అయోధ్యలో రామ మందిరానికి భూమిపూజతో భక్తుల కల నెరవేరే సమయం ఆసన్నమైందని పరవశించిపోతున్నారు భాజపా సీనియర్ నేత, భజరంగ్‌దళ్ వ్యవస్థాపక అధ్యక్షుడు వినయ్ కటియార్. ఈటీవీ భారత్‌తో ప్రత్యేకంగా మాట్లాడారు. 1990లలో రామమందిర నిర్మాణం కోసం జరిగిన అయోధ్య ఉద్యమాన్ని గుర్తు చేసుకున్నారు. ఆనాటి భీకర పరిస్థితుల గురించి వివరించారు.
ఆనాడు అయోధ్య ఉద్యమం ప్రారంభమైన కొద్ది రోజుల తర్వాత లాఠీ దెబ్బలు, తూటాలకు ఎదురునిలబడి కరసేవకులు పోరాటం కొనసాగించారని చెప్పారు కటియార్. ఘర్షణలతో వీధులు నెత్తురుమయమైనప్పటికీ వెనుకంజ వేయలేదన్నారు.
"రామ భక్తులపై కాల్పులు జరపాలని అప్పటి ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ ఇచ్చిన ఆదేశాలతో సరయూ నది రక్తంతో ఎరుపెక్కింది. చరిత్రలో ఆయన ఒక హంతకుడిగా గుర్తుండిపోతారు. ముస్లింలకు 40 ఎకరాల భూమి ఇవ్వాలని అప్పట్లో అటల్ బిహారీ వాజ్‌పేయీ మొదట ప్రతిపాదించారు. కానీ ముస్లింలు దానిని తిరస్కరించారు. కానీ ఇప్పుడు సుప్రీం ఇచ్చిన తీర్పుతో సంతోషిస్తున్నాం. అయోధ్య ఉద్యమ విజయంలో దివంగత అశోక్ సింఘాల్దే కీలక పాత్ర. మహంత్ అవైద్యనాథ్, పరమహన్స్ రామచంద్ర దాస్, దావూద్ దయాల్ ఖన్నా ముఖ్య భూమిక పోషించారు."
-వినయ్ కటియార్.