తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భారతీయులకు నోబెల్​: ఠాగూర్​ నుంచి అభిజిత్​ వరకు..

ప్రవాస భారతీయ ఆర్థికవేత్త అభిజిత్​ బెనర్జీకి ఆర్థిక రంగంలో నోబెల్​ బహుమతి లభించింది. అంతర్జాతీయంగా పేదరికాన్ని నిర్మూలించేందుకు చేసిన పరిశోధనలకు, ప్రతిపాదనలకు గానూ మరో ఇద్దరితో కలిసి ఈ పురస్కారాన్ని పంచుకోనున్నారు. తద్వారా.. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మక అవార్డు సాధించిన భారతీయులు, భారత సంతతి వ్యక్తుల సరసన చేరారు.

భారతీయ నోబెల్​ గ్రహీతల సరసన అభిజిత్​

By

Published : Oct 15, 2019, 5:30 AM IST

Updated : Oct 15, 2019, 7:57 AM IST

అర్థశాస్త్రంలో నోబెల్​ బహుమతి పొందిన ప్రవాస భారతీయ ఆర్థిక వేత్త అభిజిత్​ బెనర్జీ... ఈ గౌరవం సాధించిన ప్రముఖ భారతీయుల సరసన నిలిచారు. పేదరికాన్ని నిర్మూలించేందుకు చేసిన పరిశోధనలు, ప్రతిపాదనలకు గానూ ఆయనను ఈ పురస్కారం వరించింది. ఆయన భార్య ఎస్తర్​ డఫ్లో, మరో అమెరికా ఆర్థిక వేత్త మైకేల్​ క్రెమర్​లతో కలిసి అవార్డును పంచుకోనున్నారు.

ముంబయిలో జన్మించిన ఈ 58 ఏళ్ల అభిజిత్​.. ప్రస్తుతం అమెరికాలోని మసాచుసెట్స్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ టెక్నాలజీలో అర్థశాస్త్రం బోధిస్తున్నారు. 1988లో హార్వర్డ్​ విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్​డీ పట్టా పొందారు. అంతకుముందు యూనివర్సిటీ ఆఫ్​ కలకత్తా, దిల్లీ జేఎన్​యూలో విద్యనభ్యసించారు.

ఇదీ చూడండి:ముంబయి నుంచి నోబెల్​ వరకు.. అభిజిత్​ ప్రస్థానం

ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాత నోబెల్​ పురస్కారం పొందిన అతి కొద్ది భారతీయులు, భారత సంతతి వ్యక్తుల సరసన చేరారు అభిజిత్​.

1. ఠాగూర్​

సాహిత్యరంగంలో చేసిన కృషికి గానూ భారతీయుల్లో మొట్టమొదటగా రవీంద్రనాథ్​ ఠాగూర్​కు 1913లో నోబెల్​ బహుమతి లభించింది. బెంగాలీ భాషలో రచించిన ఎన్నో భక్తిగీతాలను ఆంగ్లంలోకి అనువదించి... గీతాంజలి కావ్యాన్ని రచించారు. ప్రపంచ రచనల్లోనే గొప్పదిగా పేరుగాంచిన ఈ రచనకే సాహిత్యంలో ఠాగూర్​ను నోబెల్​ వరించింది.

2. సీవీ రామన్​

ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త సీవీ రామన్​ చేసిన కృషికి గానూ... ఆయనకు 1930లో నోబెల్​ పురస్కారం లభించింది. కాంతి పరిక్షేపణంపై ఈయన చేసిన పరిశోధన 'రామన్​ ఎఫెక్ట్​' ఎందరి నుంచో ప్రశంసలను అందుకొంది.

3. ఖురానా

భారత సంతతికి చెందిన హర్​గోవింద్​ ఖురానా వైద్య విభాగంలో 1968లో నోబెల్​ బహుమతి అందుకున్నారు. కృత్రిమ జన్యువుల రూపకల్పన, ప్రొటీన్​ సంశ్లేషణ, జెనెటిక్​ ఇంజినీరింగ్​ ఆవిష్కరణకు గానూ మరో ఇద్దరితో కలిసి ఈ అవార్డును అందుకున్నారు.

