సూపర్ మామ్: అభాగ్యుల కోసం తల్లి పాలు దానం గుజరాత్ అహ్మదాబాద్లో ఓ మహిళ మాతృత్వపు మాధుర్యాన్ని పంచుతున్నారు. ఐసీయూలో ప్రాణాలతో పోరాడుతున్న ఐదుగురు నవజాత శిశువులకు అవసరమైన తల్లిపాలను అందించి గొప్ప మనసును చాటుకుంటున్నారు.
తన శరీరంలో అధికంగా పాలు ఉత్పత్తి అవుతున్నాయని గ్రహించి, అదనపు పాలను మిల్క్ బ్యాంక్ ద్వారా ఇతర శిశువులకు ఇస్తున్నారు 'రుషీనా డాక్టర్ మర్ఫతియా'.
"ప్రపంచంలో చాలా చోట్ల తల్లి పాలు దానం చేస్తారని నాకు తెలుసు. కానీ భారత్లో ఇలాంటివి చేయడానికి ఎందుకు జనం వ్యతిరేకిస్తారో తెలియదు. ఇంట్లో కూడా కొంత మంది ఇది చేయడానికి ముందుకురారు. అలా ఏం కాదు. మనం కూడా చేయగలుగుతాం. ఒక్కోసారి సంవత్సరం, రెండేళ్ల వరకు తల్లులు పాలివ్వగలరని వైద్యులు చెబుతున్నారు. ఎన్ని రోజులు పాలివ్వగలిగితే అంత మంది శిశువులను కాపాడవచ్చు. ఇతర శిశువుల గురించి ఆలోచించి అందరూ పాలను దానం చేయాలని పాలిచ్చే తల్లులను కోరుతున్నాను."
-రుషీనా డాక్టర్ మర్ఫతియా
కన్నతల్లి పాలు లేని సందర్భంలో...
పిల్లలకు కన్నతల్లి పాలు ఇవ్వలేని సందర్భంలో ఇతర వనరుల కోసం అన్వేషిస్తామని చెప్పారు పసిపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ ఆశిష్ మెహతా. మహిళలు దానం చేసిన పాలను పాశ్చరైజ్ చేసి మిల్క్ బ్యాంక్లో నిల్వ చేస్తున్నట్లు తెలిపారు. పాలను దానం చేయడానికి దాదాపు 200 మంది తల్లులు ఈ మిల్క్ బ్యాంకును సంప్రదించారని వెల్లడించారు.
"రుషీనాకు 3-4 నెలల క్రితం ప్రసవం జరిగింది. తనకు అధికంగా పాలు వచ్చేవి. ఒక చదువుకున్న వ్యక్తిగా, ఒక మహిళగా తనకు ఈ తల్లిపాల విలువ తెలుసు. ఆమె మా బ్యాంకును సంప్రదించారు. వెంటనే మేము కూడా అంగీకరించాము. వైద్య పరీక్షల అనంతరం ఆమెకు ఎలాంటి వ్యాధులు లేవని నిర్ధరించుకున్నాం. అప్పటి నుంచి రెండు రోజులకొకసారి 200-300 మిల్లీలీటర్ల పాలను దానం చేస్తూ వచ్చారు. ఇలా మూడు నెలలు దానం చేశారు. ఈ మూడు నెలల్లో ఐదు నుంచి ఆరుగురు శిశువులు తమ తల్లులకు పాలు రాకపోవడం లేదా, తల్లులు చనిపోవడం వంటి కారణాలతో ఉన్నారు. ఆ ఐదుగురు ఒక కిలో కన్నా తక్కువ బరువుతో ఉన్నారు. కానీ రుషీనా మద్దతుతో ఆ తల్లిపాలను ఐదుగురికి అందించాము. ఇప్పుడు ఐదుగురు శిశువులు బతికే ఉన్నారు. వారి పరిస్థితి సాధారణంగా ఉంది."
-డాక్టర్ మెహతా.
మిల్క్ బ్యాంకును ఏర్పాటు చేయడానికి పదేళ్లుగా కృషి చేస్తున్నట్లు డాక్టర్ మెహతా తెలిపారు. చివరకు ఏడాది క్రితం తన కల సాకారమైనట్లు వెల్లడించారు. ఈ సంవత్సర కాలంలో బ్యాంకు 90 లీటర్ల పాలను సేకరిస్తే అందులో 12 లీటర్లను రుషీనా దానం చేసినట్లు తెలిపారు.
ఇదీ చదవండి: 'పౌరచట్టంపై అసెంబ్లీలకు హక్కులేదు, పార్లమెంట్దే నిర్ణయం'