అరుణాచల్‌ప్రదేశ్‌లో 32 సంవత్సరాల తరువాత భద్రతాదళాలకు స్వీయ అధికారాలు కల్పించే వివాదాస్పద 'సాయుధ దళాల (ప్రత్యేక అధికారాలు) చట్టాన్ని' పాక్షికంగా సడలించింది కేంద్రం. అరుణాచల్ ప్రదేశ్‌లో మొత్తం 9 జిల్లాలున్నాయి. వీటిలో 3 జిల్లాల్లో మాత్రమే ఈ చట్టం పాక్షికంగా సడలించారు. మయన్మార్ సరిహద్దు ప్రాంతాల్లో మాత్రం యథావిధిగా అమలుకానుంది.
జస్టిస్ బీపీ జీవన్‌రెడ్డి కమిటీ అరుణాచల్ ప్రదేశ్‌లో 'సాయుధ దళాల (ప్రత్యేక అధికారాల) చట్టం' రద్దు చేయాలని సిఫారసు చేసింది. ఈ నేపథ్యంలో అరుణాచల్ ప్రదేశ్‌లోని నాలుగు పోలీసు స్టేషన్ల పరిధిలోని 'కల్లోలిత ప్రాంతాల్లో' (ఈ పదం హోంశాఖ తొలగించింది) ఆదివారం నుంచి సాయుధ దళాల (ప్రత్యేక అధికారాల) చట్టం అమలు నిలిపివేస్తున్నట్లు హోంమంత్రిత్వశాఖ ప్రకటించింది.
ఇకపై స్వేచ్ఛ లభించేనా..
ఇకపై పశ్చిమ కెమాంగ్ జిల్లాలోని బలేము, బలుక్పాంగ్, తూర్పు కెమాంగ్ జిల్లాలోని సెయిజోసా, పపుంపరే జిల్లాలోని బలిజాన్ పోలీసు స్టేషన్ పరిధిలో ఈ చట్టం అమలు కాదు.
మరి కొంతకాలం వేచిచూడక తప్పదు
అరుణాచల్ ప్రదేశ్‌లోని ఉత్తర, ఈశాన్య ప్రాంతాల్లో ఎన్ఎస్సీఎన్, ఉల్ఫా, ఎన్డీఎఫ్బీ లాంటి నిషేధిత తీవ్రవాద సంస్థల కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. వీటిని దృష్టిలో ఉంచుకుని ఆయా ప్రాంతాల్లో ఈ చట్టం అమలు కొనసాగించాలని హోంమంత్రిత్వశాఖ నిర్ణయించింది.