రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం కేసులో అనుకూల తీర్పు కోసం సుప్రీంకోర్టును కేంద్ర ప్రభుత్వం తప్పుదోవ పట్టించిందని పిటిషనర్లు ఆరోపించారు.
రఫేల్ తీర్పు సమీక్ష కోసం పిటిషన్లు దాఖలు చేసిన మాజీ కేంద్ర మంత్రులు యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరి, న్యాయవాది ప్రశాంత భూషణ్‌లు గురువారం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. అత్యున్నత న్యాయస్థానం డిసెంబర్ 14న ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించాలని అఫిడవిట్లో పేర్కొన్నారు. తప్పుడు అధారాలు, అసత్య సమాచారాలను కోర్టుకు కేంద్రం సమర్పించిందని, వాటి ఆధారంగా ఉన్నత న్యాయస్థానం తీర్పునిచ్చిందని తెలిపారు.
పిటిషనర్ల అఫిడవిట్లో నిజం లేదు
రఫేల్ తీర్పుపై పిటిషనర్లు దాఖలు చేసిన అఫిడవిట్‌ను కేంద్ర ప్రభుత్వం తిప్పికొట్టింది. పిటిషనర్లు చేసిన ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని చెబుతూ అదనంగా మరో అఫిడవిట్ దాఖలు చేసింది. రికార్డుల్లో ఉన్నట్టే ఆధారాలను కోర్టుకు అప్పగించామంది కేంద్రం.
రఫేల్ విచారణలో భాగంగా కొంత మంది అధికారులు కోర్టును తప్పుదోవ పట్టించారని, వారిపై చర్యలు చేపట్టాలంటూ దాఖలైన వ్యాజ్యాన్ని కొట్టివేయాలని కేంద్రం సుప్రీంను కోరింది. ఆ ఆరోపణలు నిరాధారమని వెల్లడించింది. పలు మీడియా నివేదికలు, అసంపూర్ణ సమాచారాల ఆధారంగా వ్యాజ్యం దాఖలు చేయడం సరికాదని కేంద్రం అభిప్రాయపడింది.
రఫేల్ తీర్పుపై దాఖలైన రివ్యూ పిటిషన్‌ను శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించనుంది.