పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు శుక్రవారం మళ్లీ రాజుకున్నాయి. పార్లమెంటులో ఈ బిల్లు ఆమోదం పొంది ఏడాది పూర్తైన సందర్భంగా.. అసోంలోని విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. సీఏఏను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దాదాపు 18 సంఘాలు ఈ నిరసనల్లో పాల్గొన్నాయి. డిసెంబర్ 11ను చీకటి రోజుగా పేర్కొన్నాయి.
కేఎమ్ఎస్ఎస్, ఆల్ అసోం స్టూడెంట్స్ యూనియన్(ఆసు), అసోం జాతీయతాబడి యువ చత్ర పరిషత్, లచిత్ సేనతో పాటు వివిధ యువజన సంఘాలు అసోం వ్యాప్తంగా నిర్వహించిన నిరసన ర్యాలీల్లో పాల్గొన్నాయి. గతేడాది జరిగిన నిరసనల్లో కస్టడీలోకి తీసుకున్న కృషక్ ముక్తి సంగ్రామ్ సమితి(కేఎమ్ఎస్ఎస్) నేత అఖిల్ గొగోయ్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేశాయి.
వారికి తగిన సమాధానం ఇవ్వాలి
గతేడాది సీఏఏ వ్యతిరేక ఆందోళనలను ప్రారంభించిన శివసాగర్ ప్రాంతం నుంచే.. మళ్లీ తాజాగా ప్రారంభించారు. కొవిడ్ ప్రభావంతో.. ఈ నిరసనలను ఈ ఏడాది ఫిబ్రవరిలో నిలిపివేశారు.
వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల్లో భాజపా నేతృత్వంలోని ప్రభుత్వానికి తగిన సమాధానం చెప్పాలని ర్యాలీలో పాల్గొన్న విద్యార్థి సంఘాల నేతలు పిలుపునిచ్చారు. రాష్ట్రపౌరుల గుర్తింపు, భాష, సాంస్కృతిక గౌరవాన్ని సీఏఏ కాలరాస్తుందంటూ పేర్కొన్నారు. ఈ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.