తెలంగాణ

telangana

By

Published : Mar 26, 2019, 7:31 PM IST

ETV Bharat / bharat

వీళ్లు పోటీకి దూరం- వాళ్లకు విజయం దూరం

రాజకీయం అంటే గెలవడమే కాదు. కొన్నిసార్లు ప్రత్యర్థిని ఓడించడం కూడా. కర్ణాటక మండ్యలో అదే చేస్తోంది భాజపా. స్వతంత్ర అభ్యర్థి సుమలతకు మద్దతు ప్రకటించింది. కమలదళం నిర్ణయంతో అక్కడ రాజకీయం ఎలా మారింది? అధికార కూటమి ఏం చేస్తోంది?

వీళ్లు పోటీకి దూరం- వాళ్లకు విజయం దూరం

సుమలతకు భాజపా మద్దతు... ఆందోళనలో అధికార కూటమి
సుమలత వర్సెస్​ నిఖిల్. కర్ణాటక అంతా ఇప్పుడు ఇదే చర్చ. ఆ రాష్ట్రంలో 28 లోక్​సభ నియోజకవర్గాలున్నా... అందరి దృష్టి మండ్యపైనే.

మండ్యలో మంచి పట్టు... వొక్కలిగ సామాజిక వర్గం మద్దతు... కాంగ్రెస్​తో పొత్తు... అధికార పార్టీ.... ఇవన్నీ కర్ణాటక మండ్యలో జనతాదళ్​(సెక్యులర్​) పార్టీకి ఉన్న సానుకూలతలు. ఇన్ని బలాలున్నా ఓ అంశం లెక్కల్ని మార్చేసింది. అదే.. భాజపా మద్దతు. మండ్యలో పోటీ నుంచి తప్పుకుని... స్వతంత్ర అభ్యర్థి సుమలతకు మద్దతిచ్చింది కమలదళం. తద్వారా తమ ఓటు బ్యాంకును స్వతంత్ర అభ్యర్థి సుమలతకు మళ్లించనుంది.

ఇదీ చూడండి:రెబల్​ స్టార్​పై నిలిచి గెలిచేనా?

అంచనాలు తారుమారు

సుమలతకు భాజపా మద్దతుతో అధికార కూటమి మరింత ఆందోళనలో పడింది. ఒక్కసారిగా అంచనాలు తలకిందులయ్యాయి. ఇప్పుడెలా ఎదుర్కోవాలో తెలియక తలలు పట్టుకుంటోంది.

సొంత పార్టీలోని కొందరు నేతలు ప్రత్యర్థికి మద్దతిస్తున్నారన్న అనుమానాలు... కూటమిని కలవరపెడుతున్నాయి. మండ్యలోని జేడీఎస్ సిట్టింగ్​ ఎంపీ శివరామె గౌడ కొన్ని నెలల క్రితం ఉపఎన్నికల్లో ఇక్కడ గెలిచారు. ఈసారి ఆయనకు పార్టీ టికెట్​ ఇవ్వకపోవటంపై గుర్రుగా ఉన్నారు. ఇటీవల.. కాంగ్రెస్​, భాజపా నేతల్ని కలిశారు. శివరామె తెరవెనుక సుమలతకు సహకరిస్తారన్న భయం జేడీఎస్​ నేతల్ని వెంటాడుతోంది.

అనుమానాలు, ఆందోళనలతో కూటమి నేతల్లో అసహనం పెరుగుతోంది. విమర్శలు, ప్రతివిమర్శలు మరింత ఎక్కువయ్యాయి.

''సుమలతకు అధికార వ్యామోహం ఎక్కువ. అందుకే భాజపా తలుపుతట్టారు. ప్రజలకు వాస్తవం ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. భాజపా నేతృత్వంలోనే ఇలాంటి రాజకీయాలు జరుగుతున్నాయి. మండ్య ఓటర్లు ఇలాంటి రాజకీయాల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించరు. మండ్యలో స్థానాన్ని తిరిగి నిలబెట్టుకుంటాం.''

- రమేష్​ బాబు, జేడీఎస్​ అధికార ప్రతినిధి

పార్టీ శ్రేణుల ఓట్లు చేజారిపోకుండా చూసేందుకు ప్రయత్నాలు మొదలుబెట్టాయి జేడీఎస్​. కార్యకర్తలంతా నిఖిల్​వైపే నిలవాలని నిర్దేశించింది కుమారస్వామి పార్టీ. సుమలత తరఫున ర్యాలీల్లో పాల్గొన్న నలుగురు నేతల్ని ఇప్పటికే హెచ్చరించింది కాంగ్రెస్​.

సుమలత దూకుడు

భాజపా మద్దతు... సుమలతకు రెట్టింపు ఉత్సాహం ఇచ్చింది. ప్రచారంలో దూకుడు పెంచారామె. కన్నడ చిత్రసీమలోని అగ్రనటులు సుమ వెన్నంటే ఉన్నారు.

'ముప్పుంది.. రక్షణ కల్పించండి'

ప్రాణహాని ఉందని, ప్రత్యేక భద్రత కల్పించాలని ఎన్నికల సంఘాన్ని అభ్యర్థించారు సుమలత. ముఖ్యమంత్రి కుమారుడు పోటీ చేస్తున్నందున మండ్యను సమస్యాత్మకంగా స్థానంగా పేర్కొన్నారు. తనకు మద్దతుగా నిలిచిన కథానాయకుడు దర్శన్​ ఇంటిపై రాళ్లదాడి జరిగిన విషయాన్ని ఉదహరించారు.

ఇవీ చూడండి:

కన్నడనాడి: ఓట్ల బదిలీ సాధ్యమేనా?

మండ్య ప్రజల కోసమే బరిలోకి: సుమలత

ABOUT THE AUTHOR

...view details