4. మథర్​ థెరీసా...

ఆల్బేనియా దేశానికి చెందిన రోమన్​ కాథలిక్​ నన్​ మదర్​ థెరీసాకు 1979లో నోబెల్​ శాంతి బహుమతి లభించింది. భారత పౌరసత్వం స్వీకరించిన ఈమె కోల్​కతాలో 'ది మిషనరీస్​ ఆఫ్​ ఛారిటీ'ని స్థాపించారు. దీని ద్వారా ఎందరో పేదలకు, రోగగ్రస్థులకు అసమానమైన సేవ చేశారు. వ్యసన పీడితుల నుంచి ఎయిడ్స్​ బాధితుల వరకు సకల మానవాళికి తోడు నిలిచారు థెరిసా.

5. సుబ్రమణియన్​ చంద్రశేఖర్​

నక్షత్రాల పుట్టుక, పరిణామాలపై సరికొత్త కాంతిని ప్రసరింపజేసినందుకు చంద్రశేఖర్​కు 1983లో భౌతిక శాస్త్రంలో నోబెల్​ బహుమతి లభించింది. ఈయన చంద్రశేఖర్​ లిమిట్​ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు.

6. అమర్థ్యసేన్​

అర్థశాస్త్రంలో చేసిన విశేష సేవలకు గానూ బంగాల్​కు చెందిన ఆర్థిక వేత్త అమర్థ్యసేన్​కు 1998లో నోబెల్​ పురస్కారం లభించింది. సంప్రదాయ అర్థశాస్త్రం తరతరాలుగా విస్మరిస్తూ వచ్చిన 'జన సంక్షేమం' పైకి అందరి దృష్టీ మళ్లేలా చేయటం సేన్ సాధించిన​ ఘనత.

7. వెంకట్రామన్​ రామకృష్ణన్​

భారత సంతతికే చెందిన వెంకట్రామన్​ రామకృష్ణన్​ 2009లో రసాయన శాస్త్రంలో నోబెల్​ బహుమతి అందుకున్నారు. రైబోజోమ్​ల పనితీరు, నిర్మాణంపై చేసిన అధ్యయనానికి గానూ మరో ఇద్దరితో కలిసి ఈ అవార్డును పంచుకున్నారు.

8. కైలాశ్​ సత్యార్థి

భారతీయ బాలలహక్కుల ఉద్యమకారుడు కైలాశ్​ సత్యార్థి... 2014లో పాకిస్థాన్​ టీనేజర్​ మలాలాతో సంయుక్తంగా నోబెల్​ శాంతి బహుమతి అందుకున్నారు. ''యువత, బాలల అణచివేతకు వ్యతిరేకంగా వారి పోరాటానికి, అందరు పిల్లలకూ విద్యాహక్కు'' కోసం ఉద్యమించిన కారణంగా ఈ అవార్డు దక్కింది.

తాజాగా ప్రవాస భారతీయుడు అభిజిత్​ బెనర్జీ అర్థశాస్త్రంలో నోబెల్​ బహుమతి పొంది.... వీరి సరసన చేరారు.

ఇదీ చూడండి:నోబెల్​ గ్రహీత అభిజిత్​పై ప్రశంసల వెల్లువ

నోబెల్​ బహుమతుల్ని 1901 నుంచి ఇస్తున్నారు. 2018 వరకు మొత్తం 590 సార్లు 935 మంది వ్యక్తులు, సంస్థలకు అవార్డు అందజేశారు. ఈ పురస్కారం కింద 9 మిలియన్​ క్రోనార్ల నగదు, బంగారు పతకం, ప్రశంసా పత్రం బహుమానంగా పొందుతారు.

Last Updated : Oct 15, 2019, 7:57 AM IST

ABOUT THE AUTHOR

...view details