తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రైతు సంఘాల నేతలతో అమిత్ షా చర్చలు

protest
సాగు చట్టాలకు వ్యతిరేకంగా అన్నదాతల 'భారత్​ బంద్'

By

Published : Dec 8, 2020, 7:26 AM IST

Updated : Dec 8, 2020, 9:23 PM IST

21:16 December 08

రైతులతో బుధవారం జరిగే సమావేశానికి ముందు పలు కర్షక సంఘాల ప్రతినిధులతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా భేటీ అయ్యారు. 

13 మంది రైతు నాయకులను చర్చలకు పిలిచినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. రాత్రి 8 గంటల తర్వాత చర్చలు ప్రారంభమైనట్లు వెల్లడించాయి. చర్చలకు హాజరైన వారిలో ఎనిమిది మంది పంజాబ్, ఐదుగురు దేశవ్యాప్తంగా వివిధ రైతు సంఘాల నేతలకు చెందినవారని పేర్కొన్నాయి.

తొలుత అమిత్ షా నివాసంలో సమావేశం జరుగుతుందని భావించామని, అయితే ప్రస్తుతం పూసా ప్రాంతంలో చర్చలు జరుగుతున్నాయని పలువురు రైతు సంఘాల నేతలు తెలిపారు. 

18:49 December 08

దిల్లీలో నిరసన చేస్తున్న హరియాణా సోనిపట్​కు చెందిన అజయ్ మూర్(32) అనే రైతు మరణించాడు. టిక్రీ సరిహద్దులో ఆందోళనలో పాల్గొన్న ఆయన దగ్గర్లోని ఓపెన్ పార్క్​లో నిద్రించేవాడని.. ఇవాళ ఉదయం ప్రాణాలు కోల్పోయాడని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఆస్పత్రికి పంపించినట్లు చెప్పారు. 

18:39 December 08

'ఆమ్ ఆద్మీగా వెళ్లాలనుకున్నా.. కానీ అడ్డుకున్నారు'

రైతులకు మద్దతు తెలిపేందుకు ముఖ్యమంత్రిగా కాకుండా.. సాధారణ వ్యక్తిగా వెళ్లాలని అనుకున్నట్లు దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. ప్రణాళికలు తెలుసుకొని తనను అడ్డుకున్నారని పరోక్షంగా కేంద్రాన్ని ఉద్దేశించి అన్నారు. భారత్ బంద్ విజయవంతం కావడం సంతోషంగా ఉందని తెలిపారు. ఇంట్లోనే ఉండి రైతుల కోసం ప్రార్థించినట్లు చెప్పారు.

17:05 December 08

  • దిల్లీ: రాత్రి 7 గం.కు రైతుసంఘాలతో హోంమంత్రి అమిత్ షా చర్చలు
  • రేపటి చర్చలకు ముందే రైతుసంఘాలతో భేటీ కానున్న అమిత్ షా
  • అమిత్ షాతో చర్చలకు వెళ్లాలని నిర్ణయించిన రైతుసంఘాలు
  • కొత్త చట్టాల రద్దు, మద్దతుధరకు చట్టబద్ధత కల్పించాలి: రైతుసంఘాలు
  • కొత్త చట్టాలు రద్దు చేసేవరకు ఆందోళనలు కొనసాగిస్తాం: రైతుసంఘాలు

15:56 December 08

కాంగ్రెస్​-భాజపా కార్యకర్తల ఘర్షణ..

భారత్​ బంద్​ నిరసనల్లో భాగంగా.. రాజస్థాన్​లో భాజపా, కాంగ్రెస్​ కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది. జైపుర్​లోని భాజపా కార్యాలయం ఎదుట ఈ ఘటన జరిగింది. 

15:25 December 08

అంబులెన్స్​కు దారి..

హరియాణాలో భారత్​ బంద్​ పాటిస్తున్న నిరసనకారులు.. అంబులెన్స్​కు దారి ఇచ్చి మానవత్వం చాటారు. అంబాలా, హిసార్​ జాతీయ రహదారిపై ఈ ఘటన జరిగింది. 

