తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'తక్షణమే వారందరిని గుర్తించి.. క్వారంటైన్​ చేయండి' - దిల్లీ పోలీసులు విడుదల చేసిన వీడియో

దిల్లీ నిజాముద్దీన్ ప్రాంతంలో జరిగిన మతపరమైన ప్రార్థనల్లో పాల్గొన్న వారిని గుర్తించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. దేశవ్యాప్తంగా తనిఖీలు కొనసాగిస్తున్నారు అధికారులు. ఈ మేరకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర హోం శాఖ లేఖలు రాసింది. తబ్లిగ్​ ఈ జమాత్​కు హాజరైన 2వేల మంది విదేశీయులను తక్షణమే గుర్తించి, క్వారంటైన్​ చేయాలని ఆదేశించింది.

nizamuddin
నిజాముద్దీన్

By

Published : Apr 1, 2020, 5:29 AM IST

దిల్లీ నిజాముద్దీన్​లో జరిగిన మతపరమైన సమావేశంలో పాల్గొన్న తబ్లిగ్-ఈ-జమాత్​కు చెందిన దాదాపు 2 వేల మంది ప్రతినిధులను సత్వరమే గుర్తించి, క్వారంటైన్​ చేయాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. దాదాపు 70 దేశాలకు చెందిన 2 వేల మంది ఆరు నెలల పర్యటక వీసాతో భారత్​లోకి ప్రవేశించినట్లు తెలిపింది. మలేసియా, బంగ్లాదేశ్, ఇండోనేసియా, మలేసియా దేశాలనుంచి అధికంగా వచ్చినట్లు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో విస్తృత తనిఖీలు నిర్వహించి.. వైరస్ సోకినట్లు నిర్ధరణ అయితే ఆస్పత్రులకు తరలించాలని, వైరస్ సోకని విదేశీయులను వారి స్వదేశాలకు తక్షణమే పంపించేయాలని స్పష్టం చేసింది.

సమావేశంలో పాల్గొన్నవారిలో 24 మందికి కరోనా పాజిటివ్​గా తేలగా... తెలంగాణలో ఆరుగురు మరణించారు. ఈ నేపథ్యంలో తాజా ఆదేశాలు జారీ చేసింది కేంద్రం. దిల్లీలోని బంగ్లేవాలి మసీదులో కొంతమంది జమాత్ కార్యకర్తలు ఉన్నట్లు పేర్కొన్న కేంద్రం.. వారిలో కొందరికి వైరస్ సోకి ఉండొచ్చన్న అనుమానం వ్యక్తం చేసింది.

మనోళ్లూ మలేసియా వెళ్లారు

భారత్​కు చెందిన కొంతమంది ప్రతినిధులు ఫిబ్రవరి 27 నుంచి మార్చి 1 మధ్య కౌలాలంపూర్​లో జరిగిన ఓ మతపరమైన కార్యక్రమంలో పాల్గొన్నట్లు కేంద్ర హోంశాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో మలేసియా నుంచి తిరిగి వచ్చిన వారికి అత్యవసరంగా స్క్రీనింగ్ నిర్వహించాలని ఇమ్మిగ్రేషన్​ శాఖ.. అన్ని ప్రాంతీయ విదేశీ రిజిస్ట్రేషన్​ కార్యాలయాలను అప్రమత్తం చేసినట్లు తెలిపింది.

విస్తృత తనిఖీలు..

దిల్లీ ప్రార్థనల్లో పాల్గొన్న వారికోసం అధికారులు దేశవ్యాప్తంగా విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ, బంగాల్​, కర్ణాటక, గుజరాత్​ సహా వివిధ రాష్ట్రాల్లో వీరు ఉన్నట్లు సమాచారమున్న నేపథ్యంలో.. తబ్లిగ్​ జమాత్ కార్యక్రమానికి హాజరైన వారిని గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు.

మధ్యప్రదేశ్​లో 82 మంది..

రాష్ట్ర ప్రభుత్వాలు సైతం నిజాముద్దీన్​కు హాజరైన వారిని గుర్తించే పనిలో పడ్డాయి. ఈ మేరకు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. రాష్ట్రం నుంచి నిజాముద్దీన్​కు హాజరైన 107 మందిలో 82 మందిని గుర్తించినట్లు మధ్యప్రదేశ్ ప్రభుత్వం పేర్కొంది. వారిలో కొందరిని క్వారంటైన్​కి తరలించినట్లు స్పష్టం చేసింది.

యూపీలో 157..

