రేపటి తరాల భవిత కోసం ప్లాస్టిక్‌పై పోరు బాట ఆరా, కేరమ్... ఝార్ఖండ్ రాంచీ జిల్లాలోని మారుమూల గ్రామాలు. నీటి సంరక్షణలో ఈ రెండు గ్రామాలు చేసిన కృషిని సాక్షాత్ ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. తాజాగా ప్లాస్టిక్ భూతంపై ఈ రెండు గ్రామాలు పోరుబాట పట్టాయి.
ఝార్ఖండ్ రాజధాని రాంచీ నుంచి 25 కి.మీ దూరంలో ఉన్నాయి ఈ రెండు గ్రామాలు. ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ సంచులను పారద్రోలేందుకు ఆరా, కేరమ్ గ్రామ పంచాయతీ భారీ ఎత్తున ప్రచారం నిర్వహిస్తోంది.
ప్లాస్టిక్ రహిత గ్రామంగా మారేందుకు పంచాయతీ సభ్యులు అవగాహన కార్యక్రమాలను చేపడుతున్నారు. నో- ప్లాస్టిక్ నియమాన్ని ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధిస్తున్నారు.
"ఈ ఆలోచనకు మాకు ప్రేరణ ఎక్కడినుంచో రాలేదు. మా గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు, అందంగా తీర్చిదిద్దేందుకు ప్రతి గురువారం, గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహిస్తాం. ఒకసారి అలాంటి సమావేశంలోనే మా గ్రామాన్ని 'ప్లాస్టిక్ రహితం'గా మార్చాలని తీర్మానించాం. ఎవరైనా ఈ నియమాన్ని ఉల్లంఘిస్తే మొదటిసారి రూ.150 జరిమానా విధిస్తాం. మరోసారి దొరికితే రూ.500 వేస్తాం."
- గోపాల్ బేడియా, గ్రామపెద్ద
పంచాయతీ తీసుకున్న ఈ నిర్ణయానికి రెండు గ్రామాల ప్రజల నుంచి అదే రీతిలో మద్దతు లభిస్తోంది. పాలిథిన్ కవర్లను వదిలి.. వస్త్ర సంచులవైపు మొగ్గు చూపుతున్నారు గ్రామవాసులు. సంతకు వెళ్లే ప్రతిసారి ఈ సంచులనే తీసుకెళ్తున్నారు.
"మేము సంతకు వెళ్లేటప్పుడు ఈ వస్త్ర సంచులనే పట్టుకెళ్తున్నాం. ఒకవేళ దుకాణదారులు పాలిథిన్ కవర్లు ఇచ్చినా... మాకు వద్దు.. మా గ్రామంలో ప్లాస్టిక్‌ను నిషేధించామని చెబుతున్నాం. మేము పట్టుకెళ్లిన సంచిలోనే సామాన్లు తీసుకొస్తున్నాం."
- రాజమణి దేవి, గ్రామస్థురాలు
ఒకసారి వాడిపారేసే ప్లాస్టిక్‌ను గ్రామాల్లో నిషేధించాలని ప్రధాని మోదీ గత ఏడాది ప్రకటించక ముందే ప్లాస్టిక్‌ను నిషేధించాలని ఆరా,కేరమ్ గ్రామాలు తీర్మానించాయి. త్వరలోనే అనుకున్నది సాధిస్తామని గ్రామస్థులు చెబుతున్నారు.