15:07 December 08

భారత్​ బంద్​తో స్తంభించిన జనజీవనం..

  • ఆందోళనల్లో పాల్గొన్న 25 పార్టీలు, ఉద్యోగ, కార్మిక సంఘాలు
  • బంద్ వల్ల పలు రాష్ట్రాల్లో స్తంభించిన జనజీవనం
  • ధర్నా, రాస్తారోకో, రైల్‌రోకో నిర్వహించిన పలు సంఘాలు
  • పంజాబ్‌లో మూతపడిన వ్యాపార, విద్యాసంస్థలు, టోల్‌ప్లాజాలు
  • అమృత్‌సర్‌, మొహాలీలో ర్యాలీలు, ధర్నాలు, నిరసన ప్రదర్శనలు
  • కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నినాదాలు
  • బంద్ వల్ల ఒడిశాలో నిలిచిన వాహనాల రాకపోకలు
  • బిహార్‌: పట్నా, ముజఫర్‌పూర్‌, దర్బంగాలో నిరసనలు
  • ఝార్ఘండ్‌లో వామపక్ష శ్రేణుల ర్యాలీలు, నినాదాలు
  • చెన్నై, పుదుచ్చేరిలో వామపక్ష శ్రేణుల భారీ ప్రదర్శన
  • కార్పొరేట్ల కోసం తెచ్చిన చట్టాలు రద్దు చేయాలని నినాదాలు

14:57 December 08

అమిత్​ షాతో భేటీ..

వ్యవసాయ చట్టాల గురించి చర్చించేందుకు.. ఇవాళ రాత్రి 7 గంటలకు కేంద్ర హోం మంత్రి అమిత్​ షాను కలవనున్నట్లు వెల్లడించారు భారతీయ కిసాన్​ యూనియన్​ అధికార ప్రతినిధి టికైత్​. ప్రస్తుతం దిల్లీ సింఘూ సరిహద్దు వద్దకు వెళ్లి అక్కడినుంచి హోం మంత్రి నివాసానికి వెళ్తామని స్పష్టం చేశారు. 

14:46 December 08

లాయర్ల నిరసన..

దిల్లీ తీస్​ హజారీ జిల్లా కోర్టు వద్ద.. భారత్​ బంద్​కు మద్దతుగా అఖిల భారత న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. రైతులకు సరైన పరిష్కారం లభించాలని వారు కోరారు.  

14:45 December 08

తోమర్​తో హరియాణా సీఎం భేటీ..

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనలపై చర్చించేందుకు వ్యవసాయ మంత్రి తోమర్​ ఇంటికి వెళ్లారు హరియాణా ముఖ్యమంత్రి మనోహర్​ లాల్​ ఖట్టర్​. తదుపరి వ్యూహాలపై చర్చిస్తున్నారు. 

14:14 December 08

బెంగళూరులో వినూత్న నిరసన

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా బెంగళూరులోని టౌన్​ హాల్​ వద్ద రాజకీయ పార్టీలు,  వివిధ సంస్థలు వినూత్నంగా నిరసన తెలిపాయి. 

13:54 December 08

పుదుచ్చేరిలో ప్రదర్శన..

కాంగ్రెస్​తో పాటు ఇతర రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో పుదుచ్చేరిలో నూతన వ్యవసాయ చట్టాలకు నిరసిస్తూ ప్రదర్శన నిర్వహించారు. ఈ ర్యాలీలో పుదుచ్చేరి సీఎం నారయణస్వామి  పాల్గొన్నారు.

13:45 December 08

జమ్ముకశ్మీర్​లో పాక్షికం..

రైతు సంఘాలు ఇచ్చిన బంద్​కు జమ్ముకశ్మీర్​లో మిశ్రమ స్పందన లభించింది. ప్రజా రవాణా పూర్తిగా నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. దుకాణాలు, వ్యాపార సంస్థలు పాక్షికంగా తెరుచుకున్నాయి.

