లాక్డౌన్లో వలస కూలీల దయనీయ స్థితిని తెలిపే మరో ఘటన హరియాణాలో జరిగింది. పంజాబ్లోని లుథియానా నుంచి 100 కిలోమీటర్లు కాలి నడకన ప్రయాణించి.. హరియాణాలోని అంబాలాకు చేరుకుంది ఓ గర్భిణి. అక్కడే ఆమెకు పురిటినొప్పులు మొదలయ్యాయి. ఆడబిడ్డకు జన్మనివ్వగా.. ఆ శిశువు కొద్ది సేపటికే మరణించింది. అంబాలాలోనే ఆ బిడ్డకు అంత్యక్రియలు చేశారు తల్లిదండ్రులు.
ఉద్యోగం పోయి...
బిందియా- రామ్ రెండేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. బిహార్ నుంచి గతేడాది లుథియానాకు వచ్చారు. అప్పటి నుంచి రామ్ ఓ ఫ్యాక్టరీలో కూలీగా పనిచేస్తున్నాడు. కరోనా సంక్షోభం వల్ల రామ్ ఉద్యోగం కోల్పోయాడు. అప్పటి నుంచి బిందియాకు సరైన భోజన వసతులు లేవు. గర్భిణికి అందాల్సిన పోషకాలూ అందలేదు.