అభియోగ పత్రం బహిర్గతంపై ఈడీకి నోటీసులు అగస్టా హెలికాఫ్టర్ కుంభకోణం కేసు.. రోజుకో మలుపు తిరుగుతోంది. కేసును ఈడీ రాజకీయం చేస్తోందని దిల్లీకోర్టుకు నివేదించారు మధ్యవర్తి క్రిష్టియన్ మిషెల్. ఆయన ఆరోపణలకు ఏప్రిల్ 9లోగా వివరణనివ్వాలని ఈడీకి కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
అదనపు అభియోగపత్రంలోని అంశాలు బయటకు ఎలా వచ్చాయని.. దీనిపై విచారణ చేపట్టాలని కోర్టుకు విన్నవించారు ఈడీ తరఫు లాయర్లు డీపీ సింగ్, ఎన్ కే మట్టా. ఛార్జిషీటును నిందితులకు అందించాల్సి ఉందని ఆలోపే మిషెల్ తరఫు లాయర్లకు అందులోని సమాచారం చేరిందని కోర్టును తెలిపారు.
ప్రత్యేక న్యాయమూర్తి జస్టిస్ అర్వింద్ కుమార్ అగస్టా కేసు విచారణను చేపట్టారు. కేసును రాజకీయం చేస్తున్నారన్న మిషెల్ నివేదనపై ఏప్రిల్ 9 లోగా వివరణనివ్వాలని ఈడీని ఆదేశించింది దిల్లీకోర్టు. ఈడీ అభ్యర్థనపై 11వ తేదీన విచారణ చేపడతామని స్పష్టం చేసింది.
మిషెల్ వ్యాపార భాగస్వామి మధ్యవర్తి డేవిడ్ నిగెల్ జాన్‌కు కేసుతో సంబంధాలున్నాయని అతడికి సమన్లు జారీ చేసింది. మే 9లోగా కోర్టు ముందు డేవిడ్ నిగెల్ను హాజరు పరచాలని ఆదేశించింది. రక్షణ శాఖ ఏజెంట్ సుశేన్ మోహన్ గుప్తాను రెండు రోజుల పాటు కస్టడీకి విచారించేందుకు అప్పగించింది. గుప్తా మనీ ల్యాండరింగ్ కేసులో అరెస్టయ్యాడు.