13:18 December 08

నల్ల రిబ్బన్లు ధరించి నిరసన

రైతులు నిర్వహిస్తున్న భారత్​ బంద్​కు మద్దతుగా దిల్లీ సరోజిని నగర్ మార్కెట్​లోని వర్తకులు నల్ల రిబ్బన్లు ధరించారు.​ రైతుల చేస్తున్న డిమాండ్​ను నెరవేర్చాలని కేంద్రాన్ని కోరారు. కనీస మద్దతు ధర డిమాండ్​ను కేంద్రం ఎందుకు నెరవేర్చడం లేదని ప్రశ్నించారు.

13:07 December 08

భారత్​ బంద్​కు దేశంలోని ప్రతి ఒక్కరు మద్దతుగా నిలవాలని ట్విట్టర్ వేదికగా పిలుపునిచ్చారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. రైతు చట్టాలను ఉపసంహరించుకోవాలని కేంద్రాన్ని డిమాండ్​ చేస్తున్న అన్నదాతలకు బాసటగా నిలవాలని హిందీలో ట్వీట్​ చేశారు. రైతుల నుంచి దోచుకోవడం ఆపాలని ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు.

12:57 December 08

వివిధ పార్టీలకు చెందిన ఐదారు మంది నాయకులు రేపు కలవనున్నట్లు చెప్పారు ఎన్సీపీ అధినేత శరద్​ పవార్​. అందురూ కూర్చొని చర్చించి ఏకాభిప్రాయానికి రానున్నట్లు తెలిపారు. రేపు సాయంత్రం 5 గంటలకు రాష్ట్రపతితో భేటీ అయినప్పుడు తమ ఉమ్మడి నిర్ణయాన్ని ఆయనకు తెలియజేస్తామని చెప్పారు.

12:51 December 08

బిహార్ మొత్తం బంద్​..

బిహార్​లో భారత్​ బంద్​ ప్రభావం స్పష్టంగా కన్పించింది. ప్రతిపక్ష ఆర్జేడీ, పప్పు జాదవ్ నేతృత్వంలోని జన్ అధికారి పార్టీ బంద్​కు మద్దతు తెలిపాయి. ఆ పార్టీల కార్యకర్తలు జెండాలు పట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. ఫలితంగా దుకాణాలను తెరిచేందుకు ఎవరూ ధైర్యం చేయలేదు. రోడ్లన్నీ బోసిపోయి నిర్మానుష్యంగా కన్పించాయి.

12:38 December 08

రాజస్థాన్​లో మిశ్రమ స్పందన..

రైతు సంఘాలు పిలుపునిచ్చిన భారత్​ బంద్​కు రాజస్థాన్​లో మిశ్రమ స్పందన వచ్చింది. మార్కెట్లను స్వచ్ఛందంగా మూసివేయగా, కొన్ని దుకాణాలు మాత్రం యథావిధిగా తెరుచుకున్నాయి. భారత్​ బంద్​కు రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్​ మద్దతు తెలిపింది. బంద్ శాంతియుతంగా జరుగుతున్నట్లు కిసాన్​ మహా పంచాయత్ అధ్యక్షుడు రాంపాల్​ జాట్ తెలిపారు. రాష్ట్రంలోని అన్ని మార్కెట్లు బంద్​ను పాటించినట్లు పేర్కొన్నారు. పెట్టుబడిదారులకు అనుకూలంగా కేంద్రం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్​ చేశారు.

