తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భారత సైనికుల దెబ్బకు పరిగెత్తిన చైనా జవాన్లు! - After Galwan Post China troops got panic

గల్వాన్​ ఘటనలో చైనాకు చిక్కిన భారత సైనికులు తిరిగి స్వదేశానికి వచ్చిన తర్వాత వారికి వైద్య పరీక్షలు నిర్వహించారు అధికారులు. అయితే ఈ పరీక్షల్లో ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. అప్పటి ఘర్షణ సమయంలో భారత సైనికుల వీరోచిత పోరాటాన్ని చూసి శత్రు దేశ సైనికులు భయపడి పారిపోయినట్లు వారు తెలిపారు. వారిని వెంబడించే క్రమంలోనే బందీలుగా చిక్కినట్లు సదరు సైనికులు వెల్లడించారు.

After Galwan Post China troops got panic and terrified
భారత జవాన్ల దెబ్బతో చైనా సైన్యం వణికింది

By

Published : Jun 22, 2020, 1:30 PM IST

చైనా సైనికుల చెర నుంచి విడుదలైన పది మంది భారత జవాన్లకు నిర్వహించిన మానసిక, వైద్యారోగ్య పరీక్షల్లో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. గల్వాన్‌ ఘటన తర్వాత శత్రుదేశ సైనికులు చాలా భయపడ్డారని తెలిసింది. ఇద్దరు మేజర్‌ స్థాయి అధికారులు, ఇద్దరు కెప్టెన్లతో సహా పది మంది భారత సైన్యం గల్వాన్‌ ఘటన తర్వాత ప్రత్యర్థులకు చిక్కిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం విడుదలైన వారికి తాజాగా మానసిక, వైద్యారోగ్య పరీక్షలు నిర్వహించారు.

పారిపోయిన చైనా సైనికులు..

రెండు రోజులపైనే ప్రత్యర్థి చేతిలో బందీ అయినా, వారంతా చాలా ఉత్సాహంగా ఉన్నారని తెలిసింది. ఈనెల 15న రాత్రి గల్వాన్‌ ఘటనలో కర్నల్‌ సంతోష్‌బాబు వీర మరణం పొందారని తెలిశాక భారత సైన్యం తిరగబడింది. చైనా సైనికులపై ప్రతిదాడి చేసింది. ఈ క్రమంలోనే పొరుగు దేశ సైనికులు భయపడి తమ భూభాగంలోకి పరిగెత్తారట. వారిని వెంబడిస్తూ వెళ్లిన మన సైనికులు బందీలుగా చిక్కారు. ఈ ఘటన భారత సైనికుల ధైర్య సాహసాలను తెలియజేస్తుందని ఓ ఉన్నతాధికారి అన్నారు.

వణికిపోతున్న చైనా సైన్యాధికారులు

ఆ రాత్రి జరిగిన ఘటనలో భారత్‌ నుంచి ప్రతిదాడి ఎదురవుతుందని, తొలుత చైనా సైన్యం ఊహించలేకపోయిందని, భారత జవాన్లు తిరగబడేసరికి వారు చాలా భయపడ్డారని ఈ పది మంది జవాన్లకు నిర్వహించిన పరీక్షల్లో తేలిందని చెప్పారు. ఆ ఘటన తర్వాత భారత్‌ నుంచి పెద్ద స్థాయిలో ప్రతిదాడి జరుగుతుందని భావించిన చైనా సైన్యాధికారులు వణికిపోయినట్లు తెలిసిందన్నారు. అలాగే భారత జవాన్లు బందీలుగా ఉన్న సమయంలోనూ వాళ్లకేం చేయాలో అర్థంకాలేదని తెలిపారు.

మరోవైపు ఇంటెలిజెన్స్‌ సమాచారం ప్రకారం.. గల్వాన్‌ ఘటనలో అమరులైన భారత జవాన్లకు ప్రభుత్వ లాంఛనాలతో ఊరేగింపులు, అంత్యక్రియలు జరిగిన వీడియోలు, చిత్రాలను చైనా నెటిజన్లు సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారని, అదే సమయంలో చైనా అధికారులు మాత్రం చనిపోయిన తమ సైనికుల సమాచారం ఇప్పటివరకూ తెలియజేయలేదని సామాజిక మాధ్యమాల్లో ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారని ఆ అధికారి పేర్కొన్నారు. అలాగే చైనా ఇప్పటివరకు నిజమైన యుద్ధాలను చేయలేదని, అలాంటి పరిస్థితులు తలెత్తితే వాస్తవంగా ఏం చేయాలో కూడా దానికి తెలియదన్నారు. ప్రపంచ దృష్టిని ఆకర్షించడానికే చిన్న చిన్న వాటిని పెద్దగా చూపిస్తోందని విమర్శించారు. జూన్‌ 15 రాత్రి నిజమైన భారత సైన్యాన్ని చూసిందని ఆయన వ్యాఖ్యానించారు.

ఇదీ చూడండి:సరిహద్దు ఉద్రిక్తతపై మరోసారి భారత్​- చైనా భేటీ

ABOUT THE AUTHOR

...view details