వివాదాస్పద బాబ్రీ మసీదు కేసులో నిందితులందరినీ సీబీఐ ప్రత్యేక కోర్టు నిర్దోషులుగా ప్రకటించటంపై భాజపా నేతలు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన భాజపా అగ్రనేత ఎల్కే అడ్వాణీ.. కోర్టు తీర్పును స్వాగతించారు.
బాబ్రీ తీర్పుపై ఎల్కే అడ్వాణీ స్పందన "బాబ్రీ మసీదు కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నా. ఇది మా అందరికీ సంతోషకరమైన సమయం. తీర్పు అనంతరం జైశ్రీరాం అని నినదించాం. ఈ తీర్పు రామ జన్మభూమి ఉద్యమం పట్ల నాతో పాటు భాజపా నమ్మకాన్ని, నిబద్ధతను నిరూపిస్తుంది."
- ఎల్కే అడ్వాణీ, భాజపా అగ్రనేత
జోషి స్పందన..
బాబ్రీ కేసు తీర్పుపై మరో అగ్రనేత మురళీ మనోహర్ జోషి కూడా స్పందించారు.
మురళీ మనోహర్ జోషి స్పందన "కోర్టు వెలువరించిన తీర్పు చారిత్రకమైనది. అయోధ్యలో డిసెంబర్ 6న జరిగిన ఘటనలో ఎలాంటి కుట్ర కోణం లేదని నిరూపిస్తోంది. మా కార్యక్రమం, సభలో ఎలాంటి కుట్ర లేదు. మేం సంతోషంగా ఉన్నాం. ఇప్పుడు అందరూ రామ మందిర నిర్మాణం కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాం."
- మురళీ మనోహర్ జోషి
న్యాయానిదే విజయం: రాజ్నాథ్
సీబీఐ కోర్టు తీర్పును రక్షణ మంత్రి రాజ్నాథ్ స్వాగతించారు.
"సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పును స్వాగతిస్తున్నా. 32 మంది నిందితులను నిర్దోషులుగా ప్రకటించటం సంతోషాన్ని ఇచ్చింది. ఆలస్యం జరిగినా అంతిమంగా న్యాయమే గెలుస్తుందని ఈ నిర్ణయం నిరూపించింది" అని రాజ్నాథ్ ట్విటర్ ద్వారా తెలిపారు.
తప్పుడు కేసులు పెట్టారు: యోగి
కోర్టు తీర్పుపై ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ కేసులో సాధువులు, భాజపా నేతలు, విశ్వహిందు పరిషత్ సభ్యులపై అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఓటు రాజకీయాల కోసం తప్పుడు కేసులు పెట్టినట్లు రుజువైందన్నారు. ఈ కుట్రకు బాధ్యులైనవారు దేశానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు యోగి.
అడ్వాణీ ఇంటికి ప్రముఖులు
తీర్పు నేపథ్యంలో స్వయంగా శుభాకాంక్షలు చెప్పేందుకు కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ సహా మరికొందరు భాజపా నేతలు దిల్లీలోని అడ్వాణీ నివాసానికి వెళ్లారు.
కోర్టు తీర్పు..
బాబ్రీ మసీదు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న భాజపా అగ్ర నేతలు ఎల్కే అడ్వాణీ, మురళీ మనోహర్ జోషి సహా 32 మంది నిందితులను నిర్దోషులుగా తేల్చింది సీబీఐ ప్రత్యేక కోర్టు. వీరంతా నేరపూరిత కుట్రకు పాల్పడ్డారనేందుకు ఎలాంటి ఆధారాలు లేవని తెలిపింది.
ఇదీ చూడండి:'బాబ్రీ కేసులో నిందితులందరూ నిర్దోషులే'