12:19 December 08

రేపు విపక్ష నేతల భేటీ

  • రేపు రాష్ట్రపతిని కలవనున్న విపక్ష నేతల బృందం
  • రేపు సా. 5 గం.కు ఐదుగురు నేతలకు అవకాశం ఇచ్చిన రాష్ట్రపతి
  • వ్యవసాయ చట్టాలపై రైతుల ఆందోళనను రాష్ట్రపతికి వివరించనున్న నేతలు
  • దేశవ్యాప్తంగా నిరసనల అంశాన్ని రాష్ట్రపతికి వివరించనున్న నేతలు
  • రాష్ట్రపతిని కలిసేముందు శరద్ పవార్ నివాసంలో భేటీకానున్న నేతలు
  • రేపు మధ్యాహ్నం ఒంటిగంటకు శరద్ పవార్ నివాసంలో విపక్ష నేతల భేటీ

12:14 December 08

  • వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా భారత్ బంద్
  • రైతులకు మద్దతుగా దేశవ్యాప్తంగా ఆందోళనలు
  • దేశవ్యాప్తంగా 25 రాజకీయ పార్టీలతో పాటు ఉద్యోగ, కార్మిక సంఘాల మద్దతు
  • పలు రాష్ట్రాల్లో తెల్లవారుజాము నుంచే రాస్తారోకోలు, ప్రదర్శనలు
  • పంజాబ్‌లో సంపూర్ణంగా జరుగుతోన్న భారత్‌ బంద్‌
  • అమృత్‌సర్‌లో రైతు, కార్మిక సంఘాల నిరసన ప్రదర్శన
  • మొహాలీలో టోల్‌ప్లాజాలను మూసివేసిన అధికారులు
  • భారత్ బంద్‌కు మద్దతుగా ఒడిశాలో ఆందోళనలు
  • ఒడిశా: బంద్‌లో పాల్గొన్న వామపక్షాలు, కార్మిక, రైతు సంఘాలు
  • భువనేశ్వర్ రైల్వేస్టేషన్‌లో రైల్‌రోకో నిర్వహించిన నాయకులు
  • మహారాష్ట్రలో బంద్‌లో పాల్గొన్న పలు ఉద్యోగ, కార్మిక సంఘాలు
  • మహారాష్ట్రలో 'స్వాభిమాని శెట్కారి సంఘటన' రైతు సంఘం ఆధ్వర్యంలో రైల్‌రోకో
  • బుల్ధానా జిల్లా మల్కాపుర్‌ రైల్వేస్టేషన్ ట్రాక్‌పై రైతుల నిరసన
  • భారత్ బంద్‌కు మద్దతుగా బంగాల్‌లో వామపక్షాల ఆందోళన
  • బంగాల్: జాదవ్‌పుర్‌లో ప్రదర్శన నిర్వహించిన వామపక్ష శ్రేణులు
  • ఉత్తర పరగణాల్లో వామపక్షాల ఆధ్వర్యంలో రైల్‌రోకో
  • భారత్‌ బంద్‌లో భాగంగా కర్ణాటకలో రైతు సంఘాల నిరసన ప్రదర్శన
  • మైసూర్‌లో బస్సుల రాకపోకలను అడ్డుకున్న ఆందోళనకారులు
  • భారత్‌ బంద్‌కు సంఘీభావంగా కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఆందోళన
  • కర్ణాటక అసెంబ్లీ ఎదుట ప్లకార్డులు, నల్లజెండాలతో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల నిరసన
  • అసోంలో సంపూర్ణంగా సాగుతోన్న భారత్ బంద్
  • గువహటిలో తెరుచుకోని వ్యాపార సంస్థలు, దుకాణాలు
  • బిహార్‌లో రైతు, కార్మిక, ఉద్యోగ సంఘాల ఆందోళన
  • బిహార్: దర్బంగాలో రైతు సంఘాల ఆధ్వర్యంలో ప్రదర్శన తమిళనాడులోనూ భారత్‌ బంద్‌ ప్రభావం
  • చెన్నైలో భారీ ప్రదర్శన నిర్వహించిన వామపక్ష శ్రేణులు

11:54 December 08

దిల్లీ-యూపీ సరిహద్దులో..

దిల్లీ-యూపీ సరిహద్దులోని ఘాజిపుర్​-ఘాజియాబాద్​ రహదారిపై రైతులు, రైతు సంఘాల నాయకులు  ఆందోళనకు దిగారు. 

