నాలుగురోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మహారాష్ట్ర అస్తవ్యస్తమైంది. భారీ వర్షాలకు ఎటు చూసినా నీరే దర్శనమిస్తోంది. గోడలు కూలిన ఘటనలతో ఆ రాష్ట్రంలో ఎందరో ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం అర్ధరాత్రి ఒక డ్యామ్‌కు గండి పడిన ఘటన ఆ రాష్ట్ర పరిస్థితిని మరింత దయనీయంగా మార్చింది.
రత్నగిరి జిల్లా తివారే గ్రామంలో ఉందీ డ్యామ్. కుండపోత వర్షాలతో డ్యామ్‌కు గండిపడింది. ఉద్ధృతంగా ప్రవహించిన నీరు సమీపంలోని నివాసాలపై విరుచుకుపడింది. క్షణాల్లోనే అనేక మంది గల్లంతయ్యారు. నీటి ఉద్ధృతికి 12-15 ఇళ్లు కొట్టుకుపోయాయి. మరికొన్ని నివాసాలు బాగా దెబ్బతిన్నాయి.
అధికారులు యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో ఇప్పటివరకు 23 మృతదేహాలను వెలికితీశారు. మిగిలినవారి కోసం గాలింపు కొనసాగిస్తున్నారు.