తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అడ్వాణీ బలవంతపు విశ్రాంతిపై శివసేన ఆగ్రహం - లోక్​సభ

లోక్​సభ ఎన్నికల్లో పోటీ చేయకున్నా... భాజపాకు అడ్వాణీయే అగ్రనాయకుడని అభిప్రాయపడింది శివసేన. ఆయన వల్లే భాజపా ఇప్పుడు అగ్రస్థానంలో ఉందని తెలిపింది. అడ్వాణీకి బలవంతంగా విశ్రాంతినిచ్చే క్రమంలోనే ఆయన స్థానంలో అమిత్​ షా పోటీకి దిగినట్లు తన పత్రిక సామ్నాలో పేర్కొంది.

భాజపాకు అడ్వాణీయే అగ్రనాయకుడు

By

Published : Mar 23, 2019, 5:11 PM IST

భాజపాకు అడ్వాణీయే అగ్రనాయకుడు: శివసేన
రాజకీయ భీష్మాచార్యుడిగా పేరొందిన లాల్​కృష్ణ అడ్వాణీకి భారతీయ జనతా పార్టీ లోక్​సభ స్థానాన్ని కేటాయించకపోవడంపై స్పందించింది శివసేన. ఎన్నికల బరిలో లేకపోయినా భాజపాకు అడ్వాణీయే అగ్రనాయకుడని పేర్కొంది.

అడ్వాణీ స్థానంలో అమిత్​ షా పోటీచేయటం కేవలం రాజకీయ మార్పేనని అభిప్రాయపడింది. భీష్మాచార్యుడికి బలవంతంగా విశ్రాంతినిచ్చే క్రమంలో జరిగిన చర్యగా తన పత్రిక సామ్నాలో పేర్కొంది. లోక్​సభ అభ్యర్థుల జాబితాలో ఆయన పేరు లేకపోవడం ఆశ్చర్యం కలిగించలేదని తెలిపింది. భాజపాలో అడ్వాణీ శకం ముగింపునకు వచ్చినట్లు పేర్కొంది.

"గుజరాత్​లోని గాంధీనగర్​ లోక్​సభ స్థానం నుంచి అడ్వాణీ ఆరుసార్లు గెలిచారు. ఆ స్థానంలో అమిత్​ షా పోటీ చేయటానికి అర్థం... అడ్వాణీకి బలవంతంగా విశ్రాంతినివ్వటమే. భాజపా వ్యవస్థాపక సభ్యుల్లో అడ్వాణీ ఒకరు. మాజీ ప్రధాని అటల్ ​బిహారి వాజ్​పేయీతో పాటు పార్టీని నడిపించారు. ఇప్పుడు మోదీ, షా వారి స్థానాలను తీసుకున్నారు. ప్రస్తుతం పార్టీలో సీనియర్లు ఎలాంటి బాధ్యత పొందలేని వాతావరణం నెలకొంది. రాజకీయ రంగంలో సుదీర్ఘకాలం కొనసాగారు అడ్వాణీ. ఇప్పటికీ ఆయనే భాజపాకు అగ్ర నాయకుడు. " - శివసేన

భాజపా దేశవ్యాప్తంగా విస్తరించడానికి అడ్వాణీ ప్రధాన కారణమని ప్రశంసించింది శివసేన. 1990లో అడ్వాణీ చేసిన రథయాత్ర వల్లే ఆ పార్టీ అగ్రస్థానానికి చేరుకుందని స్పష్టం చేసింది. ఆయన కృషివల్లే ఫలితం పొందిందని అభిప్రాయపడింది.

కాంగ్రెస్​పై విమర్శలు

గాంధీనగర్​ స్థానాన్ని అడ్వాణీ నుంచి లాక్కున్నారని కాంగ్రెస్​ చేసిన ఆరోపణలను తోసిపుచ్చింది శివసేన. సీనియర్​ నాయకులను కించపరిచేలా మాట్లాడకూడదని హెచ్చరించింది. కాంగ్రెస్​ పార్టీ క్లిష్టపరిస్థితుల్లో ఉన్న సమయంలో పి.వి.నరసింహారావు ముందుండి నడిపించారని, కానీ ఆయనను మరణానంతరం కాంగ్రెస్​ అవమానించిందని పేర్కొంది. సీనియర్​ నాయకుల గురించి మాట్లాడే అర్హత ఆ పార్టీకి లేదని విమర్శించింది.

ABOUT THE AUTHOR

...view details