11:41 December 08

మోహలీలో..

బంద్​లో భాగంగా ఛండీగఢ్​ మోహలీ జాతీయ రహదారిని ఆందోళనకారులు దిగ్బంధించారు. 

11:27 December 08

అసోంలో అరెస్ట్​

అసోంలోని గువహటిలో నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ జనతా భవన్ ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

11:22 December 08

  • దిల్లీలో మధ్యాహ్నం 3 వరకు బంద్ నిర్వహించనున్న రైతు సంఘాలు
  • రహదారులపైకి వచ్చి రైతు సంఘాల నిరసన
  • కొత్త సాగు చట్టాలను వెనక్కి తీసుకోవాలని పెద్దఎత్తున నినాదాలు
  • రైతులకు మద్దతు తెలిపిన ఉద్యోగ, కార్మిక సంఘాలు
  • దిల్లీలో అన్ని రహదారులను దిగ్బంధించిన రైతులు
  • దిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేసిన పోలీసు బలగాలు
  • అంబులెన్స్, వివాహ వాహనాలకు మాత్రమే అనుమతి

11:20 December 08

కేజ్రీవాల్​ హౌస్​ అరెస్ట్​పై పోలీసులు ఏమన్నారంటే..

దిల్లీ సీఎం కేజ్రీవాల్​ను పోలీసులు హౌస్​ అరెస్ట్​ చేశారు. సోమవారం సింఘు సరిహద్దులో రైతులను కలిసినప్పటి నుంచి పోలీసులు కేజ్రీవాల్​ను గృహ నిర్బంధం చేసినట్లు ఆమ్​ ఆద్మీ పార్టీ అధికార ప్రతినిధి సౌరభ్​ తెలిపారు. కేంద్ర హోంమంత్రి అమిత్​ షా ఆదేశాల మేరకే కేజ్రీవాల్​ను హౌస్​ అరెస్ట్​ చేసినట్లు ఆయన ఆరోపించారు. ఇంట్లోకి పోవడానికి.. ఇంట్లో ఉన్నవాళ్లు బయటికి రావడానికి ఎవరినీ అనుమతించడం లేదన్నారు.  

అయితే హౌస్​ అరెస్ట్​ విషయంపై స్పందించారు దిల్లీ పోలీసులు. సీఎం కేజ్రీవాల్​ గృహ నిర్బంధం చేశామనడంలో వాస్తవం లేదన్నారు. నిన్న సాయంత్రం కూడా కేజ్రీవాల్​ బయటకు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఆయన సీఎం కాబట్టి ఎక్కడికైనా పోవచ్చని తెలిపారు. రక్షణ కోసమే సీఎం ఇంటి వెలుపల సెక్యూరిటీని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.  

10:57 December 08

ఎన్​హెచ్​9 పూర్తిగా దిగ్బంధం

భారత్​ బంద్​లో భాగంగా దేశవ్యాప్తంగా రైతులు జాతీయ రహదారి-9ని పూర్తిస్థాయిలో దిగ్బంధించారు.

10:55 December 08

బంద్​లో పాల్గొన్న ఆటో, టాక్సీ యూనియన్లు

రైతు సంఘాలు ఇచ్చిన బంద్​లో కొన్ని ఆటో, టాక్సీ యూనియన్లు పాల్గొన్నాయి. నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని నాయకులు డిమాండ్​ చేశారు.

10:35 December 08

దిల్లీ సీఎం కేజ్రీవాల్​ను పోలీసులు హౌస్​ అరెస్ట్​ చేశారు. సోమవారం సింఘు సరిహద్దులో రైతులను కలిసినప్పటి నుంచి పోలీసులు కేజ్రీవాల్​ను గృహ నిర్బంధం చేసినట్లు ఆమ్​ ఆద్మీ పార్టీ ట్వీట్​ చేసింది.

10:34 December 08

ఝార్ఖండ్​లో బైక్​ ర్యాలీ

నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఝార్ఖండ్​లో ట్రేడ్​ యూనియన్ల ఆధ్వర్యంలో బైక్​ ర్యాలీ నిర్వహించారు. 

