1947 ఆగస్టు 15న దేశంలో బ్రిటిషు పాలన పూర్తిగా అంతం కాలేదా? సాంకేతికంగా చూస్తే కాలేదని చెప్పాలి. రాజ్యాంగం తయారు కాకపోవడమే అందుకు కారణం. భారత ప్రభుత్వ చట్టం-1935 ప్రకారం పరిపాలన సాగుతుండడం. దాంతో స్వాతంత్ర్యం వచ్చినా పూర్తిగా సొంత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొనే అధికారం ఆ చట్టం ప్రకారం భారతీయులకు లేదు. భారత్‌కు ‘అధినివేశ ప్రతిపత్తి’ (డొమీనియన్ స్టేటస్) ఉండేది.
సర్వ స్వతంత్రులం ఎప్పుడయ్యాం?: 1950 జవనరి 26. ఆ రోజున భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. దేశం గణతంత్రం (రిపబ్లిక్)గా అవతరించింది. గణతంత్రం అంటే దేశాధినేతను ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రజలు ఎన్నుకోవడం.
రాజ్యాంగ నిర్మాణం సాగిందిలా..
1934:దేశానికి ప్రత్యేకంగా రాజ్యాంగం ఉండాలని, దీని రూపకల్పనకు సభ ఏర్పాటు చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ వ్యవస్థాపక నాయకుడు మానవేంద్రనాథ్ రాయ్ డిమాండు చేశారు. కాంగ్రెస్ పార్టీ దీనినే ఓ ప్రముఖ డిమాండ్‌గా బ్రిటిషు ప్రభుత్వం ముందు ఉంచింది.
1946 డిసెంబరు 6: స్వాతంత్ర్యం రాక మునుపే రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు
డిసెంబరు 9: కాన్‌స్టిట్యూషన్ హాల్ (ప్రస్తుతం పార్లమెంటు సెంట్రల్ హాలు)లో తొలి సమావేశం నిర్వహణ