భారత సాయుధ దళాలు చాలా క్లిష్టమైన, అనిశ్చితి వాతావరణంలో పనిచేస్తున్నాయన్నారు త్రిదళాధిపతి జనరల్ బిపిన్ రావత్. శాంతి కోసం సైనిక సామర్థ్యాలను పెంపొందించుకోవటం కొనసాగించాలని అభిప్రాయపడ్డారు. సైనిక శక్తి బలంగా లేకపోతే.. ప్రత్యర్థులు దానిని అవకాశంగా తీసుకుని రెచ్చిపోయే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. పొరుగున ఉన్న మిత్ర దేశాలతో భారత్ తన సైనిక సామర్థ్యాలను పంచుకోవాలని సూచించారు.
రక్షణ శాఖలోని సమస్యల పరిష్కారానికి అభివృద్ధి చేసిన 'భారత్శక్తి.ఇన్' పోర్టల్ ఐదో వార్షిక సమావేశం ప్రారంభ కార్యక్రమంలో ఈ మేరకు వ్యాఖ్యానించారు రావత్.
" ఈ రోజు మనం క్లిష్టమైన, అస్థిర వాతావరణంలో పని చేస్తున్నాం. ప్రపంచంలోని ప్రతి ప్రాంతంలో చిన్న నుంచి పెద్ద వరకు ఏదో స్థాయిలో యుద్ధాలు జరుగుతున్నాయి. అందువల్ల, మనల్ని మనం రక్షించుకోవటానికి, మన దేశ సమగ్రత, రక్షణకు, ప్రజల భద్రతకు బలమైన సాయుధ దళాలు అవసరం. అయితే.. సాయుధ దళాలు యుద్ధానికి సిద్ధం కావాలని చెప్పటం లేదు. మన ప్రాంతంలో శాంతి కోసం సాయుధ దళాలు తన సామర్థ్యాలను పెంచుకోవాలి. మనకు బలమైన సైనిక శక్తి లేకపోతే, ప్రత్యర్థులు దానిని అవకాశంగా తీసుకుని దాడులకు పాల్పడతారు."