10:29 December 08

బంగాల్​లో దిష్టిబొమ్మ దహనం

కోల్‌కతాలోని జాదవ్‌పుర్​లో నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా వామపక్షాల ఆధ్వర్యంలో దిష్టిబొమ్మను  దహనం చేశారు.

10:15 December 08

బంగాల్​లో ట్రేడ్​ యూనియన్ల ఆధ్వర్యంలో..

బంగాల్​లో ట్రేడ్​ యూనియన్ల ఆధ్వర్యంలో బంద్​కు మద్దతుగా ప్రదర్శన నిర్వహించారు నాయకులు. కేంద్రం నూతన  చట్టాలను వెనక్కి తీసుకోవాలని నినాదాలు చేశారు.

10:14 December 08

బిహార్​లో నిరసన  

బిహార్​లోని గాంజ్​ చౌక్​లో  ఆర్జేడీ నాయకులు ఆందోళనలో పాల్గొన్నారు. రోడ్డుపై టైర్​ దహనం చేసి నిరసన తెలిపారు.  

10:04 December 08

నల్ల జెండాలతో కాంగ్రెస్​ నిరసన

కర్ణాటకలో కాంగ్రెస్​ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. బెంగళూరులోని విధాన సౌధ వద్ద ఉన్న గాంధీ విగ్రహం నల్ల  జెండాలతో నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

09:56 December 08

కర్ణాటకలో రోడ్లపై బైఠాయింపు..

కర్ణాటకలో భారత్​ బంద్​కు మద్దతుగా రోడ్లమీదకు వచ్చారు వామపక్ష నాయకులు. కాలాబర్గిలో రోడ్లపై బైఠాయించిన నాయకులు.. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

09:50 December 08

అన్నా హజారే ఒకరోజు దీక్ష

రైతు సంఘాలు ఇచ్చిన భారత్​ బంద్​కు మద్దతుగా సామాజిక కార్యకర్త అన్నా హజారే ఒక రోజు నిరాహార దీక్షలో కూర్చున్నారు.  రైతుల ఆందోళన దేశమంతా వ్యాపించి.. కేంద్రం మీద ఒత్తిడి తెస్తుందని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు హజారే.  

09:43 December 08

'మా ఆందోళన పూర్తిగా భిన్నమైంది'

నూతన చట్టాలకు వ్యతిరేకంగా తాము చేస్తున్న ఆందోళన న్యాయమైందన్నారు రైతు సంఘాల నాయుకులు.  బంద్​ నేపథ్యంలో ఎవరైనా ట్రాఫిక్‌లో చిక్కుకుంటే వారికి పండ్లు, నీరు ఇస్తామి చెప్పారు.

09:30 December 08

బంద్​కు దూరంగా బ్యాంకు యూనియన్లు  

రైతు సంఘాలు ఇచ్చిన భారత్​ బంద్​లో తాము పాల్గొనడం లేదని బ్యాంకు యూనియన్లు తెలిపాయి. ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ (ఏఐబీఓసీ) ప్రధాన కార్యదర్శి సౌమ్య దత్తా ఈ విషయాన్ని వెల్లడించారు.

09:17 December 08

కోల్​కత్తా

బంగాల్​లో రైల్​రోకో..

బంగాల్​లో వామపక్షాలు రైతులకు మద్దుతుగా బంద్​ పాటిస్తున్నాయి. కోల్​కత్తా జోద్​పుర్​ రైల్వే స్టేషన్​లో నాయకులు పట్టాలపై బైఠాయించారు. 

09:11 December 08

బిహార్​ పట్నాలో..  

బిహార్​ పట్నాలో బంద్​ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా బలగాలను మోహరించింది రాష్ట్ర ప్రభుత్వం.  

09:08 December 08

భారీ భద్రత

భారత్​ బంద్​ నేపథ్యంలో దిల్లీ- హరియాణా సింఘు సరిహద్దు వద్ద భారీ భద్రతను మోహరించారు. 

