తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కరోనా కారణంగా యువతలో తీవ్ర ఆందోళన!

కరోనా వైరస్ భారత్​లోని​ యువతపైనా ఎక్కువగానే ప్రభావం చూపింది. 31 శాతం మంది కౌమార దశలో ఉన్న యువతీ యువకులు తీవ్ర ఆందోళనకు గురైనట్లు తాజా సర్వే వెల్లడించింది. గత నాలుగు నెలల కాలంలో బాలికలు లింగ వివక్షకు గురికావడమే కాకుండా చదువుకు దూరమవుతున్నట్లు తెేలింది. దేశంలోని నాలుగు రాష్ట్రాల్లో నిర్వహించిన ఈ సర్వేలో దాదాపు 7,300 మంది యువత పాల్గొన్నారు.

Adolescent-youth-face-Extreme-anxiety-over-Corona
కరోనా కారణంగా యువతలో తీవ్ర ఆందోళన!

By

Published : Oct 25, 2020, 5:31 AM IST

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌ ప్రభావం దేశాల ఆర్థిక వ్యవస్థలతోపాటు వ్యక్తుల మానసిక ఆరోగ్యంపై పడుతోంది. తాజాగా మనదేశ యువతపైనా ఇది ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. కరోనా వైరస్‌ చూపిన ప్రభావంతో దాదాపు 31శాతం మంది కౌమార దశలో ఉన్న యువత తీవ్ర ఆందోళనకు గురైనట్లు తాజా సర్వే వెల్లడించింది.

గత నాలుగు నెలల కాలంలో బాలికలు లింగ వివక్షకు గురికావడమే కాకుండా చదువుకు కూడా దూరమవుతున్నట్లు తెలుస్తోంది. దేశంలోని కేవలం నాలుగు రాష్ట్రాల్లో జరిపిన ఈ సర్వేలో దాదాపు 7,300 మంది యువతీ, యువకులు పాల్గొన్నారు. 'కరోనా - ప్రభావంపై యువత అభిప్రాయం'పై సెంటర్‌ ఫర్‌ క్యాటలైజింగ్‌ ఛేంజ్‌ అనే స్వచ్ఛంద సంస్థ ఈ సర్వే జరిపింది. ఏప్రిల్‌, జులై, ఆగస్టు నెలల్లో రెండు దఫాలుగా అభిప్రాయ సేకరణ చేసింది.

తీవ్ర ఆందోళన..

సర్వేలో పాల్గొన్న యువతీ, యువకుల్లో దాదాపు 31శాతం మంది తమ కుటుంబ ఆర్థిక పరిస్థితుల గురించి తీవ్ర ఆందోళన చెందినట్లు సర్వే వెల్లడించింది. ఈ నాలుగు నెలల కాలంలో బాలికలు తీవ్ర లింగ వివక్షతకు గురైనట్లు తేలింది. సర్వేలో పాల్గొన్న బాలికల్లో దాదాపు 12 శాతం మందికే ఆన్‌లైన్‌ తరగతులకు హాజరయ్యేందుకు సొంత మొబైల్‌ ఫోన్‌లు కలిగి ఉండగా, అబ్బాయిల్లో మాత్రం 35శాతానికి ఫోన్లు ఉన్నట్లు గుర్తించింది.

51శాతం బాలికలు తమకు అవసరమైన పుస్తకాలు పొందలేదని.. ఇది అబ్బాయిలతో పోలిస్తే చాలా ఎక్కువని తెలుస్తోంది. మహమ్మారి విజృంభణ సమయంలో బాలికలు ఏ విధంగా చదువుకు దూరమయ్యారోననే విషయాన్ని ఇది తేటతెల్లం చేసిందని నివేదిక పేర్కొంది.

కుటుంబానికి ఆర్థికంగా చేదోడుగా నిలిచేందుకు దాదాపు 39శాతం బాలికలు సహాయం చేస్తుండగా, ఇది అబ్బాయిల్లో 35శాతంగా ఉంది. కేవలం 39శాతం మంది బాలికలు ఇంటినుంచి ఒంటరిగా బయటకు వెళ్లేందుకు అనుమతించగా.. 62శాతం అబ్బాయిలు స్వేచ్ఛగా తిరిగినట్లు నివేదిక తెలిపింది.

ఇక వివిధ అత్యవసర విభాగాలకు చెందిన హెల్ప్‌లైన్‌ల నెంబర్లను గుర్తించుకోవడంలోనూ యువత వెనుకబడే ఉంది. సర్వేలో పాల్గొన్న వారిలో కేవలం 36శాతం యువత వీటిని గుర్తుపెట్టుకోగా.. వీటి ఉపయోగం గురించి తెలిసిన వారిసంఖ్య మరింత తక్కువగా ఉంది.

ABOUT THE AUTHOR

...view details