నూతన విద్యావిధానం... పాఠశాలల పరిపాలనా విధానాల్లో పలు మార్పులు తీసుకురానుంది. ఉపాధ్యాయ శిక్షణ నుంచి పాఠశాలల నిర్వహణ, నియంత్రణ విషయాల్లో కొత్త విధానాలు అమల్లోకి రానున్నాయి. పాఠశాల విద్యాశాఖ ఇక మీదట విధానాల రూపకల్పనకు మాత్రమే పరిమితమవుతుంది. రాష్ట్రాల్లో కొత్తగా పాఠశాలల ప్రామాణాల ప్రాధికారిక సంస్థ ఏర్పాటవుతుంది. ఇకపై పనితీరు ఆధారంగా పాఠశాలలకు అక్రిడేషన్ విధానం అమలుకానుంది.
- నూతన విద్యావిధానం ప్రకారం ఉపాధ్యాయులను బోధనేతర వ్యవహారాల కోసం ఉపయోగించకూడదు. రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దేశించిన ప్రత్యేక పరిస్థితులు మినహా మిగతా విషయాల ఆధారంగా వారిని బదిలీ చేయకూడదు. ఉపాధ్యాయులకు నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ బీఈడీ కార్యక్రమం అమల్లోకి వస్తుంది. టీచర్లు ఏటా కనీసం 50 గంటలపాటు వృత్తినైపుణ్య శిక్షణ పూర్తిచేయాలి.
- ప్రతి ఆవాస ప్రాంతంలో ఒక పాఠశాల ఏర్పాటు చేయాలని కస్తూరి రంగన్ కమిటీ పేర్కొంది. అయితే చాలా చోట్ల పాఠశాలల్లో తగినంత మంది విద్యార్థులు లేరు. 2016-17 లెక్కల ప్రకారం ప్రాథమిక పాఠశాలల్లో ఒక్కో తరగతికి సగటున 14 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారు. ఇలాంటి చిన్న పాఠశాలలు నిర్వహించడం ఆర్థికంగా ఇబ్బందికరం. అందుకే ఇలాంటి చిన్న పాఠశాలలను కలిపి ఒక చోట స్కూల్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయాలని కొత్త విధానం సిఫార్సు చేసింది. దీని ప్రకారం ఒక్కో స్కూల్‌కాంప్లెక్స్‌లో ఒక మాధ్యమిక పాఠశాలతోపాటు, ప్రాథమిక పాఠశాలలు ఉండాలి. దీనికి 5-10 కిలోమీటర్లలో అంగన్‌వాడీలు ఏర్పాటు చేయాలి. ఈ విధానంవల్ల స్కూల్‌కాంప్లెక్స్‌లో అన్ని సబ్జెక్ట్‌లకూ తగినంత మంది టీచర్లు అందుబాటులో ఉంటారు.
- ప్రస్తుతం పాఠశాల విద్యాశాఖే అన్ని బాధ్యతలు చూస్తోంది. దీనివల్ల అధికారాలు కేంద్రీకృతమై ప్రయోజన వైరుద్ధ్యం తలెత్తున్నట్లు కమిటీ గుర్తించింది. అందువల్ల ఇకమీదట ఈ శాఖను కేవలం విధానాల రూపకల్పన, పర్యవేక్షణకు మాత్రమే పరిమితం చేస్తారు. పాఠశాలల నియంత్రణలో అది జోక్యం చేసుకోకూడదుయ.