బాగా చదువుకొని పరీక్షలు రాస్తాం.. ఫలితాలొచ్చాక కొన్ని రోజులకు డిగ్రీ పట్టా తీసుకొని యూనివర్సిటీల నుంచి బయటపడతాం. కానీ, ఓ వ్యక్తి పరీక్షలు రాసి ఉత్తీర్ణత సాధించినా డిగ్రీ పట్టా కోసం 17 ఏళ్లుగా నిరీక్షిస్తున్నాడు. ఓపిక నశించి నాకు డిగ్రీ పట్టా ఇప్పించండి మహాప్రభో.. అంటూ దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఇటీవల లేఖ రాసిన ఘటన దిల్లీలో చోటుచేసుకుంది.
జాతీయ మీడియా కథనం ప్రకారం.. దిల్లీలోని హైదర్‌పుర్‌కి చెందిన అమిత్‌కుమార్ వయసు 40. పదిహేడేళ్ల కిందట ఆగ్రా యూనివర్సిటీకి చెందిన ఓ కళాశాలలో బ్యాచ్‌లర్ ఆఫ్ ఎడ్యుకేషన్(బీ.ఎడ్) చదివాడు. పరీక్షల్లోనూ ఉత్తీర్ణుడయ్యాడు. అయితే, డిగ్రీ పట్టా ఇవ్వాలంటే రూ. 20వేలు చెల్లించాలని కళాశాల యాజమాన్యం డిమాండ్ చేసిందట. పేదవాడైన అమిత్ అంత డబ్బు చెల్లించలేకపోయాడు. ఆ తర్వాత అతడికి వివాహమై, ముగ్గురు సంతానం కలిగారు. స్థానికంగా ఉండే విద్యార్థులకు ట్యూషన్స్ చెబుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయినా తన డిగ్రీ పట్టా తెచ్చుకోవడం కోసం కళాశాల, వర్సిటీ చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నాడు. ఎంత బతిమిలాడినా.. డబ్బులు ఇస్తేగానీ డిగ్రీ పట్టా ఇచ్చేది లేదని యాజమాన్యం తేల్చి చెబుతోందట. దీంతో ఓపిక నశించిన అమిత్.. ప్రధాని మోదీకి తన గోడును వివరిస్తూ లేఖ రాశాడు.