తెలంగాణ

telangana

ETV Bharat / bharat

42 ఏళ్ల అజ్ఞాతవాసం వీడి.. భారత్​కు చేరిన రాములోరు! - Idols news of Rama

ధర్మం మూడు పాదాలపై నడిచిన త్రేతాయుగంలో దశరథరాముడు 14 ఏళ్లు వనవాసం చేశాడు. అదే శ్రీరాముడికి కలియుగంలో 42 ఏళ్ల అజ్ఞాతవాసం తప్పిందికాదు. నాడు సీతాలక్ష్మణ సమేతుడై అడవుల్లో గడిపిన ఆ కోదండ రాముడు.. ఇప్పుడు కూడా సతీ, సోదరుడు సహా తస్కరణకు గురై 42ఏళ్ల పాటు అజ్ఞాతంలో ఉండాల్సి వచ్చింది. తమిళనాట జరిగిన ఈ సంఘటన మరో రామాయణాన్ని తలపిస్తోంది.

Abducted idols of Lord Rama in Tamilanadu and it was arrived to India after 42 years
అజ్ఞాతవాసం వీడి.. భారత్​కు చేరిన రాములవారి విగ్రహాలు

By

Published : Sep 18, 2020, 5:42 PM IST

తమిళనాడు ఆనందమంగళంలోని శ్రీరాజగోపాల ఆలయంలోని సీతారామలక్ష్మణ పంచ లోహ విగ్రహాలు 1978లో అపహరణకు గురై బ్రిటన్‌కు చేరాయి. ఇటీవలే వాటిని తిరిగి భారత్‌కు తీసుకురాగా.. రామాయణంలో అజ్ఞాతవాసం పరిసమాప్తమైంది.

భారత ఆలయాలు ఒకప్పుడు విశేషమైన సంపదకు నిలయాలుగా ఉండేవి. వందల ఏళ్లుగా ఆలయాలపై అనేక దాడులు, దోపిడీలు జరిగాయి. ముఖ్యంగా పంచ లోహాలతో చేసిన విగ్రహాలు దొంగలకు ప్రధాన లక్ష్యంగా ఉండేవి. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా ఎన్నో ప్రతిమలను అక్రమంగా దేశం దాటించారు. తద్వారా కోట్లు సంపాదించారు. ఇదే తీరుగా ఎప్పుడో 40 ఏళ్ల క్రితం భారత్‌లో దొంగతనానికి గురైన మూడు దేవతా విగ్రహాలు.. ఇండియా ప్రైడ్‌ అనే ఔత్సాహిక బృంద సభ్యుల కృషితో భారత్‌ చేరుకున్నాయి.

ఎలా బయటపడ్డాయంటే?

విజయనగర సామ్రాజ్యంలో భాగంగా ఉన్న ప్రస్తుత తమిళనాడులోని ఆనందమంగళం అనే గ్రామంలో ఆనాటి రాజులు ప్రతిష్టించిన శ్రీరాముడు, లక్ష్మణుడు, సీతమ్మ వారి విగ్రహాలు 1978లో మాయమయ్యాయి. 15వ శతాబ్దానికి చెందిన ఈ పంచలోహ విగ్రహాలు చాలా ఖరీదైనవి. వీటిలో ఒకదాన్ని బ్రిటన్‌లో పురాతన వస్తువులు విక్రయించే ఓ వెబ్‌సైట్‌లో ఇండియా ప్రైడ్‌ ప్రాజెక్ట్‌ సభ్యుడొకరు చూశారు. ఇది విజయనగర శైలిలో ఉన్నందున అనుమానం వచ్చి శోధించగా అక్రమంగా దేశం దాటించిన విగ్రహాలుగా తేలింది. ఇందుకోసం వాళ్లు వివిధ ఆలయాల విగ్రహాల ఆకృతులతో పాటు ఎన్నో ఆలయాల పురాతన విగ్రహాల ఫొటోలను సరిపోల్చగా.. 1958లో ఆనందమంగళం గ్రామంలోని శ్రీరాజగోపాల స్వామి ఆలయంలో తీసిన ఫొటోతో ప్రస్తుత విగ్రహాలు సరిపోలాయి.

తేలని 'బ్రిటన్'​ మిస్టరీ

ఇదే విషయాన్నిఇండియా ప్రైడ్‌ సభ్యులు భారత హైకమిషన్‌కు తెలిపారు. కానీ.. అవి భారత్‌ నుంచి అక్రమంగా వచ్చాయని బ్రిటన్‌ ప్రభుత్వానికి తెలిపేందుకు కచ్చితమైన ఆధారాలు చూపాల్సి వచ్చింది. దీంతో బృంద సభ్యులు, భారత అధికారుల తీవ్ర ప్రయత్నాల మధ్య ఆనందమంగళంలోని స్థానిక పోలీస్​ స్టేషన్‌లో 1978 నవంబర్‌ 24న నమోదైన కేసును గుర్తించారు. విగ్రహాల దొంగతనం కేసులో అప్పుడు అరెస్టు చేసిన ముగ్గురి వాంగ్మూలాలు బయటపడ్డాయి. అందులో దొంగిలించిన విగ్రహాలను గుర్తు తెలియని వ్యక్తులకు అమ్మినట్లు దోషులు పేర్కొన్నారు. ఈ కేసులో వారు తొమ్మిది నెలలు శిక్ష అనుభవించినట్లూ నమోదై ఉంది. ఈ కేసు పత్రాలతో పాటు మరికొన్ని ఆధారాలనూ బ్రిటన్‌కు పంపగా, ఆ విగ్రహాలను తిరిగి ఇచ్చేందుకు బ్రిటన్‌లోని విగ్రహాలు విక్రయించిన డీలర్‌ అంగీకరించాడు. అయితే.. ఇవి బ్రిటన్‌ చేరిన విధానం మాత్రం ఇప్పటికీ అంతుచిక్కని కథగానే ఉంది.

కనిపించని హనుమంతుని జాడ

ఇరుదేశాల దౌత్యవేత్తల ప్రయత్నాల మధ్య నాలుగేళ్ల కృషి ఫలితంగా.. సెప్టెంబర్‌ 15న విగ్రహాలు భారత్‌ చేరుకున్నాయి. కానీ హనుమంతుడి విగ్రహం మాత్రం లభించలేదు. ఇది సింగపూర్‌లోని ఓ మ్యూజియం‌లో ఉన్నట్లు భారత అధికారులు అనుమానిస్తున్నారు. ఇవి మ్యూజియంలో ఉంచే వస్తువులు కాదని, భారతీయుల విశ్వాసాలకు ప్రతీకలని, నిత్యం పూజల నడుమ అలరారే విగ్రహాలని.. వీటిని తిరిగి భారత్‌ చేర్చడం గర్వకారణమని ప్రైడ్‌ ఇండియా ప్రతినిధులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి:ఆ విద్యార్థి కోసం భారత్​-నేపాల్ వంతెన రీఓపెన్

ABOUT THE AUTHOR

...view details