లాక్‌డౌన్ కారణంగా వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన ఉత్తర్‌ప్రదేశ్ వాసులను సొంత రాష్ట్రానికి తరలించేందుకు రంగం సిద్ధం కానుంది. ఇప్పటికే ఈ అంశంపై కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రికి లేఖ రాశారు. కాంగ్రెస్ తరపున వెయ్యి బస్సులను సమకూర్చేందుకు సిద్ధమని ప్రియాంక గాంధీ అందులో పేర్కొన్నారు. లాక్‌డౌన్ ఆంక్షల నేపథ్యంలో రవాణాకు ప్రభుత్వం అనుమతివ్వాలని ఆమె కోరారు.
సరేనన్న సర్కార్..
ప్రియాంక గాంధీ ప్రతిపాదనకు తాజాగా యోగి ప్రభుత్వం అంగీకరించింది. దీనికి సంబంధించి 1000 బస్సులు, డ్రైవర్ల వివరాలను వీలైనంత తొందరగా ప్రభుత్వానికి తెలియజేయాలని.. ప్రియాంక గాంధీకి రాసిన ప్రత్యుత్తరంలో పేర్కొన్నారు రాష్ట్ర అదనపు ముఖ్యకార్యదర్శి అవనీశ్ అవస్తి.