కరోనా వైరస్ మహమ్మారిని కట్టడి చేసేందుకు భారత్ బయోటెక్ తయారుచేసిన 'కోవాగ్జిన్' టీకాను ఆగస్టు 15నాటికి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్న విషయం తెలసిందే. ఇంత తక్కువ వ్యవధిలో ఇదెలా సాధ్యమనే విషయంపై నిపుణుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీంతో భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) స్పష్టతనిచ్చింది. వ్యాక్సిన్‌పై ప్రీ-క్లినికల్ ట్రయల్స్ విజయవంతంగా పూర్తి చేసుకున్నందునే తదుపరి మొదటి- రెండో దశ క్లినికల్ ట్రయల్స్‌కు అనుమతి ఇచ్చినట్లు ప్రకటించింది. దేశంలో అత్యవసర పరిస్థితిని పరిగణనలోకి తీసుకొని వ్యాక్సిన్‌ను వేగంగా తీసుకురావడంలో భాగంగా అంతర్జాతీయ నిబంధనలకు అనుగుణంగానే ప్రయోగాలు చేపడుతున్నట్లు స్పష్టం చేసింది.
'అంతర్జాతీయ నిబంధనలకు అనుగుణంగానే ప్రయోగాలు' - ఐసీఎంఆర్ కోవాగ్జిన్
కోవాగ్జిన్ వ్యవహారంపై నిపుణుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఐసీఎంఆర్ స్పష్టతనిచ్చింది. అంతర్జాతీయ నిబంధనలకు అనుగుణంగానే ప్రయోగాలు చేపడుతున్నట్లు పేర్కొంది. భద్రత, నాణ్యత, నైతిక విలువలను అనుసరించి దేశీయంగా వ్యాక్సిన్‌ను రూపొందించుకోవడం ఎంతో ముఖ్యమని ఐసీఎంఆర్ వెల్లడించింది.
కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్ అభివృద్ధిలో ఇప్పటికే పలు దేశాలు చేపట్టిన ప్రయోగాలు వివిధ దశలో ఉన్నాయని ఐసీఎంఆర్ పేర్కొంది. ఈ సమయంలోనే భద్రత, నాణ్యత, నైతిక విలువలను అనుసరించి దేశీయంగా వ్యాక్సిన్‌ను రూపొందించుకోవడం ఎంతో ముఖ్యమని ఐసీఎంఆర్ అభిప్రాయపడింది. భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన 'కోవాగ్జిన్' టీకాపై ఆ సంస్థ అందించిన సమగ్ర సమాచారం ఆశాజనకంగా ఉండటం వల్లే తదుపరి ప్రయోగాలకు అనుమతి ఇచ్చినట్లు స్పష్టం చేసింది. ప్రజారోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని మాత్రమే ఈ ప్రక్రియను వేగవంతం చేశామని, ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్ రూపకల్పనలో నిమగ్నమైన పరిశోధన సంస్థలు ఇదే ప్రక్రియను అనుసరిస్తున్నట్లు ఐసీఎంఆర్ పేర్కొంది.