ఉత్తర్​ప్రదేశ్​ నుంచి తబ్లిగ్​-ఈ-జమాత్ కార్యక్రమంలో పాల్గొన్న 157 మందిలో దాదాపు అందరి ఆచూకీని గుర్తించినట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. మరో 10 మంది కోసం వెతుకుతున్నట్లు పేర్కొంది. గుర్తించిన వారికి కరోనా పరీక్షలు నిర్వహించి, పాజిటివ్ అని తేలితే వారికి చికిత్స అందించనున్నట్లు స్పష్టం చేసింది.

అసోంలో 456..

తబ్లిగ్ కార్యక్రమం జరిగిన నిజాముద్దీన్ సహా పరిసర ప్రాంతాలనుంచి తిరిగి వచ్చిన 456 మంది వివరాలను సేకరించినట్లు అసోం ప్రభుత్వం తెలిపింది. వారిని గుర్తించి క్వారంటైన్​లోకి తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించింది.

మౌలానా అరెస్టు

నిజాముద్దీన్​ ప్రాంతంలో నిర్వహించిన మతపరమైన సమావేశానికి నేతృత్వం వహించిన మౌలానాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొవిడ్ వ్యాప్తి నివారించడానికి ప్రభుత్వం విధించిన ఆంక్షలను ఉల్లంఘించినందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. అంటువ్యాధుల చట్టం, ఐపీసీ సహా పలు సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసినట్లు స్పష్టం చేశారు.

వీడియో విడుదల

దిల్లీలో తబ్లిగ్-ఈ-జమాత్​ కార్యక్రమం నిర్వహించిన ప్రతినిధులతో పోలీసులు మాట్లాడుతున్న ఓ వీడియోను విడుదల చేశారు అధికారులు. నిజాముద్దీన్ మార్కజ్ సభ్యులను తమ స్వస్థలాలను తిరిగి వెళ్లిపోవాలని మర్కజ్ ప్రతినిధులను పోలీసులు అభ్యర్థించారు. ప్రాంతాన్ని ఖాళీ చేయాలని వారిని హెచ్చరించారు. ఈ వీడియోను మార్చి 23న హజ్రత్ నిజాముద్దీన్ పోలీస్​ స్టేషన్​లో తీసినట్లు అధికారులు తెలిపారు.

దిల్లీ పోలీసులు విడుదల చేసిన వీడియో

పోలీసుల విజ్ఞప్తి

నిజాముద్దీన్​లో జరిగిన ప్రార్థనల తర్వాత దిల్లీలోని 16 మసీదుల్లో తలదాచుకుంటున్న 157 మంది విదేశీయులపై చర్యలు తీసుకోవాలని దిల్లీ పోలీసు ప్రత్యేక విభాగం.. రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. అలాంటి స్థలాల్లో సామాజిక దూరం పాటించడం సాధ్యం కాదని.. ఈ పరిస్థితుల్లో వైరస్ మరింతగా వ్యాపించే అవకాశం ఉన్నట్లు లేఖలో పేర్కొంది.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిలో 8 మంది కిర్గిస్థాన్ దేశీయులను దిల్లీలోని భరత్​ నగర్​లో గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. వారందరినీ నిర్బంధించినట్లు వెల్లడించారు. వీరందరు దాదాపు 11 రోజుల నుంచి దిల్లీలోనే ఉంటున్నారని చెప్పారు.

అసలు ఈ కథేంటీ?

దిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో మార్చి1-15 మధ్య తబ్లిగ్-ఈ-జమాత్​ అనే మతపరమైన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విదేశీయులతో పాటు దాదాపు 2,000 మంది ఇస్లాం ప్రతినిధులు హాజరయ్యారు. విదేశాల నుంచి వచ్చిన వారిలో కొందరు దిల్లీలో, మరికొందరు దేశంలోని వివిధ నగరాల్లో ఉన్నారు. దిల్లీలో ఉన్న కొంత మందికి ఆదివారం రోజున కొవిడ్ లక్షణాలు బయటపడ్డాయి. వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ కార్యక్రమానికి హాజరైన తెలంగాణకు చెందిన ఆరుగురు వ్యక్తులు మృతి చెందడం వల్ల కేంద్ర ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. జమాత్​లో పాల్గొన్న వారిని గుర్తించే పనిలో నిమగ్నమైంది.

ఇదీ చదవండి:'మీ వల్లే కరోనా ప్రభావిత ప్రాంతాలు పెరిగాయి'

ABOUT THE AUTHOR

...view details