సౌదీలో కేరళ నర్సుకు సోకిన కరోనా వైరస్
20:05 January 23
సౌదీలో కేరళ నర్సుకు సోకిన కరోనా వైరస్
చైనా సహా ప్రపంచదేశాలను భయపెడుతోన్న కరోనా వైరస్.. వేగంగా వ్యాపిస్తోంది. అమెరికా, సింగపూర్, వియత్నాంలను తాకిన ఈ బ్యాక్టీరియా... తాజాగా సౌదీకీ పాకింది. అక్కడి భారతీయ నర్సుకు కరోనా వైరస్ సోకినట్లు, ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నట్లు తెలిపారు విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి. మురళీధరన్.
చైనాలో పుట్టి... ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్... కేరళకు చెందిన నర్స్‌కు సోకినట్లు గుర్తించారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నట్లు విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి.మురళీధరన్ చెప్పారు. జెడ్డాలోని ఆల్‌హయత్ ఆస్పత్రిలో పనిచేస్తున్న కేరళకు చెందిన 100 మంది నర్స్‌లను పరీక్షించగా....ఒకరికి ప్రాణాంతక కరోనా వైరస్ సోకినట్లు గుర్తించారు.
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధిత నర్సు.. ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతున్నట్లు కేంద్ర మంత్రి చెప్పారు. చైనాలో ఈ మహమ్మారి ధాటికి ఇప్పటివరకు 17 మంది బలయ్యారు. దీంతో అప్రమత్తమైన భారత్... చైనా నుంచి వచ్చే ప్రయాణికులకు విమానాశ్రయాల్లో స్క్రీనింగ్ పరీక్షలను నిర్వహిస్తోంది. ఇప్పటివరకూ 60 విమానాలకు చెందిన దాదాపు 13 వేల మందిని స్క్రీనింగ్‌చేయగా వారిలో ఏ ఒక్కరికీ వైరస్ సోకలేదని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.