టీలు పాగా వేయాలని చూస్తున్నాయని మునుస్వామి తెలిపారు. పలు జాతీయ పార్టీలు, అవకాశవాదులు, నమ్మకద్రోహులు.. ద్రవిడ పార్టీలపై లేనిపోని ఆరోపణలు చేస్తూ ప్రయోజనం పొందాలని చూస్తున్నాయని ధ్వజమెత్తారు.
అన్నాడీఎంకే చెన్నైలో నిర్వహించిన ర్యాలీలో సీఎం కే పళనిస్వామి, డిప్యూటీ సీఎం పనీర్‌సెల్వం కూడా పాల్గొన్నారు. వారి సమక్షంలోనే ఈ వ్యాఖ్యలు చేశారు మునిస్వామి. తమ మద్దతు లేకుండా తమిళనాడులో భాజపా ఎదగలేదనే సందేశాన్ని పంపారు.