09:00 December 08

  • దేశవ్యాప్తంగా ప్రశాంతంగా భారత్ బంద్
  • రైతులకు మద్దతుగా దేశవ్యాప్తంగా ఆందోళనలు
  • దిల్లీ సరిహద్దుల్లో 13వ రోజుకు చేరిన రైతుల ఆందోళనలు
  • తెల్లవారుజాము నుంచే దిల్లీలో బంద్ ప్రభావం
  • చలిని సైతం లెక్కచేయకుండా రోడ్లపై రైతుల ఆందోళన
  • భారత్ బంద్ నేపథ్యంలో దిల్లీ సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం
  • సింఘు, టిక్రీ, ఘాజిపూర్ సహా పలు దిల్లీ సరిహద్దు రోడ్లు మూసివేత
  • దిల్లీ-యూపీ నోయిడా లింక్ రోడ్డు 24 నంబర్ జాతీయ రహదారి మూసివేత
  • దిల్లీ సరిహద్దులకు భారీగా చేరుకుంటున్న అన్నదాతలు
  • దిల్లీ సరిహద్దులకు చేరుకుంటున్న పంజాబ్, హరియాణా రైతులు
  • దిల్లీ సరిహద్దులకు చేరుకుంటున్న మధ్యప్రదేశ్, రాజస్థాన్, యూపీ రైతులు
  • హరియాణా, నోయిడా నుంచి దిల్లీ వచ్చే వాహనాలు మళ్లింపు
  • దిల్లీ సరిహద్దుల్లో భారీగా కేంద్ర బలగాల మోహరింపు
  • దిల్లీకి వచ్చే ప్రతి వాహనాన్ని తనిఖీ చేసి అనుమతిస్తున్న పోలీసులు
  • రేపు మరోసారి రైతు సంఘాల నాయకులతో చర్చలు జరపనున్న కేంద్రం
  • ఇప్పటికే ఐదుసార్లు చర్చలు జరిపినా పట్టువీడని రైతులు

08:25 December 08

13వ రోజుకు

బురారీలోని నిరంకారీ మైదానంలో రైతుల ఆందోళనలు 13వ రోజుకు చేరుకున్నాయి. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా  అందరూ బంద్​లో పాల్గొనాలని పిలుపునిచ్చాయి రైతు సంఘాలు.

08:13 December 08

ఒడిశాలో రైల్​రోకో

ఒడిశాలో వామపక్షాలు, కార్మిక సంఘాలు, రైతు సంఘాలు బంద్​లో పాల్గొన్నాయి. భువనేశ్వర్​ రైల్వే స్టేషన్​లో పట్టాలపై బైఠాయించి.. నాయకులు రైల్​రోకో నిర్వహించారు. 

07:43 December 08

భారత్​ బంద్​కు మద్దతుగా మహారాష్ట్రలోని 'స్వాభిమాని శెట్కారి సంఘటన' రైతు సంఘం రైల్​ రోకో నిర్వహించింది. బుల్ధానా జిల్లా మల్కాపుర్​లోని రైల్వే స్టేషన్లో ట్రాక్​పై ఆందోళనలు చేపట్టింది. ఓ రైలును బయల్దేరకుండా నిరసనకారులు అడ్డుకున్నారు. రంగంలోని దిగిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

07:19 December 08

భారత్ బంద్

నూతన వ్యవసాయ చట్టాలను ఉపసంహరించాలన్న డిమాండ్‌తో సంకల్పించిన నేటి భారత్‌ బంద్‌కు రైతు సంఘాలు సర్వ సన్నద్ధమయ్యాయి. సాగు చట్టాలపై వ్యతిరేకత సహా తమ ఐక్యతను మాత్రమే ప్రదర్శిస్తూ సామాన్యులకు ఏ విధమైన ఇబ్బంది కలగకుండా నిరసన తెలిపేందుకు కర్షకులు సిద్ధమయ్యారు. తాము తలపెట్టిన బంద్ రాజకీయ పార్టీల బంద్‌ వంటిది కాదని రైతుసంఘాలు ఇప్పటికే స్పష్టంచేశాయి.

రోడ్డు దిగ్బంధం వంటి నిరసనలు 3 గంటల వరకే జరుగుతాయని రైతు సంఘాలు వెల్లడించాయి. దీని ద్వారా సాధారణ పౌరులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని బంద్‌ సమయంలో ప్రయాణాలు చేయవద్దని ప్రజలను కోరుతున్నట్లు తెలిపాయి. ఇప్పటివరకు తమ ఆందోళనలు శాంతియుతంగానే సాగాయని ఇకపైనా అదే విధంగా ఉంటాయని భారతీయ కిసాన్‌ యూనియన్‌ ప్రతినిధి రాకేశ్‌ టికైట్‌ చెప్పారు.

బంద్‌లో పాల్గొనాలని ఎవరినీ బలవంతం చేయకూడదని రైతు సంఘాలు సూచించాయి. అత్యవసర సేవలు, నిత్యావసర సేవలకు ఎలాంటి అడ్డంకులు సృష్టించవద్దని వివాహాలను అడ్డుకోవద్దని రైతుల సంఘాల ప్రతినిధులు సూచించారు. తమ ఆందోళనల్లో రాజకీయాలకు తావు లేదని, రాజకీయ నేతలకు తమ వేదికలపై అనుమతి లేదని రైతుసంఘాలు తేల్చిచెప్పాయి. ఆరో విడత చర్చలకు ముందు కేంద్రంపై ఒత్తిడి పెంచేలా భారత్‌ బంద్‌ విజయవంతం చేయాలని రైతుసంఘాలు కోరాయి.

తీవ్ర ప్రభావం!

భారత్‌ బంద్‌ ప్రభావం పలు రంగాలపై పడనుంది. బంద్‌ సమయంలో రవాణా నిలిచిపోయే అవకాశం ఉన్నందున, రవాణా రంగంపై తీవ్ర ప్రభావం ఉండనుంది. దేశరాజధాని దిల్లీలో నిత్యావసర సరుకుల రవాణాకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. అటు రైల్వేలపై కూడా బంద్‌ ప్రభావం ఉండే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాల్లో రైలుదిగ్బంధం వంటి కార్యక్రమాలు ఉండనున్నాయని భారతీయ రైల్వే అంచనా వేస్తోంది. ఈ మేరకు, స్టేషన్లు, రైళ్లలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా మార్గదర్శకాలు జారీ చేసింది. వామపక్ష తీవ్రవాదులు నిరసనల్లో పాల్గొనే అవకాశం ఉందని జోనల్‌రైల్వేలను అప్రమత్తం చేసింది.

బంద్‌ నేపథ్యంలో జోనల్‌ రైల్వేల జనరల్‌ మేనేజర్లను అప్రమత్తంగా ఉండాలని సూచించింది. రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌, రాష్ట్రాల పోలీసులతో సమన్వయం చేసుకొని చెకింగ్‌ నిర్వహించాలని ఆదేశించింది. మరోవైపు ట్యాక్సీలు, క్యాబ్‌లు నిలిచిపోనున్నాయి. అయితే రోడ్డు దిగ్బంధం వంటి కార్యక్రమాల ద్వారా పలు చోట్ల ట్రాఫిక్‌ సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో దిల్లీ, హరియాణా పోలీసులు ట్రాఫిక్‌ అడ్వైజరీ జారీ చేశారు.

మార్గదర్శకాలు..

భారత్‌ బంద్‌ నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించింది. నిరసనలు శాంతియుతంగా జరిగేలా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. కరోనా నిబంధనలకు కూడా అమలు చేయాలని స్పష్టం చేసింది.

Last Updated : Dec 8, 2020, 9:23 PM IST

ABOUT THE AUTHOR

...view details